| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - ప్రథమాశ్వాసము |
| సీ. |
‘తారు గొందఱకు బాధకు లయి నడచుట | పరులచే బాధలఁ బడుట గలుగు; నివి కాలభావ్యంబు; లెఱుక కల్గిన నొరుఁ | బఱిచితి నొరులచేఁ బడితి ననుచుఁ బురుషుండు ప్రియశోకములఁ బొందఁ; డర్థ దా | రాపత్య బాంధవహాని కాత్మఁ గుందంగ నడలుట మందబుద్ధిత్వంబు; | వగఁ గీడు మానునే? వలవ దడల; |
|
| తే. |
శోకభయకారణంబులు లోకమున న | నేకములు; దానఁ దలసూపు శోకములకు భయములకు బుద్ధి నెడయీఁడు పండితుండు | మూఢుఁడవి త్రోవనేరండు మునుఁగు వగల. |
188 |
| క. |
వినుఁ డీ సుఖమును దుఃఖము | ననిత్యములు గాన వానియాగమ కాలం బున ముదమును శోకము మొగ | కొనమియ చు మ్ముఱవు శాంతి గోరు జనులకున్. |
189 |
| తే. |
మూఢతమబుద్ధు లగువారుఁ బ్రౌఢతమ వి | వేకులును సుఖు; లట్టులు గాక కొంత ప్రజ్ఞగలవారలై యపప్రతిభు లైన | జనులు దుఃఖార్తు లగుట నిస్సంశయంబు.’ |
190 |
| వ. | అనియె; నాసేనజితుం డుదాత్త వివేక నిరూఢుం; డతని వచనంబులు విద్వదాదరణీయంబు; లిందలి యర్థంబు నీ చిత్తంబున నలవరింపుము; వగ యుజ్జగింపు’ మని వెండియు. | 191 |
| తే. |
‘వర్ణముల నాశ్రమంబుల వలను మెఱసి | యరసి చక్కని తెరువున నరుగఁ జేసి ధరణి పాలింపు సముచిత దండధరణ | మాచరింపుము; నీ కిది యర్హవృత్తి. |
192 |
| క. |
దివికిం జనినను నెవ్వని | వివిధ గుణము లఖిల జనులు వినుతింతురు వాఁ డవనీశ్వర! సత్పురుషుం | డవునని కయికొండ్రు బుద్ధి నార్యజనంబుల్. |
193 |
| వ. | కావున సకల జనహృదయ ప్రియహితం బగు పృథ్వీపరిరక్షణంబు నీకుం గులధర్మంబై కర్తవ్యం బగుట యుఱవుగాదె!’ యనిన యమ్మునీంద్రునకు నమ్మనుజేంద్రుం డిట్లనియె. | 194 |
| తే. |
మఱవవచ్చునె నా కభిమన్యు ద్రౌప | దేయులను గర్ణు మత్స్య భూనాయకుండు ద్రుపద నృపతియు ధృష్టకేతుండు మాన | సమునఁ బాయుదురే యెట్లు శాంతి గలుగు? |
195 |
| సీ. |
తొడలపై నర్మిలి నిడికొని న న్నుప | లాలించుచుండు బాల్యమున నట్టి భీష్మునిఁ జంపితి; బీభత్సు భల్లముల్ | దనువు సెక్కంగ నాతఁడు శిఖండిఁ జూచుచు నుండుటఁ జూచితి; నది యుల్ల | మలమటఁ బెట్టెడి; నట్లుగాక యా భంగి నున్నప్పు డాతఁ డాద్రుపదజు | నేయమిఁ దలఁచిన నెరియు మనసు; |
|
| తే. |
పరశురాముని నోర్చిన బల్లిదుండు, | కాశిరాజ కన్యకలకుఁ గాఁగఁ బుడమి నరపతుల నెల్ల గెలిచిన బిరుదు గలన | నాఱడియ పడు టూహింప నడలు గదురు. |
196 |
| ఆ. |
అల్పకాల భోగ్యమైన రాజ్యమునకుఁ | గా ననల్పకీర్తిఘనుని జరఠ సింహకల్పు వంశశేఖరజన్ముఁ ద్రుం | చితి మనంబు వగలఁ జివుక కున్నె. |
197 |
| మ. |
జన సంపూజ్య పదారవిందుఁ డగు నాచార్యుండు శోకించి నం దను చొప్పారయ వేఁడి పెద్దయు ననుం దా నమ్మి యర్థింపఁ జా వని వానిం గరిచావు బుద్ధి నిడి యశ్వత్థామ సచ్చెన్ నిజం బని యే బొంకితి మేదినీభరణ మర్హంబే గురుద్రోహికిన్? |
198 |
| ఆ. |
రాజ్యలాభ లోభరతుఁ డయి కడుఁ బాప | మైన బొంకు మాటలాడి గురునిఁ గూల్పనేర్చినట్టి క్రూరాత్ముఁ డేగతిఁ | బోవువాఁడు సెపుమ బుధవరేణ్య! |
199 |
| క. |
భ్రాత మహాత్ముఁడు గర్ణుం | డాతనిఁ జంపించి యేలు నవనీరాజ్యం బాతురత సేయుఁ గాక సు | ఖాతిశయము మతికి నొసఁగునయ్య మునీంద్రా! |
200 |
| చ. |
కడిఁది మగండు కుంభజుఁడు గావఁగ నొప్పిన మంటవోలె నుం డెడి మొనఁ జూచి చూచి యిది డెప్పర మ న్వగ లేక పంచితిం గొడుకుఁ జొరంగ; నత్తెఱఁగు క్రూరత సైఁప సుభద్ర యట్లుఁ గ వ్వడిక్రియ నేర్తురే యొరులు? వల్లభుఁ డేలగు నట్టిఁ డుర్వికిన్. |
201 |
| చ. |
అడ లెదఁ బొందఁగాఁ దగనియట్టిది ద్రోవది మేరుకల్పులం గొడుకుల నేవురన్ జముఁడు గొన్న నలందురఁ జూడనేర్తునే? పుడమి గిరీంద్ర పంచకము పోయినఁ బాడఱినట్టు లున్న య ప్పడఁతుక యెట్టులోర్చు గృహభారము నెమ్మది నిర్వహింపఁగన్. |
202 |
| క. |
ప్రాయోపవేశమున ని | క్కాయంబు దొఱంగు తలఁపు గదిరెడి; సంతా పాయత్తచిత్తు నకటక | టా యని పోనిండు నను దృఢవ్రతయుక్తిన్. |
203 |
| వ. | అని పలికి బంధుమరణ శోక వ్యాకులుం డయి యున్న యున్నరనాథవరేణ్యుతో నమ్మునినాథ వరేణ్యుం డిట్లనియె. | 204 |
| ఆ. |
‘ఇట్లనంగఁ దగునె? యిమ్మెయి నడల నీ | యట్టి ధైర్యఘనున కగునె యనఘ! బుద్ధి సెప్పవలసెఁ బునరుక్తభాషలఁ | జెవులు మదియుఁ గూడఁ జేర్చి వినుము. |
205 |
| తే. |
పొదలుఁ దఱుఁగుటకై, పొడవొదవుఁ బడుట | కై, కడుం జేరుఁ బాయుటకై, జనించుఁ బొలియుటకునై సుఖంబులఁ బొందు దుఃఖ | మొందుటకునై పదార్థము లెందు నధిప! |
206 |
| ఉ. |
మిత్రులచేఁతలన్ సుఖము మేకొను నంటయుఁ, జెందు దుఃఖముల్ శత్రులచెయ్ది నంటయును, సన్మతి దా ధనమూల మంటయున్, గోత్రవరేణ్య! భోగములకున్ ధనముల్ గరణంబు లంటయుం, జిత్రచరిత్రుఁడైన విధి చేష్ట దొఱంగిన నీటివ్రా లగున్. |
207 |
| వ. | కావున నెవ్వగ నొందం బనిలేదు. | 208 |
| ఆ. |
ధాత నిన్ను నేమి ధర్మంబు నడపుట | కై సృజించె దాని నాచరించి యుండు; నీవు నీక యొడయుండవే? ధాతృ | నోదిత ప్రవర్తనుఁడవు గాక!’ |
209 |
| వ. | అని పలికి యప్పారాశర్యుండు వెండియు నిట్లను ‘విదేహరా జగు జనకుండు వివేకపరిపాకంబు నొందక మున్నొక సమయంబున బంధువియోగంబు వాటిల్ల విషాదంబు నొంది, గృహంబు దొఱంగి వెడలు వాఁడయ్యె; నట్టియెడ నతని పాలికి నశ్మకుం డను విప్రవర్యుండు వచ్చిన నవ్వసుమతీపతి సముచిత ప్రకారంబునం బూజితుం జేసి. | 210 |