| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము |
| క. |
‘నాయం దచట నచట రా | మాయత బాహా విభూతి కగపడని ఘనుల్ ధీయుక్తులు గల; రన్నర | నాయకులను వినుము పనుపు నను రక్షింపన్.’ |
91 |
| వ. | అని పలికి యద్దేవి తన సురక్షితత్వంబున హైహయులు గొందఱు చావునకుం దప్పుటయు, బౌరవాన్వయ ప్రభావుండగు విదూరథ సుతుండు ఋక్షవత్పర్వతంబున ఋక్షంబులచేత రక్షితుం డగుటయు, సౌదాసవంశ జనితుం డొక్కరుండు పరాశర సంయమి వరు నధ్వర కాలంబునంఁ జేరినఁ గారుణ్యాతిశయంబున నమ్మహాత్ముండు వాని శూద్ర ప్రవర్తనంబున సర్వ కర్మంబులుఁ జేయించుకొని రక్షింప సర్వకర్ముం డనం బరఁగుటయు, శిబి మనుమఁడు గోపతి యనువాఁడు, వనంబున గోవులు రక్షించిన బ్రతికియునికియుం, బ్రతర్దన పుత్రుడు వత్సాభిధానుండు వత్సంబులు గోష్ఠంబున రక్షణం బాచరింప సంచరించుటయు, దివిరథ తనయుం డగు దధివాహను కొడు కంగుం డనువాఁడు గంగా కూలంబుల గౌతమ మునీంద్రుని రక్షం జేసి నిర్భయుండై వర్తిల్లుటయు, బృహద్రథ కులజాతుండు భూరి నామథేయుండు గృధ్రకూట శైలంబున గోలాంగూలంబులు రక్షించుట వలనఁ గలిగి యుండుటయు, మరుత్త సంతాన సంభవులు చతుర్వర్ష వయస్కులగువారు మువ్వురు సముద్రుండు రక్షకుండై పెనుపం దత్తీరంబునం బెరుఁగుటయుం జెప్పి వా రుత్తమ క్షత్రియులు వారలు సమ్యక్పరిపాలనంబున న న్నరయువారుగా ననుగ్రహించిన నచలితనై యుండెద. | 92 |
| క. |
వారల పెద్దలు నాకై | పోరఁ బరశురాము చేతఁ బొలిసిరి; నాకున్ వారి నధిపతులఁ జేయుట | గోరందగుఁ గాన యిట్లు గోరితి ననఘా!’ |
93 |
| తే. |
అనిన విని వారి రావించి య మ్మునీంద్రుఁ | డందఱను జూచి యాధిపత్యమున కిమ్మ హాభుజులు దగు వారని యవనిఁ దగిన | యట్లు విభజించి యభిషేక మాచరించె. |
94 |
| క. |
ఆ నృపుల వంశముల నా | నా నృపతులు పుట్టి; రిట్లు నరవర! నృప సం తానములు పెక్కు గలిగి మ | హీనాథత్వమున వ్రాలె నెందును గలయన్. |
95 |
| క. |
అప్పరుసునఁ బెరిఁగిన నృపు | లిప్పుడు భారత రణోపహృతులై పలువుర్ గుప్పలు గొనఁబడి; రనికిం | దప్పిన వాఁడొకఁ డొకండ ధర నంతంతన్. |
96 |
| వ. | నీ వడిగిన పూర్వ వృత్తాంతంబు చిత్తాయత్తంబుగా నెఱింగించితి; ననవుడు ధర్మనందనుండు గోవిందు తోడఁ ‘బరశురాముఁ డింతటి వాఁడగునే? కోపంబును, విక్రమాటోపంబును జిత్రంబుగా ధాత్రి నిఃక్షత్రంబు సేసె’ నని పలికె; వెండియు. | 97 |
| తే. |
‘ధరణియును ఋక్షములుఁ బరాశరుఁడు గో స | మూహములు వత్సములు గౌతముండు గపులుఁ దోయధియు నింత పుణ్యంబు సేయునే? జ | నంబు భాగ్యంబు నభివర్ణనమున కెక్కె’ |
98 |
| వ. | అని యిట్లు సల్లాపంబు సేయుచు మాధవ ధర్మజు లరిగి, యోఘవతీ తీరంబున శరతల్పగతుం డై గాంగేయుం డున్నెడ కనతి దూరంబున రథావతరణంబు సేసిన, భీమసేన ప్రముఖులుం గృపాదులు నరదంబులు డిగ్గి, రిట్లందఱు నంతరంగంబు లేకాగ్రంబులు సేసికొని చేరం జని, సాత్యవతేయ ప్రభృతి మునీంద్రులకుం బ్రణమిల్లి, మఱి భీష్ముం గాంచి రట్లు సముచిత ప్రకారంబునం గని యతనిం బరివేష్టించి యాసీనులై రప్పు; డచ్యుతుం డమ్మహాత్ము నాలోకించి యుమ్మలించుచు నతనితోడ. | 99 |
| సీ. |
‘నీకు మున్వోలె నవ్యాకులమై యున్న | యదియె చిత్తంబు? దేహంబు పీడ ఘనము మనఃపీడకంటె నందురు బుధు | లొక ముల్కి యొడలిలో నున్న నలఁత సేయు; నెమ్మెయి బహుసాయక కీలిత | మైన యంగంబు నొ వ్వడుగ నేల? యిట్టు లుండియు నించుకేనియు దుఃఖంబుఁ | బొరయమి పితృవరస్ఫూర్తిఁ గాదె! |
|
| ఆ. |
దేవతలకు నైన నీ వుపదేశింతు | కలిమి లేములకు వికార మొంద కుండ బోధ వృద్ధు లొరులు నిన్ దేర్పంగ | వలవ కునికి నిజ మవార్యతేజ! |
100 |
| క. |
భూతంబుల సంసరణము | భూత భవద్భావి కార్యములు గర్మ సము ద్యోతన భంగియు నీ యఱ | చేతివి కావె కురువంశశేఖరజన్మా! |
101 |
| వ. | అని వెండియు. | 102 |
| ఉ. |
‘రా జటె! రాగహీనుఁ డటె! రాజిత సుందరమూర్తి యట్టె! వి భ్రాజిత సంపదున్నతి విభాసిత వర్తనుఁ డట్టె! కామినీ రాజి మనోజ్ఞభంగి చతురత్వ ధనుండటె! బ్రహ్మచర్యదీ క్షా జిత మన్మథుండు నటె! జన్మము లిట్టివి యెందు గల్గునే? |
103 |
| క. |
సురలును నసురులు యక్షులు | నురగులు గంధర్వులును మహోద్ధతిఁ బై పై నురవడి వచ్చిన నొకఁడవ | పరాజితులఁ జేయు దుగ్ర బాహా స్ఫురణన్. |
104 |
| చ. |
దమమును సత్యముం దపము దానము వేదములందుఁ జాపవే దమునను గల్గు నైపుణియు, ధర్మవిధిజ్ఞతయున్, విరోధి భూ రమణ విమర్దన క్రమ విరాజిత శౌర్యము నీకుఁ బోలె నై జము లగువాఁడు వేఱొకఁడు శంతనునందన! పుట్టఁ డెన్నఁడున్. |
105 |
| క. |
వేయేల? సంభవించునె | సాయక తల్పమున నుండి చావఁగ నొల్లన్ నా యిచ్చఁ గాక? యను నరుఁ | డే యుగమునఁ జూడ వినఁగ నెచ్చట నైనన్. |
106 |
| తే. |
వసువులందును బెద్దవు, వాసవాది | సురుల మిగులుదు గుణముల, ధరణిసురులు సెప్ప విందు, నీ మహిమ నా చిత్తమునను | గందు ననుపమతేజ! గంగాతనూజ!’ |
107 |
| వ. | అని పలికి పాండవాగ్రజుం జూపి. | 108 |