పురాణేతిహాసములు శ్రీమహాభారతము శాంతిపర్వము - ప్రథమాశ్వాసము
కృష్ణద్వైపాయనుఁడు ధర్మజునకు నపాత్రపురుషుల నెఱింగించుట (సం. 12-37-23)
వ. అని యిట్లు చెప్పి ‘యపాత్రభూతపురుషుల నాకర్ణింపు’మని పలికి. 328
సీ. పాడియు నాడియు బ్రదుకు వారలఁ బరి | హాసకు దుర్జను నంగహీను
మత్తుని మ్రుచ్చు నున్మత్తు నపుంసకుఁ | జెనఁటి మాటలఁ దేల్చు మనుజుఁ గులము
చాలమి వేదంబు చదువమి నిజవృత్తి | హాని దుర్వృత్తి గలట్టి వాని
దానపాత్రంబులుగా నియ్యకొనరు పె | ద్దలు; దీనుఁడును విపద్బాధితుండు
 
తే. నీగి కర్హులు; దయపేర్మి నిచ్చుచోట | నైన నవగుణ మెక్కుడై కానఁబడిన
నిందితాత్ముల కిచ్చుట నిష్ఫలంబు; | పాత్ర నిశ్చయ మిట్టిది పౌరవేంద్ర!
329
క. శిల చేవమ్రాను దెప్పగ | జలనిధిఁ గడవ దొరకొనిన చాడ్పగుఁ బాత్రం
బులు గానియెడల దానం | బులఁ బాపము నిస్తరింప బుద్ధిఁ దలఁచినన్‌.
330
ఆ. పునుకఁ గుక్కతిత్తిఁ బోసినపాలు నీ | ళ్ళధిక నిందఁ బొరయునట్లు దుష్ట
మై యపాత్ర విషయ మగు నీగి వృథవోవు | నిచ్చుచోటఁ బాత్ర మెఱుఁగవలయు.
331
తే. షండునకు బిడ్డ నిచ్చిన చందమొందు, | బూదిలో నేయి వేల్చుటఁ బోలు, నోటి
కడవ నీళ్ళులు వెట్టిన కరణియగు న | పాత్రజనులకుఁ బెట్టుట పౌరవేంద్ర!
332
క. దానవిధి యరయ నసమీ | చీనంబగునేని కీడు సేయుం గురుధా
త్రీనాథ! మఱియుఁ బాత్రం | బైనను గొన్నతని కిచ్చునతనికి నెట్లున్‌.
333
క. కావున విను పాత్రము మే | లై విహితాచరణ సౌమ్యమగు దానము ధా
త్రీవర! దాత్రాదాతల | దా వెలయించు భువనద్వితయరంజకతన్‌.’
334
వ. అని చెప్పి ‘యేను నీకు బుద్ధులు సెప్పంజొచ్చి సంక్షేపరూపంబునం గీడు మే లెఱింగించితి; నిప్పలుకులు పాటిగాఁ గొని విహితానుష్ఠానపరుండ వగు’ మనుటయు, నమ్మనుజపతి యమ్మునిపతితో ‘మహాత్మా! భవదనుగృహీతంబు లైన యివ్వాక్యంబులు హర్షంబు నావహించె; నెప్పాట ధర్మంబగు మార్గం బవలంబించి రాజ్యతంత్రంబు నడపి, యశుభంబునం దొడరక జయింతు; నట్టి తెఱంగు గలుగం గృపసేసి రాజధర్మంబులుం దక్కునుం గలుగు వర్ణాశ్రమ ధర్మంబులు నాపద్ధర్మంబులును లోనుగా నెఱుంగం దగు ధర్మంబులెల్ల నెఱింగింపవే! నాకుం జూడ రాజ్యంబును ధర్మచర్యయును బరస్పర విరుద్ధంబు లయినట్లున్నవి గావున నివ్విధంబున విన్నవింప వలసె’నని చెప్పుటయు, నత్తాపసోత్తముండు ప్రీతచిత్తుండై యతండు విన నారదుతోడ ‘నీ భూపతి భీష్ము పాలికిం బోవలయు; నయ్యార్యవర్యు చేత సకల ధర్మంబులు వినువాఁ డగుట యర్హప్రకారం’ బనవుడు నారదుం ‘డిది లెస్స’యని వలికిన నప్పరాశరపుత్రుం డయ్యజాతశత్రున కిట్లనియె. 335
ఆ. కురుపితామహుండు గురుబుద్ధి నింద్రాదు | లకును మాననీయుఁ డకుటిలాత్మ
కుండు పరశురాము కోదండవిద్యాది | సుగుణములకు నెల్లఁ జొచ్చినిల్లు.
336
క. సురతటినీ పుణ్యతమో | దరమున జన్మించినాఁ డుదాత్తవ్రతత
త్పరుఁ డతని కెల్ల ధర్మముఁ | గరస్థలామలక సన్నికాశం బధిపా!
337
క. చ్యవనుఁడు మార్కండేయుం | డు వసిష్ఠుఁడు లోనుఁగా బటు ప్రాజ్ఞులు గా
రవమున వినిపింపఁగఁ దెలి | య వినియె ధర్మప్రపంచ మతఁ డఖిలంబున్‌.
338
తే. శాంతమానసుఁడైన యా శాంతనవుఁడు | విస్మయావహ చరితుండు; వినుము వలసి
నపుడు విడుచుటకై ప్రాణ మాఁగినాఁడు | గాదె! యొరు లంతవా రెందుఁ గలరె నరులు.
339
చ. అతనికి నీ పయిం గరుణ యగ్గల; మట్లగుటం గురుక్షమా
పతివర! పొమ్ము నీ వతనిపాలికి; నాతఁడు నిన్ను సంప్రబో
ధితుఁడుగఁ జేయు ధర్మములు దేటపడంగ నుపన్యసించు; మా
మత మిది; దీనఁ గీర్తియు సమంచిత ధర్మముఁ బెంపు నొందెడున్‌.
340
వ. అయ్యుత్తమోత్తమునకు నూర్ధ్వలోక గమనంబునకు సమయం బాసన్నంబగుచు వచ్చెం; దడయ కట్లు సేయు’ మనిన విని యవ్వసుమతీపతి ‘మునీంద్రా! బహుబంధు వధపాతకం బాచరించి యమ్మాననీయాత్ము నెదిరి కెట్లు వోదు? నట్లుం గాక యకృత్రిమ సమరశీలియగు నగ్గుణశాలిం గృత్రిమ సమరంబునం గూల్చి, క్రమ్మఱ నమ్మహాత్ము మొగంబు సూచి, నాకు ధర్మంబు లుపదేశింపవే యని యడుగ నేర్తునే?’ యనుటయు నజ్జననాథునకు జనార్దనుం డిట్లనియె. 341
తే. ‘ఇంత నిర్బంధ మేటికి ‘నిమ్మునీంద్రు | పనుపు సేయుదు గాక! యిప్పాట నెల్ల
పెనుపులకుఁ బాత్రమయ్యెదు; వనటతోడ | నెద్దియును నేల? పురమున కేఁగు మిపుడు.
342
వ. మరల గాంగేయు కడకు వత్త; మదిమేలు, లె’ మ్మని పలికి వెండియు. 343
తే. ‘తమ్ములును విప్రవరులును ధరణిఁ గల్గు | బహువిధంబుల ప్రజలును బార్థివేంద్ర
చాతకప్రకరములు పర్జన్యుఁ గోరు | నట్లు నినుఁ గోరుదురు కృప నాదరింపు.
344
వ. ఈ సర్వజనంబుల మనోరథంబును సఫలంబులు సేయు’ మని ప్రార్థించె; నివ్విధంబునం గృష్ణద్వైపాయన నారద దేవల దేవస్థాణు కృష్ణులు లోనుగాఁ బెక్కండ్రు పెక్కు దెఱంగులఁ జెప్పిన వాక్యంబులఁ జిత్తంబు కలంకదేఱి, కౌంతేయాగ్రజుండు రాజ్యభార నిర్వహణోత్సాహం బంకురింప, శిశిరాపగమ సమయ కమలంబు ననుకరించు నాననంబుతో నప్పారాశర్య ప్రముఖ మునివరులకుం బ్రదక్షిణంబును దండప్రణామంబును నాచరించి, వారల వలన వసుమతీ వహనానుజ్ఞయు వివిధాశీర్వాదంబులుం బడసి వెలింగె; వారును నిజస్థానంబులకుం జనిరి; తదనంతరంబ. 345
సీ. దేవభూదేవ పూజావిశేషము లాచరించి | యక్కురుకులశ్రేష్ఠుఁ డుర్వి
నెడనెడ బ్రుంగుడువడి యున్నరాజులు | సనుదెంచి కను నవసరము వేచి
యునికి కృష్ణునిచేత విని పూసి తొడి కట్టి | కొలువిచ్చి, మణిహేమకుంజరాశ్వ
కాంతాదులగు తగుకానికల్‌ గైకొని, | యానృపాలురకుఁ బ్రియం బొనర్చి,
 
తే. యమ్ముకుందుండు వారును దమ్ముగమియుఁ | దక్కుఁగల బంధుమిత్త్రులు ధౌమ్య ముఖ్య
సూరిజనములు బలయంగఁ దారకముల | మధ్యమున చొప్పుచంద్రుని మాడ్కిఁ బొలిచె.
346
వ. మఱునాఁడు కల్యంబునం గాలోచితకృత్యంబు లాచరించి ధవళానులేపన మాల్యవస్త్రాభరణంబుల నలంకృతుండై. 347
క. నవమగు రథమున షోడశ | ధవళహరులఁ బూన్పఁ బనిచి ధరణిపుఁడు విధుం
డవిరళ సుధారథం బె | క్కువిధము దోఁపంగ నెక్కెఁ గురువంశనిధీ!
348
శా. సారథ్యంబు వహింప భీముఁడు, సితచ్ఛత్రంబు గాండీవి సె
ల్వారం బట్టఁగఁ, జామరల్‌ గవ లిడన్‌ హారిప్రభంబయ్యె; న
త్తేరం దేవురు నగ్నిపంచకము వేదిం బొల్చునట్లొప్పి రం
భోరాశిధ్వనివోలెఁ దూర్యనికరంబుల్‌ మ్రోసె నొక్కుమ్మడిన్‌.
349
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )