పురాణేతిహాసములు శ్రీమహాభారతము శాంతిపర్వము - తృతీయాశ్వాసము
వ్యాఘ్రగోమాయు సంవాదము (సం. 12-112-2)
క. ‘సౌమ్యు లసౌమ్యుల భంగి న | సౌమ్యులు సౌమ్యుల విధమున జనవర! చిత్తా
గమ్యతఁ దోఁతురు; వారిని | సమ్యఙఙ్నిశ్చయతఁ గాంచు చందము సెపుమా!
52
వ. అనుటయు నాపగాతనయుం ‘డేతత్ప్రయోజనం బైన వ్యాఘ్రగోమాయు సంవాదం బను నితిహాసంబు గల; దాకర్ణింపు’మని యిట్లనియె. 53
ఆ. ‘పురిక యనఁగఁ నెగడు పురిఁ బౌరికుం డను | నృపతి క్రూరకర్మనిష్ఠఁ బరఁగు;
నవ్విభుండు సచ్చి యధిప! గోమాయువై | పుట్టెఁ బుట్టెఱుంగు బుద్ధితోడ.
54
వ. ఇబ్భంగిం బుట్టిన యా నక్క మహితవ్రతశీలం బయి మాంసంబు దినక, హింస సేయక వనంబునం బతిత ఫలంబులుఁ బత్త్రంబులు నాహారంబులుగా వర్తించుచుండఁ, దోడి నక్క ‘లిది యేటి వ్రతంబు? మాంసం బేము దెచ్చియిచ్చెద; ముపయోగించి సుఖివై యుండు’ మని ప్రార్థించిన, నమ్మెయికిం జొరక దృఢనిశ్చయంబై యుండె; నంత నొక్కనాఁడు మృగంబుల కెల్ల ముఖ్యంబైన శార్దూలం బత్తెఱం గెఱింగి వచ్చి యగ్గోమాయువుతో నిట్లనియె. 55
క. ‘నిను సౌమ్యుఁడ వని యెఱిఁగితి; | ననఘా! ననుఁ జెంది నిలిచి యతుల సుఖము లం
దిన మేలు; నన్నుఁ గ్రూరుం | డను లోకం; బిదియు నుడుప నగు నీశిక్షన్‌.
56
వ. నా తోడి బాంధవంబు సేయు’మనిన నగ్గోమాయు విట్లనియె. 57
క. ‘నీ వాశ్రయణీయుండవు | గావే! విను భోగపరము గా కున్నది మ
ద్భావం బటు గావున నా | కీ వచనము లింపు సేయ విద్ధగుణాఢ్యా!
58
వ. అది యట్లుండె; భోగంబులు గాకున్న నేమి? నీకుం గార్యాకార్యంబులు నా యెఱింగిన తెఱంగున నుపదేశించుచు మైత్రి వాటించియునికి గర్హణీయంబై భవదీయ మూలభృత్యు లసూయ సేసి భేదింతురు; దాన నొప్పమి వచ్చు; నీవు వారలు గలంచినఁ గలంగ కుండుటకును నా బుద్ధి పాటించుటకును సమయంబు సేసి నన్ను మన్నించికొని యుండు; మట్లైన నీకడ వర్తించియుండెద’ ననుటయు నావ్యాఘ్రం బా భంగి నడపంగల యది యై యియ్యకొని. 59
ఆ. సంతసంబుతోడ సమయంబు సేసిన | నెలమిఁబొంది నక్క పులికి బుద్ధి
సెప్పికొనుచుఁ దగ వసించెఁ దదీయ ని | కేతనమునఁ బులియుఁ బ్రీతి సలిపె.
60
వ. కొండొక కాలంబునకు నమ్మృ గరాజు మన్నించు విధంబును, నగ్గోమాయువు దదీయ హితాహితంబు లరసి బుద్ధి సాచివ్యంబు సేయు తెఱంగును జూచి చూపోపక యప్పులి మూలభృత్యులు దమలోనం గూడికొని యొక్కనాఁడు. 61
క. ‘పులి నమలెడు మాంసము వెర | వలవడఁ దా మపహరించి యా నక్కకు ని
మ్ముల నిల్వం గావించిన | నిలయంబున గొందిఁ బెట్టి నేర్పారంగన్‌.
62
వ. ఉన్నంత భక్ష్యపదార్థ పరిరక్షణంబును దానచేయునది గావున నగ్గోమాయు వప్పనికిం జొచ్చి మాంసంబుగానక యెవ్వరేని మ్రుచ్చిలి కొనుటగా నెఱింగినదియై శార్దూలంబున కెఱింగించిన నామ్రుచ్చిమి యప్పులి యరయం దొడంగిన నెప్పటి కపటభృత్యులు గపటోపాయంబు పన్ని. 63
క. నెమకు పరివార మమ్మాం | సము గను తెఱఁగును ఘటింప శార్దూలము చి
త్తము నక్కవలన విరస | త్వమునొందిన నెఱిఁగి భృత్యతతి యిట్లనియెన్‌.
64
ఆ. ‘నక్క కేటి వ్రతము? స్రుక్కక యిమ్మాంస | మపహరించినపుడ యబ్బె నేని
నేమి యైనఁ జేయు నిది పాపశీలంబు | గపట ధర్మకంచుకంబు సువ్వె!
65
క. తా నటె మాంసముఁ దినదటె! | యీ నక్కయు బేలుపెట్టె నిన్నాళ్ళును నీ
యాన మఱుమాట వలుకం | గా నోడితి మిదియ నడపఁ గార్యములయెడన్‌.’
66
క. అనుటయు మృగపతి మనమునఁ | గన లడరిన నక్కఁ బట్టఁగాఁ బంచి వధిం
పను బుచ్చె; దాని నంతయు | విని యప్పులితల్లి గరము వెసఁ జనుదెంచెన్‌.
67
వ. చనుదెంచి యా వ్యాఘ్రవరునితో నిట్లనియె. 68
క. ఇట్టివి కృత్రిమములు గల | వట్టిదె యానక్క? బేల వైతివి భృత్యుల్‌
పుట్టినకోలెను గుటిలత | లె ట్టెట్టివి సేయ? రకట! యెఱుక గలఁగెనే?
69
తే. బుద్ధిమంతునివలన దుర్బుద్ధు లధికు | వలన హీనులు రూపసివలనఁ గొనటి
వా రసూయలు సేయుదు రీరసమున | నింత యెఱుఁగంగవలవదే? యీవు గొడుక!
70
క. ధర్మ మధర్మము భంగి న | ధర్మము ధర్మంబు మాడ్కిఁ దనయా! తోఁచున్‌
నిర్మలమతి నరయవలయు | ధార్మికతన కోరువాఁడు తన కేర్పడఁగన్‌.
71
క. విను మీగోమాయువు వ | చ్చిన యంతటనుండి మనకుఁ జేసిన హితముల్‌
గనికొన వలవదె? యీతర | మున వాఁ డిటు సేయఁ డను సమూహయు వలదే?
72
క. హితుఁ డగు మంత్రిం గుటిలుల | యతి కపటోపాయములకు నగపడి చెఱుపన్‌
మతిఁ దలఁతురె? పతి సుపరీ | క్షితంబు గావింప కొకటి సేయం దగునే?’
73
చ. అనవుడు నక్క రాఁబనిచి యప్పులి గౌఁగిటఁ జేర్చి బాష్పము
ల్గనుఁగవఁ గ్రమ్మనుం బలుకులం దగఁ బెద్దయు గారవించిన
‘న్వినుము మృగేంద్ర! మున్నటుల నీవు సభన్‌ నను వీఁడు మంచివాఁ
డని కొనియాడి యిప్డు దెగటార్చితి పెంపును నాదు మానమున్‌.’
74
వ. అని పలికి యగ్గోమాయువు వెండియు. 75
క. ‘నను నీవు పదస్థునిఁగా | ననఘా! చేయంగఁ దలఁచినప్పుడ నీ భృ
త్యనికాయము కఱపులఁ బడ | కునికియు నా బుద్ధి వినుటయును మఱవమికిన్‌.
76
వ. బాస సేయవే యట్లుంగాక. 77
ఆ. ఎఱిఁగి యైన నెఱుఁగ కేనియు నొక్కని | భంగపెట్టి పిదప సంగతుఁడుగఁ
జేసికొనుట మేలె సిరిగలవారికి? | నట్టి నిలుపువాని కగునె హితము?’
78
క. అని పాసి యరణ్యమునకుఁ | జని యనశన దీక్ష నొంది సద్భావ ఖ్యా
తి నెఱయఁ బరమస్థానం | బున కగ్గోమాయు వరిగెఁ బురుషవరేణ్యా!
79
వ. ఈ కథ పూర్వాపరవాక్యంబుల యందలి తాత్పర్యంబు నిరూపించి. 80
క. వావిరి మాటలఁ దేలక | భావంబునఁ గీడు మేలుఁ బరికించి యస
ద్భావుని సద్భావుని నవ | నీవర! యేర్పఱుప నెఱుఁగ నేరఁగ వలయున్‌.’
81
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )