పురాణేతిహాసములు శ్రీమహాభారతము శాంతిపర్వము - ప్రథమాశ్వాసము
లిఖితుండు సుద్యుమ్నునిచేత నికృత్తకరుం డగుట (సం. 12-24-19)
వ. నిశ్చయించి సముచిత దండనీతి వ్రతశీలుండగు నన్నరపాలుం డమ్మహాద్విజునిం గరయుగచ్ఛేదనంబున దండింతుం జేసిన, నతం డతని దీవించి మగిడి చని శంఖునిం గని నికృత్తంబు లైన హస్తంబులు సూపి ‘సమ్యగనుభూత దండితుండ నైతి’ ననిన నాతండు ప్రీతుండై. 165
తే. ధర్మమార్గ ముల్లంఘింపఁ దగదుగాన | వలసె నిష్కృతి కులమెల్ల వెలసె నీ క
తమున సురముని పితృ తర్పణములు సేయు | మరిగి బాహుదాపుణ్యతోయముల ననఘ.
166
వ. వినుము. 167
తే. కల్లు ద్రావుట, గురుపత్నిఁ గవయుటయును, | విప్రుఁ జంపుట, బ్రహ్మ స్వవిషయ మైన
మ్రుచ్చిలుటయును నివి గల క్రూరజనులఁ | బ్రీతిఁబొందుటయును మహాపాతకములు.
168
వ. ఇమ్మహాపాతకంబు లేనింటిలోన నెద్ది సేసిన నే జాతివాఁడును దండనీయుండ, విశేషించి తస్కరుండు శారీరదండ యోగ్యుండు; రాజదండితులు సుకృత వంతుల భంగిఁ బుణ్యలోక ప్రాప్తులగుదురు; నీ వమ్మహారాజు చేత దండింప బడుటం బుణ్యాత్ముండవును వంశోద్ధారణ సమర్థుండవు నైతివి; సంతోషింపుము పొ’మ్మనినం బోయి లిఖితుండు. 169
తే. బాహుదానదియం దవగాహనంబు | సేయఁ బ్రభవించె నాతని చేతు లపుడ
విస్మయం బంది యతఁడు వేవేగ వచ్చె | నన్నపాలికి మగుడఁ బ్రహర్షమెసఁగ.
170
వ. వచ్చి యరుణ కమలంబులం దెగడు తన కరంబులం జూపిన నతండు ‘దీనికి నచ్చెరు పడనేల? యిది మదీయ తపోవిభవంబున దైవకృతం బైన విశేషంబు; నీవు శుచి వగుట దైవంబున కెక్కె; సుద్యుమ్నుండును నీ పుణ్యానుష్ఠానంబున నిజపితృవర్గ సహితంబుగా నిర్మలాత్ముండయ్యె’ ననియె; నట్లగుటం జేసి. 171
చ. జననుత! నీవునుం దగఁ బ్రజాపరిరక్షణ మాచరింపు; నీ
యనుజునిమాట వేదవచనార్థ నిరూఢము; రాజనీతి దం
డనమునఁ గాని యొండున నొడంబడ దెన్నఁడు నార్యకోటియం
దును వగదక్కు మేలు మిలఁ దుష్టిగఁ జేయుము మేటి జన్నముల్‌.’
172
వ. అని చెప్పి మఱియు నిట్లనియె. 173
సీ. ‘అడవుల మీరున్నయపుడు నీ తమ్ములు | వివిధ మనోరథావేశ కలిత
హృదయులై యుండుదు; రదయత వీరి | నుపేక్షింప కిల యేలి యెల్లభోగ
ములకును భాజనంబులఁగా నొనర్పుము | తురగ మేధాది క్రతు ప్రయుక్తిఁ
బరఁగుము; వీరలు బహుయజ్ఞములు సేయు | వా రటమీఁద నిర్ద్వంద్వవృత్తి
 
తే. వెడలెదవు గాక విను మేము వెఱ్ఱివార; | మే మహీశ్వర నీ మది మేలుగంటి
మతిథి సుర పితృ విషయము నప్పు చిక్కు | గలిగియుండంగ నది నీకుఁ గాదు గాని.
174
ఆ. న్యాయశాస్త్రవేదియై యింగితాకార | చేష్ట లెఱిఁగి జనుల శిష్టదుష్ట
తావిశేష మరసి దండనీతి యొనర్చు | పతికి నెల్ల మేలుఁ బడయవచ్చు.
175
క. అరి యాఱవపాలు గొనుచుఁ | గరుణ గలిగి ప్రజలఁ దండ్రిగతి మధ్యస్థా
చరణంబునఁ బాలించుట | పరమ పదముఁజేర్చు విడువు భయసంశయముల్‌.
176
ఆ. ఇవ్విధంబు గాక క్రొవ్వి కామ క్రోధ | కలిత చిత్తవృత్తిఁ దొలఁగ నడచు
పతికి నగుఁ జతుర్థ భాగంబు ప్రజసేయు | పాపములఁ గులప్రదీపచరిత!
177
చ. క్రమమున నైన శాత్రవులఁ గ్రందున నైనను జావఁ జేఁత ధ
ర్మము విను పాపకర్ములగు రాజులతోఁ దగ సంధి సేఁత దో
షము విభుఁ డుర్వి యమ్ముకొని సంగరముం దొలఁగింపఁ గూడునే
సమరజితావనీభరణశాలితఁ బోలునె యొండు ధర్మముల్‌.
178
వ. కావున. 179
క. పో రుడుగను సమకూరద | కౌరవపతితోడ సంధి గావింపమి హిం
సారుచి నైతి ననుట యవి | చారత నృపవంశకలితజని యగు నీకున్‌.
180
శా. భూవిస్తారము నాక్రమించి ప్రజలం బ్రోవంగ దండింపనుం
గావన్‌ నేర్చి మఖక్రియల్‌ నడపి సంగ్రామాగ్ని కాజ్యాహుతుల్‌
గా వైరిక్షతజంబు వేల్చి తనుషంగక్షేపకుండై హయ
గ్రీవుం డుత్తమసిద్ధిఁ బొందె; రణముల్‌ గీడే నృపశ్రేణికిన్‌?
181
వ. సంగరంబునం జంపుటయుం జచ్చుటయును బ్రజాపరిపాలనంబును దగిన తెఱంగున దండించుటయును నుత్తమ క్షత్త్ర ధర్మంబులు గావున హింసవలని శంక విడిచి యాన్వీక్షకీ త్రయీవార్తా దండనీతు లను రాజవిద్యలయందును బ్రవీణులగు సహాయులతోడం గూడి సర్వ వ్యవహారంబులు నిర్వహింప నిర్వాణం బనతిదూరం బగుఁ; గలంక దక్కు’ మని పలికె; సకల లోక గ్రాహ్యవచనుండగు నమ్మహాముని యిట్లు సెప్పం దెలివొందక యున్న ధర్మనందనుం గనుంగొని పురందరనందనుం డుల్లంబునం గోపంబు గదుర మొగంబునం దోఁపనీక యుండె; నప్పాండవాగ్రజుం డత్తపోతధనవర్యు వదనంబునం జూడ్కి నిలిపి నిభృతంబుగా నిట్లనియె. 182
క. ‘పతులు మృతులైనఁ బొగిలెడు | సతుల విలాపములు శోక సంతాపం బు
త్థితముగఁ జేయఁగ నే వసు | మతి యేలిన కలఁచుకలఁక మానునె బుద్ధిన్‌?’
183
వ. అనుటయు నమ్మునివరుం డతని కిట్లనియె. 184
సీ. ‘దుఃఖంబుఁ బొమ్మని త్రోవ, సుఖంబు ర | మ్మని తెచ్చికొన వశమయ్య? వానిఁ
దొలుబామునందలి దుష్కృతంబును సుకృ | తంబు హేతువులుగఁ దగిలి చేయుఁ
బురుషుని కాలంబు; దిరములు గా వవి; పొరిఁ | బొరి వచ్చుచుఁ బోవుచుండు;
నర్థముల్‌ దుర్బుద్ధికైనను సిద్ధించు | నగు కాలమున; నార్యులయ్యుఁ గాని
 
ఆ. కాలమున ఘటింపఁగా నేర; వనిల వ | ర్షాతపేందురుచులు నధిప! కాల
కల్పితములు; మంత్రశిల్పౌషధంబులు | మేలుసేఁత కాలకీలితంబు.
185
క. కమలంబులుఁ దొవలు వికా | సముఁ బొందుట, లతలుఁ దరులు సకుసుమ ఫలభా
వముఁ బొందుట, పక్షులును మృ | గములును మదకలము లగుట కాలకలితముల్‌.
186
వ. మఱియు జనన మరణంబులును, హానివృద్ధులును, లోనుగా సకలంబును గాలాధీనంబ కావున నీకు శోకింపం బనిలేదు; తొల్లి సేనజి త్తను మానవపతి పుత్ర మరణ శోకార్తుండై యుండి తనలోనన తెలిసి సజ్జన సన్నిధి నుపన్యసించిన వాక్యంబు లాకర్ణింపుము. 187
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )