| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - ప్రథమాశ్వాసము |
| ఆ. |
‘ఆగమోక్త కర్మ మాచరింపమియు, ని | షిద్ధమైన దానిఁ జేయుటయును, బ్రాజ్ఞజనులు ధరణిపాలవరేణ్య! చె | ప్పుదురు పాపములుగ బోధ్యతతికి. |
291 |
| వ. | ఇది కల్మష సామాన్య నిర్దేశంబు; విశేషంబు వినుము. | 292 |
| సీ. |
ఆదిత్యు నుదయాస్తమయ కాలముల నిద్రఁ | బొందుటయును, బాత్రభూతుఁ డింటి కరుగుదెంచినఁ బూజ యాచరింపమియును, | బరదారగమనంబు, గురుల కెదురు సేఁతయు, గ్రామంబు సెఱుచుటయును, వేద | విక్రయంబును, రసవిక్రయంబు, భృత్యుఁ బ్రోవమియు, నసత్యోపచారంబు, | గహనదాహము, నన్యకర్మకృతియుఁ, |
|
| తే. |
దనదుకర్మంబు విడుచుటయును, వృథాప | శు ప్రహరణంబు, మేదినీసురుల కలిమిఁ గొనుటయును, శరణార్థిఁ జేకొనమి, విప్ర | వధయుఁ బాపంబు లందురు బుధజనములు. |
293 |
| వ. | పాపంబులుంబోలె నుండియు దూష్యంబులు గాని వానిం జెప్పెద నాకర్ణింపుము. | 294 |
| క. |
దురమునఁ గైదువుఁ గొని తనుఁ | బొరిగొన నేతెంచునట్టి పురుషుని వేదాం త రహస్యవేది నయినను | బొరిగొనినను గిల్బిషంబు వొందదు వత్సా! |
295 |
| క. |
ధరణీసురవిత్తము నప | హరింపఁగాఁ గని వధించు నతఁడు దురితముం బొరయఁ డొక యించుకయు నని | నరేంద్ర! చెప్పుదురు ధర్మనానార్థవిదుల్. |
296 |
| క. |
జీవిత సంశయవేళను | భూవర! యొం డన్నపానములు దొరకమిఁ గల్ ద్రావినఁ, గల్లగు టెఱుంగక | త్రావిన నద్దురితమధిక ధర్మమునఁ జెడున్. |
297 |
| క. |
గురుసంరక్షణమునకును | బరమాపదయైన యెడను బ్రాహ్మణధనముల్ విరహితములుగాఁ బెఱచోఁ | జొరఁగానగు మ్రుచ్చిమికి వసుమతీనాథా! |
298 |
| తే. |
ప్రాణహాని దప్పించుచోఁ, బరిణయంబు | నందు గురుజన కార్యార్థమయ్యు నంగ నా జనముతోడి సంభాషణమున సర్వ | ధనముఁ జెడియెడు నెడ బొంకఁ జను నృపాల! |
299 |
| క. |
కలలోనఁ జరమధాతు | స్ఖలనము గలిగినను బ్రహ్మచర్యము సెడ దు జ్జ్వలవహ్ని నేయి వేల్చినఁ | దొలఁగుం గిల్బిషము దురితదూరచరిత్రా! |
300 |
| ఆ. |
అన్న పతితుఁడైన నటుగాక సన్న్యాసి | యయ్యెనేని తమ్ముఁ డాతఁ డుండ దార సంగ్రహంబుఁ దాఁ జేసి పాపంబుఁ | బొరయఁ డండ్రు బుధులు కురువరేణ్య! |
301 |
| తే. |
అడవి గోవులకై కాల్చు టధ్వరమునఁ | బశువుఁ, జంపుట, దాన మపాత్రభూతుఁ డగు టెఱుంగక యిచ్చుట, దగనిబంటుఁ | బ్రోవకుండుట గీడులు గావు వత్స! |
302 |
| వ. | తపంబుల దానంబుల మఱియునుం దగిన పుణ్యకర్మంబులనుం బాపంబులు పరిక్షీణంబు లగు నను నిది సామాన్య వచనంబు; ప్రాయశ్చిత్త విశేషంబు లెఱింగించెద. | 303 |