పురాణేతిహాసములు శ్రీమహాభారతము శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము
పరశురాముఁడు కార్తవీర్యార్జునునిఁ జంపుట (సం. 12-49-41)
ఆ. వచ్చి ముట్టి కయ్య మిచ్చిన నవ్విభు | నొంచి బాహు వనముఁ జంచ దుగ్ర
పరశు ఘోరధారపాల్‌ సేసి పోయి ని | జేచ్ఛ నుండె మేదినీశవర్య!
80
చ. అతఁడు సమిత్కుశాభిహరణార్థము గానకు నేఁగియుండఁగా
నతి కుపితాత్ము లై కడఁగి యర్జునుసూనులు వోయి ముట్టి త
త్పితృశిరమున్‌ వెసం దునిమి ప్రీతిమెయిం జనుదెంచి; రమ్మహో
ద్ధతుఁ డట వచ్చి వారి చరితం బెఱిఁగెం దమ తల్లి సెప్పఁగన్‌.
81
వ. అ ట్లెఱింగి. 82
శా. రాముం డుద్ధత రోషపావక శిఖాప్రస్ఫీతుఁడై తున్ముదున్‌
భూమీశాలిఁ గుఠారధార నని విస్ఫూర్జద్గతిన్‌ హైహయ
స్తోమం బాదిగఁ జొచ్చి రాజకులముం దున్మాడి చేసెన్‌ సము
ద్దామ క్రీడను రౌద్ర మొప్ప నిల రక్తస్యంద సంసిక్తఁగన్‌.
83
వ. ఇట్లు సేసి పరమకృపావిష్ట హృదయుండై తపోవనంబునకుం జనియెఁ; బదంపడి బహువత్సరంబులు సనిన విశ్వామిత్ర పౌత్రుండైన పరావసు వనురాజు దుర్వినీతుండై గర్వోద్రేకంబునం బరశురాము నధిక్షేపించి, రాజులకు వెఱచి డాఁగి యున్నవాఁడ వని విశిష్ట జన సన్నిధిం బలికి బాల వృద్ధ భావంబున నుపేక్షితులై యతని చేత మున్నుచావక యున్న ప్రతర్దనాదుల నుగ్గడించి. 84
ఆ. ‘నృపులు గారె వారు? నీవు మిధ్యా ప్రతి | జ్ఞాభిమాని’ వనుడు నతఁడు మగుడ
రోషమెత్తి కడఁగి క్రూరత నాబాల | వృద్ధముగ నరేంద్ర వితతి నఱకె.
85
వ. గర్భంబుల నున్న యర్భకులను మఱియు వివిధ ప్రకారంబులఁ బోరం దప్పిపోయి పుడమి యేలు రాజులం గాలాంతరంబుల వెదకి వెదకి వధియించె; నిట్లిరువది యొక్క మాఱు నేల నిః క్షత్రంబు గావించి యశ్వమేధ యాగంబు సేసి, దక్షిణగా నీ క్షితి యంతయుం గశ్యపున కిచ్చెఁ; బదంపడి యమ్ముని యా జామదగ్న్యుతో ని ట్లనియె. 86
తే. ‘అశ్వమేధ యాగంబున నవని యెల్ల | నాకు దక్షిణగా నిచ్చినాఁడ; వింక
నాధిపత్యంబు నీకు లే దరుగు దక్షి | ణాబ్ధిపారదేశమునకు ననఘచరిత!
87
వ. అని పలికి యెందేని నేమేనియుం దెఱంగున శేషించినరాజ పింఛంబునకు నిశ్శేషత్వంబు వాటిల్లకుండం బరిహరించు బుద్ధిం బలికిన నప్పురుష సింహుండు ‘నట్ల కాక’ యని పోవ, నతని వలని వెఱపున నవ్వలని సముద్రుండు శూర్పాకార ప్రదేశంబు బెరయం గొంతదేశం బతనికి విహారస్థానంబు గావించె; నివ్విధంబునం గశ్యప మునీంద్రుండు పరిగ్రహించి భూమి భూసుర ప్రకరంబుల కిచ్చి తపోవనంబున కరిగె; భూమియు నతనిపేరఁ గాశ్యపి యన నెగడెఁ; గొండొక కాలంబునకు వైశ్య శూద్ర ప్రముఖులు దర్పితులై వివిధ ప్రకారంబుల విప్రదారధన ధాన్యాదు లపహరింపం దొడంగిరి. 88
సీ. పదపడి విప్రులు పథము దప్పి వధంబు | మద్యపానంబు సన్మార్గ వర్తు
లైన సాధుల ధన మపహరించుటయును | మొదలుగాఁగ నకృత్యములకుఁ జొచ్చి
రధ్వరాదిక సత్క్రియల్‌ ప్రవర్తింపక | తెక్కలిబంది యే దిక్కులందు
దఱుచయ్యె నిమ్మెయి ధర్మంబు సెడి యధ | ర్మంబు వర్తించి యరాజకత్వ
 
ఆ. దోష జాతమైన దురిత బాహుళ్యంబు | గుతిలపెట్ట భూమి యతలమునకుఁ
బోవ నెఱిఁగి కశ్యపుఁడు నిజోరువు నెఱి | గ్రుచ్చి దాపు గాఁగ నిచ్చి యెత్తె.
89
వ. అది కారణంబుగా ధరణి యుర్వి యనం బ్రసిద్ధి వహించె; నయ్యుద్ధరణ సమయంబునం గాశ్యపి గశ్యపుని వేఁడుకొని యుత్తమ క్షత్రియులు దండనీతి ప్రయోగంబునం జేసి ధర్మంబు రక్షించి తన్ను సురక్షితం జేయువారుగా వరంబు వడయుటకై యమ్మహామునితో ని ట్లనియె. 90
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )