పురాణేతిహాసములు శ్రీమహాభారతము శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము
భీష్ముండు ధర్మజునకు దండనీతి జన్మప్రకారం బెఱింగించుట (సం. 12-59-11)
వ. అదియును వినవలతు’నని యడిగిన నమ్మనుజపతి కమ్మహాత్ముం డిట్లనియె. 198
క. ‘విను! తొల్లి కృత యుగంబున | మనుజలయెడ దండనీతిమంతుం డై రా
జన నొకఁడు గలిగి యరయుట | మనుజేశ్వర! లేదు ధర్మమత మండ్రు తగన్‌.
199
క. ఒండొరులకు రక్షకులై | యుండుదు; రట్లుండ దైన్య మొదవిన లోభం
బొండొండు పెరిఁగి ధర్మము | ఖండితమై మొదలుకొని రకార్యంబులకున్‌.
200
క. క్రమమునఁ గామము రాగము | దమ మనముల నొదవఁగా మదం బెక్కిన వి
భ్రమ మొందుచు విచ్చల విడి | విమార్గ చరితముల వేదవిధ్వంసకులై.
201
క. మనుజులు ధర్మముఁ బొడవడఁ | చిన వేదముఁ గర్మములును జెడుటకు భయ మం
దిన యింద్రాదులు గమలా | సనుఁ గానఁగ మునులుఁ దారుఁ జనిరి నరేంద్రా!
202
వ. చని యద్దేవునిం గని ‘మనుజ లోకంబున వేదంబులు ధర్మంబులుం బొడ వడంగిన నధ్వర రాహిత్యంబున నేమును దుర్బలులమై భయంబంది వచ్చితిమి; రక్షింపు’మని యవ్విబుధులు విన్నవించిన విరించి ‘దానికిం బ్రతి విధానంబు సేసెద; మీరు వెఱవ వల’ దని పలికి స్వామ్యమాత్య రాష్ట్ర దుర్గ కోశ సుహృద్బలంబులు నాన్వీక్షకీ త్రయీ వార్తా దండనీతులును, నరి మిత్త్రోదాసీ నాదిక ద్వాదశరాజ మండలంబును, సంధి విగ్రహ యానాసన ద్వైధీభావ సమాశ్రయంబులును మొదలుగా వలయు వానికిం బ్రబోధకంబులగు నానావయవంబులుం గలిగి ధర్మార్థ కామ మోక్షంబులకు సాధకంబులయి యుండునట్లుగా నూఱువేల ధ్యాయంబుల నఖిలలోక హితంబగు నీతిశాస్త్రంబు రచియించి, యిది లోక చరిత్ర నిర్మలీకరణంబునకుం గారణంబగు’నని యనుగ్రహించె నా లోక పితామహు లలాటంబున ననాది నిధనుండును, విశ్వజగత్కర్తయు సర్వ భూతాత్ముండును సనాతనుండును నగు విరూపాక్షుండు విశాలాక్షుండను నామంబున నావిర్భవించి యా గ్రంథం బధిగమించి దాని నభ్యసించుటకు మర్త్యుల కాయుర్బుద్ధులు సాలవని యుమ్మలించి యమ్మహనీయ తంత్రంబు సంక్షేపరూపంబునం బదివే లధ్యాయంబుల వైశాలాక్షం బన నిర్మించె. 203
ఆ. హరునివలనఁ బడసి యాశాస్త్ర మమరేంద్రుఁ | డయిదు వేలు సేసె నమరగురుఁడు
దేటపడ నొనర్చెఁ ద్రిసహస్రకాధ్యాయ | రూప సమ్మితముగ భూపవర్య!
204
వ. దాని శుక్రుండు సహస్రాధ్యాయ పరిమితంబుఁ గావించె; మఱియు మనుష్యుల శక్తి యెఱింగి మునులు క్రమంబున సంక్షిప్త రూపంబులుగా గ్రంథంబులు గావించి;రిది నీతి శాస్త్రప్రవర్తన ప్రకారం;బట్లు సుర లమ్మేలు వడసి విశ్వలోకేశ్వరుం డగు విష్ణుపాలికిం జని తగం గని కార్యంబు విన్నవించి, నీతిశాస్త్ర సముద్భవం బెఱింగించి, దీని నధిగమింపను, దదీయాచారంబు నడపను శక్తుం డగు వాని నొక్కరుని నిర్దేశింపవలయు నని యభ్యర్థించిన నద్దేవుండు నిజతేజోమయుండుగా నొక్క మానసపుత్రు నిర్మించి విరజుం డను పేరిడియె; నతండు భూమికిం బ్రభువుగా నొల్లకుండెఁ; దత్సుతుండు కర్దముండు ననపేక్షిత రాజ్యుండై తపంబున కరిగెఁ; దదీయ పుత్రుం డనంగుండు దండనీతి నయించి భూ ప్రజలం బాలించె; నతని కొడుకు నీతి యనువాఁ డమ్మహా రాజ్యంబున కభిషిక్తుండై యింద్రియ వశత్వంబు నొందిమృత్యుపుత్రి సునీథ యను కామినిం గమనీయాకార నతిమనోహర గుణ విభాసినిం బరిణయంబైన, దానియందు వేనుండు గలిగి మాతామహదోషంబునం జేసి రాగద్వేషంబులం బ్రజకు విరుద్ధుం డయ్యె; నట్లగుటయు మహామునులు గూడి యేతెంచి మంత్రపూతంబు లగు కుశసంచయంబుల నతనిం బ్రశమితుం జేసి తద్దక్షిణోరుతలంబు మథించిన. 205
క. విను కాలిన కొఱవి తెఱం | గున నల్ల దనంబు మిగులు కుఱుచ యొడలు నె
ఱ్ఱని కన్నులు నై యశుచి | త్వ నిరూఢుం డొకఁడు పుట్టె ధర్మతనూజా!
206
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )