| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - ప్రథమాశ్వాసము |
| తే. |
అమల భవదీయ సుప్రసాదమునఁ జేసి | పితృపితామహక్రమయోగ్య పీఠ మైన వినుత సామ్రాజ్యమున కేను విభుఁడనై కృ | తార్థతానంద పూర్ణుండ నైతిఁ గృష్ణ!’ |
386 |
| వ. | అని మఱియును. | 387 |
| క. |
‘బావలు మఱఁదులు ననుచును | నీవు కృపాతిశయ మెసఁగ నెమ్మిని మమ్ముం గావను బ్రోవను దలఁచి ర | మావర! కలిపికొని తిరిగి మన్నించుటలన్. |
388 |
| వ. | తేఁకువలేక మెలంగితిమి గాక! భవదీయ మహానుభావం బున్నరూపెఱుంగను దగం గొనియాడను నే మెంతటి వార?’మని పలికి వెండియు. | 389 |
| క. |
‘ఆదిమ పురుషుఁడ వగుటను | వేదంబులు సెప్పు నవియు వెఱచుఁ బలుకఁగా నీదృక్ప్రకారుఁ డని దా | మోదర! నీ పెం పెఱుంగ నొరుల కలవియే? |
390 |
| క. |
దురితములఁ జెఱుప శుభములఁ | బెరిఁగింపం జాలునట్టి పేళ్ళులు నీకుం బురుషోత్తమ! కడుఁ బె క్కవి | పరమార్థ ద్యోతకములు భావింపంగన్. |
391 |
| తే. |
ప్రయతు లగు సద్ద్విజులు వానిఁ బరమభక్తి | యుక్తి నెపుడుఁ బఠించుచు భక్తి ముక్తి దాయి వగు నిన్ను సతతంబుఁ దలఁచుచును న | మస్కృతులు సేసి యవ్యయ మహిమఁగండ్రు.’ |
392 |
| వ. | అని పలికి విష్ణు విశ్వాత్మ జిష్ణు శర్వ హంస దామోదర శంభు ప్రముఖంబులగు ప్రభూత నామంబులం బ్రస్తుతించినఁ బ్రీతుండై పుష్కరాక్షుండు పుష్కలంబైన వాగ్విశేషంబుల నా ధర్మనందను నభినందించెఁ; దదనంతరంబ కొల్చియున్న జనంబుల నిజనివాసంబులకుం బోవం బనిచి, యక్కురుసత్తముండు దమ్ముల నాలోకించి. | 393 |
| మ. |
‘అటవీదేశములందు గాఢబహులాయాసంబులం గంది, దు ర్ఘట మత్స్యేశ్వరు సేవఁ గుంది, బహుసంగ్రామంబులన్ విద్విష త్పటు నానాస్త్ర మహోగ్ర శస్త్రచయ నిర్భగ్నాంగతం బొంది యు త్కట దుఃఖంబుల మీర లొందితి రభేద్యస్థైర్యులై నాకుఁగాన్. |
394 |
| వ. | నన్నుం గృతకృత్యునిం జేసితిరి; కృష్ణ ప్రసాద లబ్ధంబయిన యీ జయశోభనంబు నిజేచ్ఛాకలిత సుఖావాప్తి లీల ననుభవించుచు నాత్మప్రియ ప్రకారంబుల వర్తించుచు, నవధానంబుతో రాజ్యాంగ సప్తకం బరయుం’డని చెప్పి యాంబికేయు ననుజ్ఞతోడ. | 395 |
| సీ. |
బహురత్నమయ ఘనప్రాసాదమండప | దాసదాసీ జనోద్భాసితంబుఁ, దత్తుల్య వైభవ తదధిక ధనధాన్య | ముఖవస్తు సంచయ సుఖకరంబుఁ, గిన్నర వల్లభ గృహసమానత్వ మ | హావిభూతి స్ఫురణాంచితంబు, సర్వసంపత్స్ఫూర్తి చారు వామాక్షీ ప్ర | చార సంశోభిత స్థలచయంబు, |
|
| తే. |
నైనవాని రారాజుని ల్లనిలజునకు, | దుస్ససేను మందిరము పార్థునకు, వరుస తోడ దుర్మర్షణునియును దుర్ముఖునియు | నిండ్లు గవలకు సంప్రీతి నిచ్చె నృపతి. |
396 |
| వ. | మఱియు విదుర యుయుత్సు సంజయ ధౌమ్యుల వదనంబు లాలోకించి ‘మీ మీ నికేతనంబుల మీరలు గైకొనుం’ డని నియోగించి, పెద్ద నగరిలోన ధృతరాష్ట్రుండు మున్ను పన్నుగా వసియించు హర్మ్య ంబున నజ్జనపతి నునిచె; నివ్విధంబున గృహంబులు విభజించి యిచ్చి కృష్ణ సాత్యకుల సవ్యసాచి సదనంబున నిల్చునట్లుగా నిర్దేశించి, యందఱం బోవం బనిచి యభ్యంతర మందిరంబున కరిగె; నా భీమసేనాదు లమ్మహనీయ వాసంబులు సేకొని యందుఁ బ్రభూతాన్న పానాద్యనుభవంబుల సుఖించియుండ నవ్విభుండు నిజేచ్ఛ విహరించె’నని యిట్లు ధర్మపుత్రు చరిత్రంబు సెప్పిన విని ‘యబ్భంగిం బ్రాప్త సామ్రాజ్యుండై పాండవాగ్రజుండు పదంపడి యెత్తెఱంగున వర్తించె? సకల జగద్గురుం డగు కృష్ణుండు మఱి యెట్లుండె? నెఱింగింపు’ మనుటయు. | 397 |