పురాణేతిహాసములు శ్రీమహాభారతము శాంతిపర్వము - ప్రథమాశ్వాసము
ధర్మరాజు పట్టాభిషేక మహోత్సవము (సం. 12-40-9)
వ. అంత నాభిషేచనిక ద్రవ్య సంచయంబు సన్నిహితం బగుటయు, మాధవానుమతుండై ధౌమ్యుండు ప్రాగు దకీ ప్లవనంబైన వేదికాతలం బలంకరించి యందు జాతరూప నవరత్న ఖచితంబును దృఢపాదంబు నగు భద్రపీఠంబు ప్రతిష్ఠించి, శార్దూల చర్మాస్తరణ శోభితంబు సేసి యర్చించి, కాంచనదామజుష్టం బగు నుత్కృష్టఘన శంఖంబు సమంచిత స్థండిలంబున నిలిపి పూజించి , దానను దానిచుట్టునుం బార్థివంబులు హైమంబులు రాజతంబులు రత్నమయంబులు నగు కుంభంబు లొనర్చి వాననుగాంగంబులగు జలంబులు నినిచి యన్నింటికి రత్నమంగళతరు త్వక్పల్లవ కుసుమంబులను బంచగవ్యంబులను సమంత్రకంబుగా సంస్కారంబు నిర్వర్తించి. 373
సీ. వీర్యవంతములగు వివిధ మంత్రంబుల | తోఁ గూడ సద్ద్విజస్తోమ పరివృ
తునిఁ జేసికొని రాజుఁ దోడ్కొనియేఁగి యా | వినుత పీఠంబున నునిచి, శోభ
నాలంకరణమున నభిరామ యైన పాం | చాలిఁ దద్వామపార్శ్వమున సహస
మాసీనఁ గావించి, యగ్నిముఖము సేసి | కొని హోమ తంత్ర వర్తన మొనర్చె;
 
తే. నంత నూర్జిత శుభవేళ యగుడు శంఖ | చక్రధరుఁ డా సమర్చిత శంఖ మెత్తి
‘పృథివి కధిపతి వగు’ మని ప్రీతి నా పృ | థాసుతుని నభిషిక్తునిఁ జేసె నధిప!
374
వ. అప్పుడు చిత్తం బుత్తమ ప్రకారంబై యాంబికేయుండు ప్రసన్నవదనుం డగుచుం బ్రతిష్ఠితంబు లయిన కలశంబులలో నుజ్జ్వలం బగు నొక్కటి ధౌమ్యుం డంది యీ నెత్తి యా భూపోత్తము నభిషేకించె; మఱియుం బ్రభూతాత్ము లగు రాజులును, బ్రకృతులలోనం దగువారును,, దదభిషేక శోభనం బాచరించిరి; శంఖానక దుందుభి ప్రభృతి మంగళతూర్యంబులు గంభీర నాదంబులం జెలంగె; నివ్విధంబున సుహృజ్జన హృదయంబు లానందింప ధర్మనందనుండు సామ్రాజ్య పదస్థుండై భూసుర దీనానాథ ప్రముఖ పాత్రంబులకు వివిధ బహుధనంబు లొసంగె; నట్టియెడ విద్యా విశిష్ట బ్రాహ్మణాది పురుష సత్తము లక్కురుసత్తమున కభిముఖులై ‘దేవా! దైవ మానుషంబుల కలిమి నతిమానుషంబగు నీ విజయంబును వసుధాధిపత్య సంప్రాప్తియు నింత యొప్పునే!’ యనిన విని వారలతో నవ్వసుంధరా వల్లభుండు. 375
సీ. ‘కలిగె లేకుండె ని ట్లలఘు గుణంబులు | వాక్రుచ్చి మీయంత వార లిట్లు
గొనియాడఁ బాండునందనులు ధన్యాత్ముల’ | యని పల్కి యంబికాతనయుఁ జూపి
‘తండ్రియు గురువును దైవంబు నీతఁడ | మాకు; మీ రెల్ల నీ మనుజవిభుని
పనుపు సేయుటయు, నీతనికిఁ బ్రియంబు గా | వించుటయును, మమ్ము వేనవేల
 
తే. విధులఁ బ్రీతులఁ జేఁత యుర్వీజనులుఁ | బౌరులును మీరలును దొంటిభంగిఁ దప్ప
కిమ్మహారాజునెడ వినయమ్ముతోడ | నడచుచుంటయు యెంతయు నాకుఁ బ్రియము.
376
క. జ్ఞాతివధ మట్లు సేసియు | నీతనిఁ గొల్చుటకుఁ గాఁగ నీ గృహధర్మో
పేతత్వము బొరసితి భూ | భూతికి మనకు విభుఁ డీ ప్రభువ మఱవకుఁడీ!’
377
వ. అని చెప్పి నిజేచ్ఛ వర్తించి సుఖంబుండు వారుగాఁ బ్రార్థించి, వినయంబుతో ధృతరాష్ట్ర గాంధారుల నగరిలోని కనిచి, పౌరులను జానపదులను బోవంబనిచి, సగౌరవంబుగాఁ గృపాచార్యు నిజనివాసంబున కరుగ వీడ్కొలిపి, యువరాజ పదంబున భీమసేను నిలిపి, కర్తవ్య విచారంబునకుఁ దదీయ నిశ్చయంబునకును సంధివిగ్రహాది షాడ్గుణ్య చింతనంబునకును విదురునిం బ్రియవచన పూర్వకంబుగా నియోగించి, వలయుపనులు వెనుక ముంద రరసి యెఱింగించుటకు నాయవ్యయంబు లెఱింగించుటకునై సంజయుం జొనిపి, సేనల కొలందులను గనుంగొనుటకు భృత్యులకు జీవితంబులు వెట్టుటకుఁ గర్మకలాపంబులు సేయించుటకును నకులు నాజ్ఞాపించి, దర్పితుల మర్దించుటకుఁ బరచక్రంబు లాక్రమించుటకు నర్జును నిర్దేశించి, బ్రాహ్మణకార్యంబులకు శ్రౌత స్మార్తకృత్య సమనుష్ఠానంబునకు ధౌమ్యుం జాలించి, సహదేవుం జూచి ‘నీవు మదీయ గోపనపరుండవై సర్వావస్థల యందును మత్సమీపంబున నిల్చునది’ యని పలికి, మఱియుం గరణీయంబు లగు నధికారంబుల నెల్లను గల్పించి , వీరల మీఁదన పెట్టి, యుయుత్సుం గనుంగొని, విదుర సంజయుల నాలోకించి ‘మీర లనుదినంబును నవధానంబు గలిగి రాచవారి యోగక్షేమంబు లేనెట్లట్ల నిర్వహింప వలయుఁ బురజనంబుల భూజనంబుల కర్జంబులు రాచవారి కెఱింగించి, పంచినట్లు నడపంగలవార’లని యప్పగించి యభ్యంతర మందిరంబునకు విజయంచేయు‘మని కుంతీదేవినిం బాంచాలీ సహితంబుగాఁ బుచ్చి. 378
తే. ప్రేమ సంప్రీతి వినయ మిశ్రిత విలోక | నంబు గృష్ణుని ముఖకమలంబునందు
మాసరంబగు వికసన మధువునకు మ | ధువ్రతంబయి నిగుడ నా సువ్రతుండు.
379
వ. అమ్మహాత్ముని సాత్యకి సహితంబుగా వీడుపట్టున కనుప ననుజన్ముల ననిచి, యుచితవర్తనంబున నుండి పదంపడి భండనంబునం జచ్చిన వారిం జిత్తంబున నిరూపించి తొడంగి. 380
తే. బ్రాహ్మణానుజ్ఞతోఁ గూడ బంధుజనుల | కందఱకు వేఱువేఱు మహావిభూతి
వెలయ నంచిత శ్రాద్ధ క్రియలు సభక్తి | కముగ రత్న హేమాది దానములు మెఱయ.
381
వ. అనుష్ఠించి ద్రోణాచార్య ద్రుపద తద్బంధు విరాట తదీయ జ్ఞాతులకును బ్రత్యేకంబ కర్ణాభిమన్యు ప్రభృతుల కెట్లట్ల సర్వదక్షిణ సామగ్రి వెలయం బరలోక క్రియలు నిర్వర్తింపంజేసి, దుర్యోధనాదులకు నంతకంటె విభవం బెసంగ ధృతరాష్ట్రుం డౌర్ధ్వదైహిక విధు లాచరించునట్లుగా నొనర్చి, తా నెఱింగిన వారల కెల్ల లగ్గు సేయుటకుఁ, దగు బంధులు లేని వసుంధరాధిపుల నెల్ల నుద్దేశించి యంచితదానంబులతోఁ జేయ ధౌమ్యుం బనిచె; మఱియును. 382
క. చలివందిరులును సత్త్రం | బులుఁ బెట్టించెను, దటాకములు దేవగృహ
మ్ములుఁ గల్పించెను, బంధుజ | నులకు సుగతి యగుటకై వినుతభంగి నృపా!
383
క. లోకమునఁ గలుగు భూసుర | లోకమునకు నెల్ల గోవులుం బసిఁడియు నా
నా కల్పంబులు బంధుల | కై కోటివిధముల నిచ్చె నతులిత భక్తిన్‌.
384
వ. ఇట్లు సకల బాంధవ సుహృజ్జనంబులకుం బారలౌకిక క్రియలు సేసి యనృణత్వంబున వెలింగి జగంబులచేతం బొగడు వడసి, గృతకృత్వంబుఁ బొందె; నివ్విధంబునఁ బ్రాప్తసామ్రాజ్యుం డయిన పాండవాగ్రజుం డొక్క సముచితావసరంబున గోవిందున కభిముఖుం డయి వినయంబునం గేలు మొగిచి. 385
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )