| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము |
| క. |
శాంతుఁడు గా కని నాయుధ | వంతుం డై కవియు విప్రు వసుధేశుఁడు వే దాంతి నయిన హింసించుట | యెంతయు ధర్మంబు; శ్రుతులు నిట్లని చెప్పున్. |
175 |
| క. |
గురుతల్పగు, భ్రూణహనున్, | నరేంద్ర విద్వేషి, బ్రాహ్మణఘ్నునిఁ బెలుచన్ ధరణి వెడల నడువ వలయు; | శరీర నిగ్రహము సేయఁ జన దెయ్యెడలన్. |
176 |
| వ. | దుర్గంబు లనేక విధంబులు గలవు; వానియందు నర దుర్గంబు వరిష్ఠంబు గావున వర్ణంబులు నాలిగింటి మీఁదను మేదినీశ్వరుండు దయ గలుగవలయుఁ; గేవల క్షమావంతుం డగుటకు సాదుటేనుంగు చందంబై యుండు; నివ్విషయంబున బృహస్పతి వచనంబులు గలవు; తదీయార్థంబులు వివరించెద. | 177 |
| సీ. |
మేదినీపతి యతిమృదువైన, మావంతుఁ | డేనుంగు నెట్లట్ల యెక్కి యాడఁ జూచుఁ దేఁకువ సెడి నీచపుఁ బ్రజ;క్రూరుఁ | డగునేని లోకంబు బెగడు గుడుచుఁ గాన వసంతంబుభానుని చాడ్పునఁ | దగియెడు పాటితో ధరణి ప్రజల నుచితవర్తనముల నొందించునది; యిది | రాజ ధర్మములకు రాజు సుమ్ము; |
|
| ఆ. |
కౌరవేంద్ర! యదియుఁ గాక దండము పరీ | క్షా విశుద్ధి పూర్వకముగ వలయుఁ దనతలంపు వెంటఁ దమకించి ప్రజకు నొ | వ్వుగఁ జరించుటయును దగదు పతికి. |
178 |
| క. |
విను గర్భిణి ప్రజ బ్రదుకున | కనురూపము లైన యట్టి యాహారంబుల్ గొనుగతిఁ బతి ధరణీ ప్రజ | మనికికిఁ దగ నడచునది తమకి గా కెపుడున్. |
179 |
| మ. |
పరిహాసంబునఁ దేలి భృత్యులయెడం బ్రహ్లాదముం బొందు భూ వరునాజ్ఞం జన; రీగి మెచ్చరు పనిన్ వంచింతు రెగ్గాడఁ జొ త్తురు; కౌతూహల వేష భూషణములం దుల్యత్వముం బొంది యే తురు; వా రెల్లపదంబు వేఁడుదురు; సింతుర్ భూమి మాఱొడ్డులన్. |
180 |
| వ. | కావున భృత్యుల యెడ నత్యంత హర్షంబునం దేలి తేఁ కువసెడఁ జరింప వలదు; సప్తాంగంబుల యెడ విరోధం బాచరించువాని నెవ్వని నైనను విడువ వలయు’నని చెప్పి వెండియు. | 181 |
| క. |
అవలేపంబునఁ గర్త | వ్య వివేకము లేక వలసినట్టుల యెవ్వం డవినీతి సేయు ధరణీ | ధవుఁడు విడువ వలయుఁ దన కతఁడు గురుఁ డైనన్.’ |
182 |
| వ. | అని మరుత్తుండను మహారాజునకు బృహస్పతి యొడంబడం బలికె; నట్లగుట గురుండు మిత్రుండు పుత్రుండని మన్నింప వలవదు; తప్పు గలిగిన ధరణీపతులకు దండింప వలయు; సగరుండు దనకొడుకు నసమంజసునిం బౌరబాల బాధకుండుగాఁ దెలిసియు నుద్దాలకముని నిజ తనయు శ్వేతకేతుని విప్రులయెడ మిథ్యోపచారకుం డని యెఱింగియుఁ బరిత్యజించి రన వినమె! యిట్టి చరితంబుల రాజు ప్రజారంజకుండు గావలయు; నిక్కంబును జక్కటియునుం గలిగి జనుల చిత్తంబులు నొప్పింపక పెట్టవలయు; నట్టివి దఱి తోన పెట్టుచు సైరణ గలిగి వర్తిల్లు భూవల్లభుం డభివృద్ధి నొంది యతిశయిల్లు. | 183 |
| క. |
‘తనకీడు వైదికపు వ | ర్తనములఁ గొని యడఁప వలయు; దానిం గడవన్ జనపతికి మేలు గలదే? | వినుము చతుర్వర్గ పరత విహిత మతనికిన్. |
184 |
| ఆ. |
సకల వర్ణ ధర్మ సంకర రక్షయు, | సంధి విగ్రహాది షడ్గుణములు, నలయ కరయుటయును నర్థ సమ్యగుపార్జ | నమును నృపతి యెపుడు నడపవలయు. |
185 |
| క. |
పొనరిచి యాడెడు మాటలఁ | గొనఁ దలఁపక దుర్వినీత కోటి ధనంబుల్ దన కెక్కినట్టి తప్పులఁ | గొని సుజనుల కీగి నృపతి గుణమండ్రు బుధుల్. |
186 |
| క. |
కడు నమ్మి యునికియును నె | క్కుడు నమ్మమియును సుశీల కుశలత గా; దె య్యెడ నైనను బుద్ధి సొనిపి | తడవి కనికొనంగ వలయుఁ దగవుఁ దగమియున్. |
187 |
| క. |
ధన మపహరించుటయ తన | కనిశముఁ బని గాఁగ బ్రదుకు నతి లుబ్ధునకున్ విను! శత్రులచే నౌటకు | మును దన ప్రజలచేన చేటు మూఁడు నరేంద్రా! |
188 |
| ఆ. |
ధర్మరతులు, నర్థ నిర్మాణ చతురులు, | లౌల్యరహితులును, నలంఘితాజ్ఞు లును, సునీతి నిపుణులును, గులజులు నగు | పరిజనములఁ బెనుపు పతికి హితము. |
189 |
| చ. |
కపటము లేక, వైభవము గప్పక, యొండొరుమీఁద రాజుపై నపరిమిత ప్రియం బెసఁగ నల్గక యుండు ముదంబుఁ బొంది యే నృపు విషయంబునం బ్రజ వినిర్మలవృత్తతఁ బుత్రుభంగి నా నృపు నృపుఁ డండ్రు గా కితరునిం దగువా రెద నియ్యకొందురే? |
190 |
| క. |
ధన దారాదికముల నె | వ్వనికిని రక్షించికొనఁగ వసమే రక్షా ఘనుఁ డగు పతి గల్గిన గా | కనఁడే శుక్రుఁడు సుమతు లభినందింపన్. |
191 |
| క. |
అనధీయానుం డితఁ డనఁ | జను ఋత్విజునట్ల చూవె సంరక్షా క ల్పన హీనుఁడైన నృపుఁడని | మనువు పలికెఁ గాదె బుద్ధిమంతులు మెచ్చన్. |
192 |
| వ. | మఱియు బృహస్పతి మహేంద్ర భారద్వాజ ప్రముఖులగు రాజధర్మానుశాసకులు రాజత్వ మూలకారణంబు ప్రజాసంరక్షయ యనిరి గావున నెత్తెఱంగున నైనను లోకరక్షణంబు రాజున కవశ్య కర్తవ్యంబు. | 193 |
| తే. |
సంతతోత్సాహవంతుఁడై శత్రుకోటి | నార్జవంబున నైన ననార్జవమున నైనఁ జెఱుపన వలయు; నత్యల్పుఁడైనఁ | బగతుఁ డగ్ని విషంబుల పగిది నొంచు. |
194 |
| క. |
విను నృప! రాజ్యామిషముం | గొనఁ బలువురచేతఁ బ్రాణగొడ్డంబై యు న్నను ధీరుఁ డేమఱమి నది | దనకును దక్కించుకొను బుధస్తుత్యముగన్.’ |
195 |
| వ. | అని చెప్పి భీష్ముం ‘డేను రాజధర్మ ప్రకారంబు సంక్షేప రూపంబున నెఱింగించితి; నీకు సందేహంబు గల యట్టిది యెయ్యది యడుగు’ మనిన, ధర్మనందనుం డమ్మహాత్మునితో ‘నరుణగభస్తి యస్తగిరి సేరెడు; నేఁటికిం బనివినియెద; రేపు వచ్చి యడిగెద’ ననుచుం దత్పాదంబులకుం బ్రణతుండై వీడ్కొనియెఁ; బద్మనాభ ప్రముఖులును వీడ్కొనిరి; వారలందఱును మునులకు నభివాదనంబు లాచరించిరి; మునులు నిజ స్థానంబుల కరుగం దారును దృషద్వతి యను మహానదిం గృతసంధ్యావందనులై చని కరిపుర ప్రవేశంబు సేసి సుఖవృత్తి నా రాత్రి గడపి, కల్యంబునం గాలోచిత కృత్యంబు లాచరించి భీష్ముపాలికిం బోయి, యంతకు మున్న వచ్చి యున్న మునిలోకంబునకు నమస్కరించి సవినయంబును సకుశలప్రశ్నంబునుంగా నగ్గాంగేయునిం గదిసి బలసి కూర్చుండి; రా సమయంబునఁ బాండవాగ్రజుండు ప్రాంజలి యై యతని కిట్లనియె. | 196 |
| సీ. |
‘రాజనామమునకు భాజనం బై మహా | ద్భుత చరిత్రుం డగు పురుషుఁ డొకఁడు గలిమికి మూలంబు ఘన విశేషము గల్గ | నోపుఁ గౌరవ కుల దీపజనన యది యెఱింగింపవే; యవయవంబులుఁ బ్రాణ | మానసంబులు జన్మ మరణములు శ రీర యాత్రలు నెల్లవారికి నెట్లట్ల | కాని విభేదంబు గాన; మిట్టి |
|
| ఆ. |
రా జొకండు శూర తేజస్వి బుద్ధి మ | జ్జనుల నెట్లు దన వశంబు సేయ నిలుపఁ జెఱుప నెల్లయిలయును నేల దై | వ నిభుఁడగుచు మ్రొక్కుగొనఁగఁ జాలె. |
197 |