| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము |
| వ. | వానిం జూచి యా ఋషులు ‘నిషీద’ యని పలికి వర్జించుటం జేసి తత్సంతాన జాతులు నిషాదు లనం బరఁగి వింధ్యాది గిరి వన ప్రదేశంబులఁ గ్రూరత్వంబున వర్తిల్లి; రమ్మునులు మఱియు నా రాజు దక్షిణ బాహువు మథించిన నుజ్జ్వలత్కవచ శరశరాసన భాసమానుండును వేద వేదాంగ ధనుర్వేద పారగుండును నగు పరమాకారవంతుం డుదయించె; సకల దండనీతియు నప్పురుషు నాశ్రయించె; నతం; డమ్మహాత్ముల కభిముఖుండును బ్రాంజలియు నై వినయంబున. | 207 |
| తే. |
‘వినుఁడు! ధర్మార్థ తత్త్వ ప్రవీణ యగుచు | సూక్ష్మ దర్శిని యైనది సుకృతులార! నాదు బుద్ధి; మీ కెప్పని నడపవలయు | దీనిఁ గొని నన్నుఁ బనుపరే దాని’ కనిన. |
208 |
| వ. | వారునుం దత్సమయ సమాగతు లయిన విబుధులును నవ్వైన్యాభిధాను నభినందించి. | 209 |
| సీ. |
మాన లోభములఁ గామ క్రోధములఁ బాసి | సర్వ జంతువులకు సముఁడ వగుచు నియత ధర్మము నీవు నిశ్శంక నడపుము; | ప్రియము నప్రియము నుపేక్షఁ గూర్పు; ‘దండనీత్యాశ్రయ ధర్మంబు నా పని; | దీనిఁ జేయుదు సావధాన వృత్తి; రక్షింతు శ్రుతుల; వర్ణముల సంకరములు | సొరనీ; నదండ్యులు ధరణి దివిజు |
|
| తే. |
లరయువాఁడ నే భూప్రజ’నని ప్రతిజ్ఞ | యను మహోన్నత పద మెక్కు మనుడు, నాతఁ ‘డవనిసురులు సహాయత్వ మాచరించి | రేని న ట్లగుఁ గా’ కనియెం గుమార! |
210 |
| వ. | అనిన విని వారలు ప్రీతచిత్తులై యాతనికి మహీసురులు సహాయత్వం బాచరించువారుగా ననుమతి సేసి; రయ్యవసరంబున వాత్సల్యంబున సకల దివ్య పరివృతులై వచ్చి విష్ణు విధాతలు నమ్మునీశ్వరులును నక్కుమారు నఖిల ధరణీ సామ్రాజ్యాభిషేకంబు నిర్వర్తించి; రవ్విభునకు శుక్రుండు పురోహితుండును వాలఖిల్యుల యందు సారస్వతగణం బమాత్యులును గర్గుండు సాంవత్సరికుండు నై నడచిరి. మున్ను మహి విషమ యగుటయు నమ్మనుజపతి సమమూర్తి గావించుటయు విందుము. కరచరణాద్యవయవములతో నవనియు సాగరంబులును మహాగిరులును నగ్గురు ప్రభావుని భజియించె. | 211 |
| క. |
సురపతి విభవము, మేరువు | హిరణ్యమును, గిన్న రేశుఁ డీడిత సంప ద్గురుతయు నొసఁగిరి రథ కరి | తురగ భటావళులు తలఁపుతో నొడఁగూడెన్. |
212 |
| వ. | ఇట్లు మహనీయ ప్రభుత్వ పదస్థుండై యమ్మహాత్ముండు శాస్త్రోక్త మార్గంబున దండనీతి పరిపాలనంబు ధర్మతాత్పర్య సమీచీనంబుగా నాచరించె. | 213 |
| క. |
ఉరగాదులవలని భయముఁ | బొరయక యొండొరులతోడఁ బొసఁగి రుజలుఁ జి త్తరుజలు లేక యతని తఱి | ధరణీప్రజ సస్యసంపదయుఁ గల్గి మనున్. |
214 |
| తే. |
బ్రాహ్మణ క్షత సంత్రాణ పరతఁ జేసి | క్షత్రియాభిధానంబు, రంజనము నెల్ల ప్రజకుఁ జేయుట కతమున రాజనామ | మును బ్రవర్తిల్లె నా నృపాలునకు నధిప! |
215 |
| వ. | తత్సంతతి జాతు లెల్లను దత్కల్పులై రాజత్వంబు వహించి దండనీతి పాలించిరి; రాజని యొకండు కలిగిన తెఱంగును రాజ్య స్థాపనంబును రాజు మిగిలి వర్తింపం దక్కిన జనంబులకు రాకుండుటయు విష్ణు విహితంబులు విష్ణుండు రాజుల నిజ తేజోంశంబులం బ్రవేశించి యుండునట్లగుటంజేసి దైవ నిభుండగుచు రా జెల్ల వారిచేతను మ్రొక్కుం గొనజాలుఁ , దద్రక్షణంబును నాచరించు; నొక్కని వశంబున లోకంబంతయు వర్తిల్లుటకు దేవ సంబంధ కలితం బయిన గుణంబు వెలిగా నొండు కారణంబు కలదే? యాకర్ణింపుము. | 216 |
| మ. |
హరిఫాలంబునఁ బుట్టి ధర్మమున కాలై యర్థమన్పుత్రకున్ సిరి కాంచెన్ దగ వారు మువ్వురును సుస్థేమోన్నతిన్ సంశ్రయిం తురు భూపాలకు నాతఁ డన్యజనతా తుల్యోద్భవుం డెట్లు ని ర్జర లోకార్హ సమగ్ర పుణ్య వితతి ప్రాప్తుండు గా కారయన్. |
217 |
| వ. | దివంబున నుండి దండనీతి నయించుటకు వచ్చి వాసుదేవ మహత్త్వ భావితుండైన మహానుభావుండు కావున వర్ణంబులు నాశ్రమంబులుం దదాచార ప్రవర్తనంబులైన; వేద పురాణేతిహాసంబులును రాజున కధీనంబులు తదీయ మాహాత్మ్యంబున నతనియందు సౌందర్య శౌర్య చాతుర్యాది గుణంబులు కలుగ జనంబులు తలంతురు; తదాజ్ఞకు లోనై వర్తింతు రిది రాజులు దేవసములైన తెఱంగు; మఱియు నడుగవలయు వాని నడుగు’ మనిన నయ్యాపగానందనునకుం బ్రణమిల్లి యప్పాండునందనుం డి ట్లనియె. | 218 |
| తే. |
‘అనఘ! నాలుగు వర్ణము లాశ్రమములు | నెన్ని కల? వెవ్విధంబుల నన్నిటికిని వర్తనమ్ములు? వేర్వేఱ వానిఁ దెలుపు | విశ్వ రాజధర్మములను విస్తరింపు. |
219 |