| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - ప్రథమాశ్వాసము |
| వ. | దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె: నట్లు సకల బంధుమిత్త్ర జనంబులకు నుదకకర్మం బాచరించి పాండవులు గంగా తీరంబున నశుచిత్వం బపనయించుటకయి యొక్క సమస్థలంబునం బటకుటీర సంవిధానంబు సేయించి, ధృతరాష్ట్ర విదుర సర్వభరత భార్యాసమేతంబుగా నచ్చట మాసమాత్రంబు నిలిచి; రట్టియెడం గృష్ణద్వైపాయన నారద దేవల దేవస్థాణు కణ్వులు మొదలుగాఁగల మునీంద్రు లనేకులు శిష్యవర్గ సహితంబుగా ధర్మనందను సందర్శనంబునకుం జనుదెంచిన, నజ్జననాథుండు ప్రత్యుత్థాన ప్రణామ పాద్యాస నాకలనంబులను దత్కాలోచితార్చనంబులను నమ్మహాత్ములం బ్రీతులం గావించి, కృష్ణనిజానుజయుక్తంబుగా వారల నుపాసించి యుండ, వారలు బహువిధంబులగు ప్రియవచనంబుల నక్కురువంశసత్తము సంభావింప నారదుం డమ్మహనీయద్విజులం గలయం గనుంగొని యక్కౌంతేయాగ్రజుతోడం దాను గుశల ప్రశ్నంబు లగుమాట లాడంగలవాఁ డగుట వారి కెఱింగించి యమ్మహీపతియాననం బాలోకించి. | 2 |
| శా. |
‘గోవిందుం డనిశంబు శోభన మెదం గోరంగఁ బార్థుండు ద ర్పావేశోజ్జ్వల బాహుసార మహనీయస్ఫూర్తి శోభిల్ల గాం డీవోల్లాస విభాసియై సమరపాండిత్యంబు వాటింప సం భావింపన్ జగమెల్ల రాజ్య మిటు లొప్పం గొంటె రాజోత్తమా! |
3 |
| చ. |
‘భువన భయంకరంబు లగు పోరులఁ దమ్ములతోడఁ గూడ నీ వు వెడలఁబాటు లెస్స; యలవుం జలమున్ వెలయించుచోట ధ ర్మువున కొకింతయుం దొలఁగఁ ద్రొక్కమి యెంతయుమేలు; దీనఁ గౌ రవకులముఖ్య! యుమ్మలిక గ్రాఁచితె? చిత్తముఁ బ్రీతిఁ బొందెనే?’ |
4 |
| వ. | అనిన విని యజ్జనవిభుం డమ్ముని విభున కిట్లనియె. | 5 |
| సీ. |
‘కృష్ణుండు మామీఁదఁ గృపసేయుటయు, బ్రాహ్మ | ణానుగ్రహంబున ననిల పుత్త్ర పార్థుల పటు బాహు బలమున మేదిని | యంతయుఁ జేకుఱునట్టి దయ్యె; నైనను నతిఘోర మగు నఖిల జ్ఞాతి | వధ మొనరించుట వలన నధిక గుణుని సౌభద్రునిఁ గుల భూషణంబుఁ బాం | చాలీ తనూజ పంచకముఁ గోలు |
|
| తే. |
పోకఁ జేసియు గెల్పు గెల్పుగ మదీయ | బుద్ధి గైకొన దయ్యెడు సిద్ధముఖ్య! యదియుఁ గాక వేఱొక్కండు మదిఁ గలంచు | చున్నయది; దాని నేర్పడ విన్నవింతు. |
6 |
| చ. |
ఘనభుజ విక్రమోన్నతుఁడు, కౌరవకోటికిఁ బట్టుకొమ్మ మ మ్మని మొనఁ దూలపుచ్చిన మహాత్ముఁడు గర్ణుఁడు గొంతి తొల్తచూ లని యుదక ప్రదాన సమయంబున నాయమచేత వింటి; నా తని కుదకంబు లిచ్చుటకుఁ దా మముఁ బంచుట గోరి చెప్పినన్. |
7 |
| వ. | అప్పుడు దొడంగి యంతరంగంబు నిప్పులం బొరఁటినట్లయ్యెడి; నక్కుంతీమహాదేవి దాను దివాకరువరంబున నప్పురుషవరుం బడసి పాఱవైచుటయుం, బిదప నతండు ధార్తరాష్ట్రులపాల దొరయైయుండ మాకును వారికిం గలహంబు పుట్టిన నది మాన్పించుటకై యక్కొడుకు కడకుం జని యేకాంతంబునం బుట్టువు దెలుపుటయు, లోనయిన తద్విషయ వార్త లనుదినంబును జెప్పుచుండు. | 8 |
| సీ. |
ఆ యమ దనపుత్రుఁ డవుట యెఱింగించి | ‘తమ్ములలోనికి రమ్ము నీవు’ నావుడు నాతండు ‘నాకుఁ గృతఘ్నత | వాటిల్లదే కురుపతిఁ దొఱంగి వచ్చిన; నదిగాక వాసవితోడి క | య్యంబున కితఁ డోడె ననరె; యతఁడు బెరయ నొండెను నన్ను బెరసి యొండెను నేవు; | రింతియకాని నీ వెపుడు నీకుఁ |
|
| ఆ. |
దనయు లార్వు రనకు’ మనియె; నిద్దేవి ‘ద | క్కనుజు లెల్లవారి కభయ మొసఁగు’ మనిన ‘నట్ల కాక’ యని మమ్ము నలువురఁ | బట్టెఁ గాని తెగఁడ ప్రాణములకు. |
9 |
| ఆ. |
తొల్లి తాన దాఁచెఁ దల్లి; పదంపడి | యతఁడు సెప్పవలవ దనఁగ దాఁచె; నిట్లుగాఁగ నెఱుఁగ మేవురమును నతం | డిట్టిఁ డగుట; దాన నింత వుట్టె. |
10 |
| క. |
ఆతఁడు దుర్యోధనునకుఁ | బ్రీతిగ జూదంబునాఁడు పెక్కాడెను ధ ర్మేతరములు; వానికి మ | చ్చేతోగతి కోపభరము సెందక యుండున్. |
11 |
| ఆ. |
అతనిమేను కుంతి యట్టుల కైవడి | యరయ నేను జూచి యాత్మ నెద్ది కారణంబొ యిట్లుగా ననుచుండుదు ; | నేమి సేయువాఁడ నింకఁ జెపుమ! |
12 |
| క. |
కౌరవులు సేయు నవమతి | కారణముగఁ గోప మెత్తుఁ, గర్ణుని వదనాం భోరుహముం గనుఁగొన శమ | మారున్ నావశముగాక యంతన బుద్ధిన్. |
13 |
| ఉ. |
గాండివి నొవ్వఁబల్కి తిటు; ‘గర్ణునిఁ జంపక వచ్చితేని త మ్ముండవు గావు నాకు’ నని మూర్ఖత; సోదరఘాతి నైన క ష్టుండ; మనంబునం బెఱుగు శోకము నెట్లు సహింతుఁ? దప్పె; నా తండును నేము నైన విబుధప్రకరంబును మాకు నడ్డమే!’ |
14 |
| వ. | అని పలికి, ‘మునీంద్రా! యమ్మార్తాండనందను రథచక్రంబు భూమిం గ్రుంగుటకుం గారణం బెద్ది? దాని, న వ్వీరుండు పరశురామునిచేత శప్తుండయిన తెఱంగును నెఱింగింప వలయు; భువనంబుల వర్తనంబులు నీకుం దేటపడనియవి లేవు; గావున ని న్నడిగెద’ నని ప్రార్థించుటయు, ‘నవ్విధంబంతయు వివరించెద విను’ మని యమ్మహీపతి కమ్మహాత్ముం డిట్లనియె: | 15 |