పురాణేతిహాసములు శ్రీమహాభారతము శాంతిపర్వము - తృతీయాశ్వాసము
రాజు పగఱయెడ నుండవలయు విధము (సం. 12-104-2)
వ. అనిన నప్పాండవోత్తముండు ‘పుడమిఱేఁడు పగఱయెడ నెట్టివాఁడు గావలయు?’ననవుడు నా భూపతితో భీష్ముండు ‘బృహస్పతి దివస్పతి కెఱింగించిన తెఱం గుపదేశించెద’ నని యి ట్లనియె. 19
చ. విను మరిఁ జంపనుం జెఱుప వేచుట లెస్స; ప్రతాప భాషణం
బున వెడ నుల్లికుట్టులను బొంకుల వానిఁ గలంగఁ జేసి రేఁ
చినఁ దన పూఁపు దప్పు నఱసేయని చందము నమ్మి యున్న చా
డ్పును మెఱయంగఁ బల్కుచుఁ గడున్‌ మది నమ్మకయుండఁ గాఁ దగున్‌.
20
చ. అరిపయి వీఁకనెత్తి చనునప్పుడుఁ దేనియ లుట్టు నట్లుగా
నరపతి వాని వారలు వినం బ్రియమాడుట మేలు; పక్షిఁ దాఁ
దిరముగఁ జేయఁగా మృగము తేఁకువ వాపను వేఁటకాఁడు త
త్స్వ రములు సూపికాదె తుదిఁ జంపఁ దెగుం దనబారిఁ బాఱినన్‌.
21
ఉ. వేమఱు శత్రునిం బరిభవించుట, రిత్తకు రిత్త వైరముం
దా మదిఁ బెట్టికోలు సుఖతంత్రము గాదు, సుసంధికాలమున్‌
సీమ దగంగ రూపడఁగఁ జేయుటయున్‌ వల; దగ్గమైన వాఁ
డేమెయి నైన వధ్యుఁ డను నిట్టి వినిశ్చయ మాత్మఁ గల్గుటన్‌.
22
క. కాల విపర్యయమున నర | పాలుఁడు దా మ్రొక్కియైనఁ బగతుఁ గలిసి త
చ్ఛీలమెఱిఁగి తఱియైనం | గాలునిపురి కనుచునది సుకరముగ వానిన్‌.
23
క. అనదతనంబును, బెడిదపుఁ | దనమును లేకుండఁ బరఁగి దరి యొత్తెడు నే
ఱునుబోలె నొత్తవలయును | మనుజేంద్రుఁడు మార్తురం గ్రమంబున నధిపా!
24
క. పెక్కండ్రతోడ నీరస | మొక్క తఱిన కొనక తఱిఁగి యున్న పగతుతో
నుక్కాడి బంధుభావముఁ | దక్కటి పగఱయెడ వలయుఁ దా నెఱపంగన్‌.
25
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )