పురాణేతిహాసములు శ్రీమహాభారతము శాంతిపర్వము - ప్రథమాశ్వాసము
చార్వాకుం డను రాక్షసుఁడు బ్రాహ్మణ నిగ్రహంబునఁ జచ్చుట (సం. 12-39-22)
చ. ‘వినుము నరేంద్ర! సర్వమగు విప్రజనంబును గూడి నన్నుఁ బం
చిన విధ ‘మీతఁ డేటిపతి? సేసిన పాపము పెద్ద; చంపుచో
జనకుఁడు భ్రాత పుత్రుఁడను శంక యొకించుక లేదు; సద్గురుం
డనియెడి కొంకు బుద్ధి నిసుమంతయుఁ బుట్టదు; వీనిఁ గాల్పనే!’
361
వ. అను మని రని పలికి వెండియు. 362
ఆ. ‘ఇట్లు శిష్టజనము లేవగింపఁగఁ జేయు | రాజ్య మేల బంధురాజి నెల్లఁ
బొలియఁజేసి యెట్టి భోగంబు లనుభవిం | చెదవు? కల్మషంబు చిక్కె నీకు.
363
వ. అనిన విని యవ్విప్రు లత్యంత వ్యథితాంతఃకరణు లగుచు నొండొరుల మొగంబులు సూచి ‘యిట్లు వుట్టం బని యేమి?’ యను వచంబులతోఁ దిరుగుడు వడిరి; ధర్మనందనుండు లజ్జావనత వదనుండై యూరకుండి, వారలవలను గనుంగొని కేలు మొగిచి ఫాలభాగంబునఁ గదియించి యిట్లనియె. 364
తే. ‘మ్రొక్కి వేఁడెద నను మీరు ధిక్కరింప | కాదరింపుఁడు; మునిసమూహానుమతుఁడ
నై వినిశ్చియ పరికలితాంతరంగ | వర్తనముతోడ నిచటికి వచ్చినాఁడ.’
365
వ. అనవుడు భయ సంభ్రమ భరితు లగుచు నా భూసురులు ‘దేవా! యీ వాక్యంబులు మావలనం బుట్టినవి గా’ విది యేమియో కాని, నీ వుత్తమ క్షత్త్రధర్మంబున సముపార్జించిన యుజ్జ్వలశ్రీ సుస్థిరతం బొందెడు’ మని యతనికి నాశ్వాసం బొనర్చి, యమ్మాయాభిక్షువు నాలోకించి, పరమబోధనంబున నప్పురుషాధము నెఱింగి, యమ్మహీపతితో ‘వీఁడు దుర్యోధన సఖుం డగు రాక్షసుండు సన్న్యాసి వేషంబున నేతెంచి యతనికి హితం బాచరించువాఁడై యీ దుర్వచనంబు లాడె; నీ కుక్క మొఱఁగిన యంతన పాలమున్నీరుం బోని నీకుం గలంగ నేల? ధర్మాత్ములగు తమ్ములు పనుపు సేయం బూజ్యంబగు సామ్రాజ్యంబు వహింపు’మని యాదరించి. 366
క. ఆ రాక్షసుఁ గనుఁగొని కో | పారంజిత నేత్రు లగుచు నవ్విప్రులు హుం
కార ముఖరు లగుటయు, నతి | ఘోరాకృతితోడ వాఁడు గూలెం బుడమిన్‌.
367
తే. బ్రహ్మతేజో నిహతి నిట్లుపడి మహాశ | నిప్రహతి పాతితోర్విజనిభత నొంది
యున్న యద్దానవునిఁ జూచి యన్నరేంద్రుఁ | డెలమి సొంపు వహించెఁ దమ్ములును దాను.
368
వ. ఇట్లు ప్రీతుండై యజాతశత్రుం డవ్విప్రసమూహంబునకు సవిశేషార్చనం బొనర్చి వీడుకొలిపె; నప్పు డచ్యుతుండు బ్రాహ్మణస్తుతి సేసి యజ్జనపతితో నిట్లనుఁ; ‘గృతయుగంబునం జార్వాకుం డనుదైత్యుండు తపం బొనరించి పద్మభవుండు ప్రత్యక్షంబయిన నఖిల భూతంబుల వలనను నభయంబు వేఁడిన నద్దేవుండు భూదేవతల కనిష్టంబులైన పనులు సేయకుండు వాఁడవు; చేసితేని యదియ నీకుఁ దుది యని’ పలికి యవ్వరం బొసంగె నట్లు లబ్ధవరుండై వాఁడు గర్వించి గీర్వాణుల బాధింపం దొడంగిన, వారు విరించిం గాంచి యా రక్కసుండు సేయు బాధలు సెప్పిన, ‘నమ్మహాత్ముం డేను మున్న యెఱింగి యొనర్చినవాఁడు దుర్యోధనుం డను రాజునకు నెచ్చెలియై యచ్చపలుండు తత్కార్యం బాదరింపంజొచ్చి మహీసురులకు మనోవ్యథాకరంబగు కర్మంబు సేయు; నప్పనికారణంబుగా వారల కోపంబునం గూలం గలవాఁ డని పలికె; నద్దానవుండు నేఁ డిట వచ్చి తన దుర్వినయంబున బ్రహ్మదండ నిహతుండై పడియున్నవాఁ’డని చెప్పి, యప్పీనుంగు వెడలవైపించి, యా భూపాలు నుద్దేశించి వెండియు. 369
ఆ. ‘మాఱుకొన్నవారి నీఱు సేయుము; ప్రజ | నరసి మనుపు; ధరణిసురులఁ బ్రోవు;
మఖిల బంధుజనుల నాశ్రితులను సుఖ | వృత్తి మనుపు పెంపు వెలయ నధిప!
370
వ. రాజ్యాభిషేక శోభనం బనుభవింపు’ మని పలికి, యాభిషేచనిక ద్రవ్యానయనంబునకుం దగువారిం బనిచి బయలి పెద్దకొలువుకూటంబున నమ్మహీపతికి మహోన్నత హేమమయ సింహాసనంబు పెట్టించి, వెలయువారలకెల్ల సముచిత సమంచిత పీఠంబు లుపచరింప నియోగించిన, నప్పాండవాగ్రజుం డుల్లంబు కలంక యెల్ల డిగ్గఁ ద్రావి, యిచ్చం దెలివొంది, చెలువొందు నిజపీఠంబునం బూర్వాభిముఖుండై కూర్చుండె; నతని కట్టెదురం గనత్కాంచ నాసనంబున సాత్యకి సమేతంబుగా శౌరియు, వలపటను దాపటను మణిపీఠంబుల వడముడియుఁ గవ్వడియును, వెనుకం గనకాయుత కుబ్జాసనంబులం గవల నిరువంకల నునిచికొని కుంతీమహాదేవియు దామోదరుని దక్షిణ దిక్కున నర్చిస్సముజ్జ్వలం బగు నాసనంబున ధృతరాష్ట్రుండును దదీయ ప్రాక్ప్రదేశంబునం బ్రస్ఫురిత పీఠంబుల విదురుండునుధౌమ్యుండును, ధృతరాష్ట్రుని పిఱుంద నర్హపీఠంబుల గాంధారీ యుయుత్సు సంజయులునుం గూర్చుండి; రా సమయంబున నంబుజాక్షుండు గృపావిశేషంబునఁ గృపాచార్యుం దగుతెఱంగున నయ్యజాతశత్రుం గానిపించి యోగ్యాసనంబున ధౌమ్యు సమీపంబున నతని నునిచె; నంత నప్పుడమిఱేఁడు సిత కుసుమాక్షత కాంచన రజత రత్న గర్భాస్పర్శనం బాచరించెఁ; దదనంతరంబ. 371
సీ. విద్వత్సమూహంబు, వివిధ దేశాధీశ! | సంఘంబుఁ, గార్యవిచారపరులు,
నర్థార్జనాది కృత్యంబుల వారలు, | బహుపరిచర్యలఁ బరఁగు జనులు,
వైశ్యప్రముఖ పౌరవర్గంబులును, ముఖ్య | హలికాది జానపదావలులును,
వైణిక గాయక వాంశికాది వినోద | కరులును, వారసుందరులు లోను
 
ఆ. గాఁగఁ దగినవారు గాంచి యవ్విభుని స | త్కారములఁ బ్రమోదితాత్ము లగుచు
భావములు దలిర్ప సేవించియుండ న | క్కొలువు సాల నొప్పెఁ గురువరేణ్య!
372
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )