| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - ప్రథమాశ్వాసము |
| సీ. |
‘దేవతల్ వేదవిధి ప్రవర్తకులు; బ్రా | హ్మణులును వారలయట్ల శ్రుతుల కింకరులై కాదె కిల్బిషంబులఁ బాసి | వారిచందమున శాశ్వత విభూతి నొందుట; యజ్ఞాదు లుడుగుట సంపరి | త్యాగమే?; పాడిమై నర్థముల ను పార్జించి దేవతా బ్రాహ్మణ పూజగా | నిడుచుఁ దత్ఫలకోటి విడుపుగాక; |
|
| ఆ. |
క్రోధశోకహర్ష కోటుల గృహముతో | విడిచి యోగ మూఁది వృక్షమూల వాసనిరతి నుండువాఁడెపో సంపరి | త్యాగి; నృపుల కది సమర్హ మగునె? |
75 |
| క. |
తక్కిన మూఁ డాశ్రమములు, | నొక్కదెస గృహస్థ ధర్మ మొకదెసఁ దులయం దెక్కింప వానితో న | య్యొక్కటి సరిదూఁగె నందు రుర్వీశ! బుధుల్. |
76 |
| వ. | కావున గృహస్థ ధర్మంబ యాదరణీయం; బట్లుంగాక. | 77 |
| క. |
జతనంబున నర్థము సం | చితముగఁ గావించి క్రతువిశేషంబుల దే వతలం దృప్తులఁ జేయమి | యతికిల్బిషకారి యందు రాగమవేదుల్. |
78 |
| చ. |
వినుము! తమోమయం బయిన విశ్వముఁ దా వెలిఁగించు నీశ్వరుం డన నొకరుండు; వర్ణతతి నాశ్రమకోటిని వాఁడుఁ గాదె చే సె; నిఖిల కర్మయోగ సవిశేషత గల్గుటయుం దదీయ క ల్పనను; తదాజ్ఞకుం దొలఁగఁ బాడియె శోకము గారణంబుగన్. |
79 |
| వ. | హింసాదోషంబు గలుగునను శంకకుం బనిలే; దవధరింపుము. | 80 |
| క. |
పరుల వధింపక యెవ్వఁడు | ధర యేలెం జెపుమ పూర్వ ధరణీశులలోఁ? బొరయదు పాపము సుగతిక | యరిగిరి వా; రీవు నట్ల యగు టొప్పు నృపా! |
81 |
| క. |
రక్ష ప్రజ గోరు నిజయో | గక్షేమార్థముగ; జన సుఖస్థితి నడపన్ దక్షుఁ డగు రాజు నడప కు | పేక్షించినఁ బాప మొందదే కురుముఖ్యా! |
82 |
| తే. |
గోవులను ఘోటకంబులఁ గుంజరముల | దాసులను బ్రీతి నిమ్మెల్ల ధాన్యములను గ్రామముల మందిరముల నిష్కముల వేడ్క | నొసఁగు తత్తత్సుపాత్రత్వయుక్త విధుల. |
83 |
| వ. | వీని నన్నింటి రిత్తవో విడిచి పోయెద ననుట నీ యట్టి మహానుభావునకుం దగునే?’ యని పలికినం దదనంతరంబ సహదేవుం డమ్మహీపతి కిట్లనియె. | 84 |
| సీ. |
‘వెలి వెలి వస్తువుల్ విడిచెఁబో నరుఁడు గ | ర్మిష్ఠతం గాదె శరీర యాత్ర నడపువాఁ; డది మోక్షణంబు గానేరదు; | శారీర సౌఖ్యసంసక్తి వదలి బాహ్యపదార్థముల్ పాటించి నిజవంశ | ధర్మముల్ వదలక తగఁ జరింపు మమత బంధంబు నిర్మమత మోక్షంబును | జేయు; నింత యెఱింగి చేసి రధిప! |
|
| తే. |
రాజ్య మెలమి మన్వాదు; లరణ్యమునకు | నరిగి నీ వందు వలయు ద్రవ్యముల మీఁదఁ జేయవలదె మమత్వంబు; వేయు నేల? | యదియు సంసార చక్రవాహకము గాదె? |
85 |
| తే. |
నీవ చుట్టంబుఁ బక్కంబు, నీవ చెలియు, | నీవ తల్లియుఁ దండ్రియు, నీవ గురువు, నీవ దైవంబుఁ గావున నా విషాద | భాషణంబులు సైరింపు భరతముఖ్య!. |
86 |
| క. |
తథ్యము లైనను దలఁప న | తథ్యము లైనను సభక్తి తాత్పర్యము వై తథ్యంబుఁ బొరయకుండఁగఁ | బథ్యంబుగఁ గొనుము నాదు పలుకులు కరుణన్.’ |
87 |
| వ. | అనియె; నిట్లు దమ్ము లందఱును బోధించు పలుకులు విని ధర్మనందనుం డూరక యుండె; నతనియెడ సవిశేష బహుమానయు, నతనిచేత సంతతోపలాలితయు, ధర్మాధర్మ నిదర్శన శీలయు నగు పాంచాలి భద్రగజప్రతిమానులైన యప్పవమానతనయ ధనంజయ నకుల సహదేవుల మధ్యంబున యూథపతివోలె నున్న యన్నరేంద్రు నల్లన చేరి, ‘యేనును నా యెఱింగినంత సెప్పెద’ నని యనుజ్ఞఁ గొని యవ్విభు వదనంబున నిజ విశాలలోచన రోచులు పరఁగ వినయం బాననంబున నతిశయిల్ల నిట్లనియె. | 88 |