పురాణేతిహాసములు శ్రీమహాభారతము శాంతిపర్వము - తృతీయాశ్వాసము
కుర్కుర నీచత్వముం దెలుపునట్టి యితిహాసము (సం. 12-117-2)
సీ. ‘విను మొక్క యితిహాస మనుపమం బగు తపం | బునఁ బేర్చువాఁ డొక్కమునివరేణ్యు
నాశ్రమంబునఁ దద్దయావిశేషంబున | నఖిల జంతువులును నచట నచట
వసియించి సుఖముండు; వానిలో నొక్క కు | ర్కుర మెప్డు భక్తిమైఁ గొలిచి తిరుగు;
నమ్ముని మెలఁగినయచట నెల్లను | దాను వర్తింప నొక దువ్వు వైరమెత్తి
 
తే. కఱవ వచ్చిన నమ్మునికడకుఁ బాఱు | తెంచె నా కుక్క నాతఁడు దీప్త రూప
మైన దువ్వుఁ గాఁ జేసిన నది గడంగి | కవియ భయమంది పాఱె మున్కవియు దువ్వు.
92
సీ. అట్లు బెబ్బులి వచ్చి యడరిన బెబ్బులిఁ | గాఁ జేసి గెలిపించెఁ గరుణ మెఱయ,
నొక మత్తకరిఁ జూచి యోటమై నొదిఁగిన | నుద్ధతకరిఁ జేసి యొసఁగె జయము
సింహంబు దెస భీతిఁజెడి పాఱుతెంచిన | ఘనసింహముగఁ జేసి గర్వమిచ్చె,
శరభంబు ధాటికిఁ జకితమైన నుదగ్ర | శరభంబుఁ జేసి యుత్సాహిఁ జేసె
 
తే. నిట్లు దివసక్రమంబున నెక్కుడైన | సత్త్వముగఁ జేయఁగాఁ గుక్క శరభభావ
మండితంబయి తిరుగుచునుండి పూర్వ | వాసనా నీచమగు మనోవర్తనమున.
93
వ. ఇట్లని విచారించె. 94
చ. ‘ననుఁ గని యొండు సత్త్వము మనంబున బెగ్గిలి పాఱునప్పు డి
మ్మునివరుఁ డిట్ల పోలెఁ గృప మొక్కలమై శరభంబుఁ గాఁగఁ జే
యునొ తగ దాని నట్లయిన నుద్ధతి నాకుఁ జరింప లేదు గా
వున నితనిన్‌ వధింతు వెరవున్‌ బలమున్‌ సరి నుల్లసిల్లఁగన్‌.’
95
తే. అను విచారంబు దివ్యబోధాఢ్యుఁ డైన | యమ్మునీశ్వరుఁ డెఱిఁగి ‘యీ యధమజాతి
యున్నత స్థితి యెఱుఁగునే? మున్నపోలెఁ | గుక్క యయి యుండుఁ గా!’ కన్నఁ గుక్క యయ్యె.
96
వ. కావునం గులహీనులు మాననీయులు గా; రట్లుం గాక విశేషం బాకర్ణింపుము. 97
చ. కుల మని పట్టి చిత్తమునఁ గూరిన కీ డరయంగ లేక య
గ్గలపు విభూతి దుష్టునకుఁ గల్గఁగఁ జేయుట గర్జ మెట్లు భృ
త్యుల మదియున్న రూ పరసి యుత్తమ మధ్యమ హీనరూప మా
త్రలకుఁ దగంగ నయ్యయి పదంబుల నిల్పుట నీతి భర్తకున్‌.
98
క. శౌర్యము సత్యంబును స | త్కార్య జ్ఞానమును భక్తి తాత్పర్యము గాం
భీర్యముఁ గలిగినఁ గురుకుల | వర్య! కులం బేల? సిరికి వాఁ డుక్తుఁ డగున్‌.
99
క. ఇది సిద్ధాంతం బనరా | దుదితయశా! యెట్టులైన నున్నత వంశ్యున్‌
విదితగుణుం డగు పురుషు | న్వెదకి నిలుప వలయు మాననీయపదమునన్‌.
100
వ. అది యెట్లంటేని. 101
ఉ. ఒక్కటి యేను జెప్పెద మహోగ్రపుఁగేసరి కైనఁ దోడుగా
నుక్కును లావునుం గలుగు నుజ్జ్వల సత్త్వచయంబుఁ గొన్నఁ గా
కెక్కుడు కృత్యముల్‌ నడప నెట్లగు నిట్టివి సాలు నంచుఁ దాఁ
గుక్కలఁ గూర్చి చేయఁ దనకుం దలఁపుల్‌ దలకూడ నేర్చునే?
102
చ. వలనుఁ గులంబు లేని పరివారము గోటియు నేల? నేర్పు న
గ్గలికయు భక్తి పెంపు మదిఁ గల్గి సుహృజ్జన మిశ్రమౌ బలం
బిలువడి గల్గెనేని నిల యెల్లను నేలఁగఁ జాలు వేయు ర
జ్జులు విను రాజు నేర్పరియు శూరుఁడుఁ గావలయుంజుమీ నృపా!’
103
వ. అని చెప్పి వెండియు. 104
సీ. ‘వినుము మయూరంబు విధమున బహు చిత్ర | భంగులఁ బ్రజ యంతరంగ మాత్మ
వశము సేయుచు, మృదువాక్యముల్‌ వలుకుచు | మంత్రంబునెడఁ దనమాట వెడల
కునికి శరత్సమయోచిత క్రియ చాడ్పు | గాఁగ ధర్మంబు శిఖా ప్రకార
మొంది తనర్ప, సముల్లాస పక్షమై | యానంబు గైకొంచు నధిక తర స
 
తే. మున్నతత్వంబు సంశ్రయ యోగ్య మగుటఁ | గాంచుచును దఱివచ్చినఁ గారు కాల
మేఁచు తెఱఁగున నేచుచు నీచ కుటిల | గతులఁ దునుముచు నెగడుట పతికి నీతి.
105
క. కిరణముల భంగిఁ జతురపుఁ | బరిజనముల నెందుఁ జొనిపి పరకృత్యంబుల్‌
నిరతంబును గనుఁగొనుచును | దరణి కరణి వెలుఁగు టొప్పు ధరణీశునకున్‌.
106
తే. అలుక గూరిమి ఫలదంబు లగుచునుండఁ | గృత్యములఁ దా నెఱుంగుచు నిత్యవిధుల
నాయములును వ్యయంబులు నరసి కోశ | సంపదలు గాంచి యునికి రాజన్యు గుణము.’
107
వ. అనిన విని యుధిష్ఠిరుండు ‘రాజులకు దండంబు సర్వసాధారణంబు; తదీయ స్వరూపంబు వినవలతుం జెప్పు’ మనిన న న్నరదేవునకు దేవవ్రతుం డిట్లనియె. 108
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )