పురాణేతిహాసములు శ్రీమహాభారతము శాంతిపర్వము - తృతీయాశ్వాసము
భీష్ముండు ధర్మజునకు సహాయ సంపన్నత్వం బావశ్యకం బగుట సెప్పుట (సం. 12-113-1,2)
వ. అనిన విని సంతోషించి కౌంతేయాగ్రజుం ‘డేమిభంగివర్తనంబున భూపాలుండు సుఖియై యుండు’ ననుటయు నన్నరపతికిం గురుపితామహుం డిట్లనియె. 82
సీ. ‘ఆలస్యమును నసహాయత్వమును నొప్ప; | వవిలేని పతి సుఖియై చరించు;
విను తొల్లి యొక యుష్ట్ర మనితరసాధ్య త | పంబు సేయఁగ మెచ్చి బ్రహ్మ వచ్చి
యర్థించినది ‘యేమి?’ యనిన నా లొట్టియ | యొప్ప ‘నా మెడ శతయోజన ప్ర
మాణం బగుట కోర్కి వాణీశ!’ నావుడు | న ట్లగుంగా కని యతఁడు సనియె;
 
తే. నదియు వరగర్వమున సహాయంబు నొల్ల | కలసభావంబుతో నుండి వలచియొక్క
నాఁడు దన యఱ్ఱుసాఁచి కాననములోన | దీను కొని మేయఁగాఁ బెనువాన వచ్చె.
83
క. వచ్చినఁ, దన మెడ సాఁగిన | యచ్చటి గుహలోన నుత్తమాంగం బిడి తా
నిచ్చమెయి నిదురపోవఁగ | విచ్చలవిడి నొక్క నక్క వెలఁదియుఁ దానున్‌.
84
వ. ఆ గుహ సొచ్చెం; జొచ్చి యాఁకటిపెల్లున నాలుందానును నొక్కట నాలొట్టేనుఁగు కుత్తుక కబళించి నెత్తురు గండలు నొండొండ మ్రింగందొడంగిన, నదిమేలుకని ఆ లొట్టియ మెడ పొరల్చునంతకు నా నక్కలు నరంబులు ద్రెవ్వం గఱచిన, నెఱి దప్పి యయ్యుష్ట్రంబు నిర్గత ప్రాణం బయ్యె; నట్టి చందంబు గాక నీ వనాలస్యుండవును సహాయ సంపన్నుండవును నై నెగడు’ మనిన నజ్జగతీశుం డతనితో ‘శత్రుం డధికుం డైన నల్పబలుం డగు రా జేయోజ నాపద నిస్తరించు?’ ననవుడు నతండు ‘సముద్ర సరిత్సంవాదం బాకర్ణింపుము; దాన నీ యడిగిన యర్థంబు దేటపడియెడు’ నని పలికి యిట్లనియె. 85
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )