| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము |
| సీ. |
కలఁడు జహ్నుం డనఁగాఁ దొల్లి యొక మహీ | పతి యుజహ్నుండు దత్సుతుఁడు; వాని కుదయించె వల్లభుం డుర్వీశ! యాతని | కొడుకు తపోనిష్ఠఁ గుశికుఁ డింద్రు మెచ్చించి జగముల మేటినాఁ దగుపుత్త్రు | వేఁడిన దాన నవ్విభున కుద్భ వమ్మయి కౌశికుఁ డిమ్మహి గాధి నా | మమ్మునఁ బరగె నమ్మనుజవిభుఁడు |
|
| తే. |
సత్యవతి యను తన కన్య సంప్రమోద | మున ఋచీకున కిచ్చె; నమ్ముని సుకర్మ నిరతి సంతాన వాంఛమైఁ జరు యుగంబుఁ | దనకు మామకునై కల్పితముగఁ జేసి. |
68 |
| వ. | ఆ భృగునందను డచ్చరువులు నిజభార్య ముందట నిడి ‘క్షత్రియాజేయుండును క్షత్రియ సూదనుండును నగు క్షత్రియోత్తముం డిచ్చరువున జన్మించు; దీని మీ తల్లికి నిమ్ము; తపోధృతి శమంబుల నుత్కృష్టుండగు ద్విజ శ్రేష్ఠుండు దీని వలనం బుట్టు; నిది నీ వుపయోగింపు’ మని వాని నేర్పరించి ‘భవజ్జననీ జనకు లిప్పుడు వచ్చెద’ రని చెప్పి నదీ స్నానార్థియయి యరిగెం; దదనంతరంబ తదాశ్రమంబునకుం దీర్థయాత్రాపరుండయి గాధి గృహిణీ సహితంబుగాఁ జనుదెంచిన, సత్యవతియు నిజ భర్త గావించిన చరుద్వయంబు మాతకుం జూపి తత్ప్రభావ భేదం బుపన్యసించినం బ్రీత యై యద్దేవి పరమపావనస్నానం బాచరించి చరువుపయోగించు నప్పు డజ్ఞానంబునం దన చరువు కూఁతున కిచ్చి కూతుచరువు దానుపయోగించె; నయ్యువతియుం దలంపులేమి నా లేమ యిచ్చిన భంగిన కుడిచె; నంత భార్గవుండు వచ్చి పత్నిం జూచి దివ్య బోధనంబు నెఱింగి ‘క్షత్రియాంతకరం బగు గర్భంబు ధరియించినదాన’ వనవుడు నత్తరుణియుఁ దత్పాదంబులకుం బ్రణతయై ‘మీ రిట్లానతీఁ దగునె?’ యని వడవడ వడంకుచుఁ గేలు మొగిచి నిలిచిన, నత్తపోధనుం డత్తెఱవతో ‘నత్తెఱంగు నా తలంపున వచ్చినది గాదు; భవన్మాతృ బుద్ధిహానిం జేసి చరు వ్యత్యాసంబున నయ్యె; నీకుఁ గ్రూరకర్ముండును మహాబలుండును నగు పుత్రుం డుద్భవించు; నా యమకు బ్రహ్మభూతుండు దపోధనుండును నగువా డుదయించు; నేను దపంబున విశ్వబ్రహ్మంబు నచ్చరువున నావహించినవాఁడ’నని పలుకుటయు. | 69 |
| క. |
అమ్ముగ్ధ యతని కిట్లను | ‘నిమ్మూఁడు జగములు మీర లితరంబులుగాఁ గ్రమ్మనఁ జేయఁగఁ జాలుదు; | రెమ్మెయి నైనఁ గృపసేయరే నా మీఁదన్. |
70 |
| వ. | క్రూరుండగు కొడుకుం గనుట కోర్వ’ ననుటయు ననుగ్రహాతిశయంబున నమ్మహాముని ‘యవ్విశేషంబు నా పుత్రునకు లేకుండెడు; బౌత్రునియం దావహిల్లెడు; నీ కెట్లు ప్రియం బట్లకాఁగలయది’ యనియె; నట్ల యత్తన్వి తపో నిరతుండును, దాంతుండును, శాంతుండును నైన జమదగ్నిం గనియె; బ్రహ్మర్షి సదృశుం డగు విశ్వామిత్రుని గాధిపత్ని గాంచె. | 71 |
| క. |
జమదగ్ని సర్వ విద్యా | సమేతుఁడు నుదారగుణుఁడుఁ జాపాగమవే దిమతియు నగు రామునిఁ గాం | చె మహీపతి హనన శీలు శిఖినిభమూర్తిన్. |
72 |
| వ. | అక్కాలంబునందు హైహయ వంశవరుండు. | 73 |
| ఉ. |
దుర్జయ విక్రమోజ్జ్వలుఁడు దోష వివర్జిత బుద్ధి కార్తవీ ర్యార్జునుఁ డేడుదీవులు నయాన్విత శూరత నేలుచుండ ధ ర్మార్జనలోల బుద్ధియు మహాస్త్రబలంబు సహస్ర బాహుతా స్ఫూర్జనమున్ వెలుంగఁగ నృపుల్ దన యాజ్ఞఁ దలన్ వహింపఁగన్. |
74 |
| క. |
ఆ రాజు నగ్నిదేవుఁడు | గారవమున నడుగ నతఁడు గడుఁబెంపున నా హారముగ నిచ్చె గిరినగ | రారణ్య గ్రామ ఖర్వటాదు లతనికిన్. |
75 |
| వ. | ఇచ్చిన నగ్నిదేవుం డాహారంబుగాఁ గొను తరువాత మిత్రావరుణనందను నాశ్రమకాననం బతండు లేని సమయంబున సమసిన నమ్మహాత్ముం డెఱింగి వచ్చి యా సర్వభక్షకునకు రక్షణం బాచరించుచు వర్తించు కార్తవీర్యునిం గని కనలి ‘నీవు మదీయ తపోవనంబు పరిహరింపక గహన సామాన్య బుద్ధిం గాల్చితి; నీ బాహులు రాముండు నఱకువాఁ’డని శాపం బిచ్చె; సహస్రబాహుండును దానికి విషాదంబు నొంది యధిక తాత్పర్యంబుతో ధర్మకార్యంబుల నడుపుచుండె. | 76 |
| క. |
శాపము గారణముగ నా | భూపతి కవినీతులైన పుత్రులు సబలా టోపాత్ములు పలువురు సిం | హోపములు జనించి ధాత్రి నుద్భటవృత్తిన్. |
77 |
| వ. | ఎందునుం జరియించు వా రొక్కనాఁడు జమదగ్ని యాశ్రమంబునకుం బోయి యతండునుం జామదగ్న్యు ండును నయ్యెడ లేకుండ హోమధేనువును వత్సంబునుం దమ మందిరంబునకుం గొనివచ్చి; రిట్లు దెచ్చుట సహస్ర బాహుం డెఱుంగఁడు. | 78 |
| క. |
అట రాముఁ డెఱిఁగి పరమో | ద్భట మగు కోపమునఁ జాప పరశుముఖ మహో త్కట శస్త్రాస్త్రంబులతోఁ | బటుగతి వచ్చెను సహస్రబాహుని మీఁదన్. |
79 |