పురాణేతిహాసములు శ్రీమహాభారతము శాంతిపర్వము - ప్రథమాశ్వాసము
వ్యాసుఁడు ధర్మజునకుఁ బ్రాయశ్చిత్త విశేషంబు లెఱింగించుట (సం. 12-36-1)
సీ. వినుము! కర్మము దెల్పుచును గపాలంబున | నెత్తిన భైక్షాన్న మేకకాల
మశనంబు గొనుచు ఖట్వాంగ చిహ్నము బ్రహ్మ | చర్యంబునై యధశ్శయన మాచ
రించుచు నిట్లు పండ్రెండు వర్షంబులు | వ్రతవృత్తి నడపంగ బ్రహ్మహత్య
కిల్బిషంబు దొఱంగుఁ; గృచ్ఛ్రముల్‌ నడపిన | నాఱు వత్సరముల నడఁగు మూఁడు
 
తే. హాయనంబులు నడపఁ జాంద్రాయణములఁ | బోవు నిష్ఠానిరతి మాస భోజియైన
నబ్దమునఁబాయు; నటుగాక యశ్వమేధ | యాజి యగునేని వలదు భిక్షాదు లధిప!
304
క. అవనీశ! యశ్వమేధము | నవబృథమున నీరఁ గ్రుంకి యన్యుఁడు శుద్ధుం
డవుఁ బాపుఁ డైనఁ; దత్క | ర్త విశేషము లోక పూజితం బగు టరుదే!
305
తే. పుష్టగోలక్ష యొండెఁ గాంభోజవాజి | శతక మొండెను భూసురతతికి నొసఁగఁ
బాయు బ్రాహ్మణార్థాహవ ప్రాణహాని | యైన నొండెను జెడు బ్రహ్మహత్యకీడు.
306
సీ. కల్లుద్రావిన పాతకం బది యగ్నివ | ర్ణముగాఁగఁ గాఁచి పానంబు సేయఁ
గనుమూసి యుఱుకంగ ననలంబుఁ జొర మహా | ప్రస్థాన మాచరింపంగఁ బాయు
నట్లును గాక బృహస్పతి సవనమ | న్క్రతు వొనరించిన నతివిశిష్ట
భూమిదానమునను బోవు నక్కీడ్గురు | తల్పగుం డనలప్రతప్త మైన
 
ఆ. యాయసాంగనాంగ మాలింగనము సేసి | యైనఁ గోసి కరమునందు మేహ
నము ధరించి యంబరముఁ జూచు చరిగియే | నియును జచ్చి యఘము నిస్తరించు.
307
క. గురుతల్పగుండు రణమున | గురునకునై చచ్చియేని కురువర ధరణీ
సురులకు సర్వధనము భ | క్తి రతి నొసఁగియేని పాతకిత్వముఁ దొఱఁగున్‌.
308
క. ధరణీసురుస్వర్ణము నప | హరించినతఁ డంత కనక మట్టిద వినయో
త్తరుఁడై మగుడఁగ నిచ్చినఁ | బరిహృత మగుఁ గల్మషంబు పౌరవముఖ్యా!
309
క. అనృతోపచారకలనం | బునఁ బుట్టిన పాతకంబు వోవుం దా నె
వ్వని నపచరించెఁ దగ నా | తనిఁ బ్రీతుంజేయ ధర్మతత్త్వప్రవణా!
310
క. గురువునకు మాఱువల్కుటఁ | బొరసిన కల్మషము వాసిపోవు నతనికిం
బరితోషముగా వినయపు | వెరవున నుపహార మిచ్చి వినతుం డయినన్‌.
311
క. పరదార గమనదోషము | పరిహృతమగు నొక్కయేఁడు పరమ నియతుఁడై
చరియించినఁ గృచ్ఛ్రంబులు | గురుకుల జలనిధి శశాంక! గుణమణి నికరా!
312
ఆ. వావి గానియట్టి వనితఁ బొందినపాప | మాఱునెలలఁ బాయు నార్ద్రవస్త్ర
ధరణ భస్మశయన పరతఁ బాటించుచు | నియతి నుండెనేని నృపవరేణ్య!
313
క. పరపురుష సంగమంబునఁ | బరిహృతయై యున్నయట్టి భామిని శుద్ధిం
బొరయు రజస్వలయై కం | చరయఁగ భస్మమున శుద్ధమైన విధమునన్‌.
314
ఆ. నఱకఁదగని మ్రాను నఱకినఁ, దిర్యగ్వ | ధంబుఁ జేసినను, నఘంబుఁ బాచి
కొనునరుండు మూఁడు దినములఁ దనచేఁత | పలుకుచును సమీరభక్షుఁ డయిన.’
315
వ. అని చెప్పి వెండియు. 316
క. ‘మితభోజియై వివిక్త | క్షితి సావిత్రీజపంబు సేయునది యహ
స్స్థితియు నిశాసీనత్వము | మతి నేమఱకట్టులైన మడియు నఘంబుల్‌.
317
తే. పుణ్యకర్మముల్‌ సేయుచు భూసురులకు | వివిధ ధనములు ప్రీతితో వినయ మొప్ప
నొసఁగుచుండెడువారు పూర్వోపచితము | లైన కిల్బిషములఁ బాతు రవనినాథ!
318
క. విను మాస్తికతా శ్రద్ధా | వినయంబులు గలుగువారు వీనికి నెల్లన్‌
జననాథ! యర్హు ; లవి లే | నినరులు పాపములఁ దొలఁగ నేర్తురె యెట్లున్‌.
319
వ. ఆస్తికతా శ్రద్ధా వినయంబులు నీకు సహజంబులు గావే! కావునఁ బ్రాయశ్చిత్తంబు లల్పంబు లైననుం బాపంబులం బాపనోపుఁ; బాపం బని నీవు శంకించు కర్మంబు భారతయోధ వధంబ కాదె! యది యాత్మరక్షణంబునకై చేయుటం జేసియు, నుత్తమక్షత్రధర్మం బగుట నిరూపింపం బాపంబుం బొరయకున్న యది; యట్లుంగాక భవదంతఃకరణంబున జనియించిన కరుణయుం, బశ్చాత్తాపంబును, నిన్నుం బరిశుద్ధునింజేసె; నీవు ప్రాణబాధకంబు లగు తపశ్చరణంబులకుం జొరం జూడకుము; కురుకుల చూడామణిత్వంబునకు మూలంబయిన మహీపాలనం బాచరింపు’ మనిన నబ్బాదరాయణుతో నమ్మేదినీరమణుం ‘డపేయంబులు నభోజ్యంబులు నెయ్యవి? యపాత్రభూతపురుషు లెట్టివారు? మహాపురుషా! యెఱింగింపవే’ యని యడిగిన నతం డిట్లనియె. 320
క. తురగియు నుష్ట్రియు ఖరియును | గురిసిన దుగ్ధములు నింద్యకోటి గణితముల్‌
ధరణీసురాది జను ల | ప్పొరువునఁ బోయిన నఘంబుఁ బొందుదు రధిపా!
321
సీ. మానుషీక్షీరంబు, నీనిన పదినాళ్ల | లోనిధేనువుల పాలును నపేయ
ములు; ప్రేతవిషయాన్నమును, సూతకాన్నంబుఁ, | దలవరియన్నంబుఁ, గులటయన్న
మును, వనితోపజీవనశీలు నన్నంబు, | నాడెడు పాడెడునట్టివాని
యన్నంబు, జూదరియన్నంబు, సూనరి | యన్నంబు బహివెట్టినతని యన్న
 
ఆ. మును, నిజాగ్రజునకు మును పెండ్లియాడిన | పురుషు నన్నమును, నభోజ్య మండ్రు;
వందియన్న మధిక నిందాస్పదంబు; ప | ర్యుషిత శుష్కములను నుడుగవలయు.
322
క. విను! సురతోఁ గూడఁగఁ దె | చ్చినయట్టిది యెద్దియును భుజింప రభోజ్య
త్వ నిరూపణ నిపుణతగల | మనుజోత్తము లఖిలలోకమాన్యచరిత్రా!
323
క. పులగముఁ బాయస మట్టులుఁ | బలలము నర్చనకుఁ గాక పక్వములయినం
గలుగు నభోజ్యత్వము వి | చ్చలవిడి వంటకము సేసి చనదు భుజింపన్‌.’
324
వ. అని వెండియు. 325
తే. అతిథి పితృదేవతా పూజ లాచరించి | కాని గృహమేధులకు భోజ్యమైనఁ గుడువఁ
దగదు; యజ్ఞశిష్టం బమృతంబు గాఁగ | నార్యజనములు సెప్పుదు రధిపవర్య!
326
క. ఆలును బిడ్డలు బంధులు | నై లీలఁ జరించుచును గృహస్థుఁడు దత్త
ల్లోలత్వరహిత చిత్తత | మేలుగ నలవఱుపవలయు మీఁ దెఱిఁగి నృపా!’
327
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )