పురాణేతిహాసములు శ్రీమహాభారతము శాంతిపర్వము - ప్రథమాశ్వాసము
పారాశర్యుఁడు సుద్యుమ్న చరితంబు ధర్మజునకుఁ జెప్పుట (సం. 12-24-1)
క. ‘విను శంఖుండును లిఖితుం | డన నిరువురు విప్రవర్యు లన్నయుఁ దమ్ముం
డును గలరు బాహుదాతీ | ర నివాసులు ధర్మతత్పర మనోవృత్తుల్‌.
159
సీ. వారి యాశ్రమముల భూరిపుష్ప ఫలాభి | వృద్ధి నొప్పారెడి వివిధ భూరు
హంబులు గల; వొకయపుడు శంఖుండు గృహమ్మున లేకుండ ననుజుఁ డచటి
కరిగి యందొక మ్రాన నారఁబండిన పండ్లు | గని వేడ్కమై గోసికొని తినంగ,
నయ్యన్న యేతెంచి ‘యనుజ! యీ ఫలము లె | క్కడియవి చెప్పు’ నావుడును వార్చి
 
తే. ప్రణతుఁడై ‘యిచ్చటివ’యని పలికె లిఖితుఁ; | డాతఁ ‘డనుమతి లేక కోయంగఁ దగునె?
మ్రుచ్చిమియ కాదె యది? పాప మచ్చుపడియె; | నృపతిచే దండితుండవై నీఁగికొనుము.
160
వ. రయంబున రాజసన్నిధికిం జని, భవత్కర్మం బుపన్యసించి దండించుట వేఁడు’ మని పలికినం దెలిసి ‘యట్లకాక’ యని లిఖితుండు సుద్యుమ్నుఁ గానంబోయి నగరి వాకిట నిలిచినం, బ్రతిహారు లమ్మహాత్ము నరుగుదెంచుట యమ్మహీపతి కెఱింగించిన, నతండు సంభ్రమంబున సామాత్యుండై యాసంశితవ్రతుం డున్నయెడకుం జని వినయంబు సేసి ‘మీర లిచ్చటికి వేంచేసిన ప్రయోజనం బేమి? యానతిండు; మీ చెప్పినట్ల చేసెద’ నని విన్నవించిన నా విప్రవర్యుం డాతని కిట్లనియె. 161
ఆ. ‘చెప్పినట్ల యేను జేసెద నని యొడం | బడినవాఁడ వింకఁ బలుకు దిరుగఁ
గామి మఱవ కుండఁగా నీకు వలయుఁ జు | మ్మయ్య దండధారకాగ్రగణ్య!’
162
వ. అని యూఁది పలికి, ‘మద్గురుని యనుమతి లేక తదీయ తరుఫలంబులు గోసికొని యుపయోగించితి; నది మ్రుచ్చిమి; మ్రుచ్చుల దండించు తెఱంగున దండించి నన్ను గతకల్మషుం జేయుము; రాజదండితునకు యమదండంబు లేదని పెద్దలు సెప్పుదురు; నిన్నును దండధారణ వైకల్య కిల్బిషంబు వొరయకుండ వలయు’ నని తేటపడ నాడిన, నమ్మాటలకు మనంబున విషాంబు నొంది, యమ్మేదినీవరుండు భూసురవరుం బ్రార్థించి. 163
ఆ. ‘అనఘచరిత! యిట్లు నను నియోగించుట | యుడుగు’ మని యమాత్యయుతము గాఁగ
భక్తి మెఱసి యెన్నిభంగులఁ జెప్పిన | నియ్యకొనక యున్న నెట్టకేని.
164
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )