పురాణేతిహాసములు శ్రీమహాభారతము శాంతిపర్వము - తృతీయాశ్వాసము
భీష్ముఁడు ధర్మరాజునకు సుమిత్రుఁడను రాజు చరిత్రంబు సెప్పుట (సం. 12-125-8)
సీ. ‘హైహయుండు సుమిత్రుఁ డనురాజు వేఁట వో | యిన చోటఁ దనచేత నేటు వడిన
మృగ మమ్ముతోఁ బాఱఁ దగిలె వెన్వెంటన; | యదియును నొకమరి యగ్గ మయ్యు
నొకమరి దవ్వయ్యు నొకమరి దృష్టి క | గోచరం బయ్యును ఖురపదంబు
లరసి పాఱిన నింతనంతఁ దోఁచియు నాశఁ | బెనుచుచుఁ జని మహావనము సొచ్చె;
 
ఆ. నవ్విభుండు డస్సి యచ్చట నొక ముని | పల్లె కేఁగి మునులు ఫలజలములఁ
దృప్తుఁ జేయ డప్పిదేఱి యున్నెడ ఋష | భాఖ్యుఁ డైన తపసి యతనితోడ.
151
క. వనమున నెక్కటి నీ ‘వే | పనికై చనుదెంచి? తేల పరమవిషాదం
బునఁ బొందెఁ దనిన నాతం | డను నొక మృగ మమ్ముతోడ నరుగఁగ వెనుకన్‌.
152
క. ఆసాసల వచ్చితి; నను | గాసింబెట్టి యది యడవిఁ గలసెను; మృగయా
వ్యాసక్తుఁడు వగచుం దన | యేసిన మృగ మనఘ! తప్పియేఁగుటకుఁ గడున్‌.
153
వ. ఆశ యింత దుర్నివార యగునే?’ యనిన నమ్మునిపతి యమ్మనుజపతి కిట్లనియె. 154
క. ‘విను తీర్థయాత్ర సని యే | ననుత్తమం బైన బదరికాశ్రమమున నొ
క్కనిఁ గాంచితిఁ గృశగాత్రునిఁ | దనుఁ డను పేరింటివానిఁ దాపసవర్యున్‌.
155
క. కని భక్తిం బ్రణమిల్లుడు | ముని యాతిథ్యం బొనర్ప మోదంబున నా
తని పాల ధర్మఫణితులు | వినుచుండఁగ నొక్కధరణివిభుఁ డేతెంచెన్‌.
156
వ. విషాదవివర్ణుం డగుచు సపరివారంబును సదారంబునుగాఁ జనుదెంచి యజ్జనపతి మునిపతిం గాంచిన నతం డతిథిపూజా సత్కారంబులు సేసి యాగమనకారణం బడిగిన నన్నరనాథుండు. 157
చ. తనయుఁ డొకండ; వాఁడు గుణధాముఁడు; క్రీడనవాంఛ సాంద్రకా
ననమున కేఁగి కాడుపడినం దడవం జనుదెంచి యెందుఁ గా
నను మది యాశ ద్రిప్పికొనినన్‌ వెగడందుచు వచ్చినాఁడ’ న
న్న, నతఁడు వల్కకుండె వదనం బొకయించుక వాంచి చింతతోన్‌.
158
క. చింతించు నతనితో భూ | కాంతుం డిట్లనియె మఱియు ‘గాఢతరాశా
క్రాంతత దుర్లభఫల యగు | టింత యసహ్య మగునయ్య యెడఁద మునీంద్రా!
159
వ. అనుటయు నత్తాపసోత్తముం డమ్మహీపతి యాననం బాలోకించి. 160
క. ‘ఏ నరుఁడు మానసము ధృతి | నూన నుచితవృత్తి నుండు నుదిలగొనక యెం
దైనను నెయ్యది యేనియు | వానికి దుర్లభములేదు వసుధాధీశా!
161
క. అర్థాదులగు ఫలంబులు | ప్రార్థించినచోట సిగ్గువఱుపక తగ న
య్యర్థి సులభార్థుఁజేయు కృ | తార్థుఁడు దుర్లభుఁడు దలఁప నఖిల జగములన్‌.
162
వ. అని పలికి పూర్వాచార స్మారకత్వంబున నిట్లనియె. 163
క. ‘వినుము గుణవంతుఁ డొకరుఁడు | ధనవంతుం డైన యొక్క ధరణీనాథుం
దన కూడు సీరకై కాం | చన మడిగి తదీయ బాలిశత్వము పేర్మిన్‌.
164
క. విహతాశుండై లజ్జా | మహితం బగు నాశ దొఱఁగు మదితో సకల
స్పృహయును నెవ్వనియందును | వహింప నని యతులమైన వ్రతముం బూనెన్‌.’
165
వ. అని చెప్పి యప్పార్థివుం దొల్లి తాను ధన మర్థించి యఫలితప్రయత్నుండై తత్కాలజనిత వైరాగ్యంబునం దపస్వి యగుట తేటపఱిచి వెండియు. 166
చ. ఒడఁబడి యీనివానియెడ నుల్లమునందుఁ గృతఘ్నతం గడుం
జెడుగగు దుర్వినీతునెడఁ జిత్తము కోర్కికిఁ బట్టు సేసి లే
వడి యగు నీచకాంతయెడ వారక యాసలు సాఁగు నిట్లు పె
క్కెడలను బాఱు నాసగమియెల్లఁ దొఱంగుము సౌఖ్య మొందెడున్‌.’
167
వ. అని యాసపజ్జం బోవమి సుఖకరం బగుటం దెలిపి, యవ్వీరద్యుమ్నునకుం గరుణించి, యతని కొడుకు భూరిద్యుమ్నుం దన తపోమహిమ నాకర్షించి వీడుకొలిపె’ నని చెప్పి ఋషభుండు సుమిత్రుని చిత్తంబు మృగయాశాయత్తంబు గాకుండునట్లుగా బోధించెఁ; బాండవాగ్రజా! నీవును నివ్వాక్యంబు లాదరించి సుస్థిరుండవై నిరాశత్వంబున సంతాపంబు దక్కి సుఖివి గ’మ్మని పలికిన భీష్మునితో నబ్భూపతి భవదీయ వచనామృతాస్వాదనంబున మనంబు దృప్తి సన; దింకను ధర్మప్రకారంబులు వివరింపు’ మనిన నతం డతని కిట్లనియె. 168
క. ‘తన భూమిఁ బరుల భూమిని | ధనము లుపార్జింపవలయు ధరణీశునకున్‌
ధనములు మూలము రాజ్యం | బునకును మూలమగు ధర్మమునకు నరేంద్రా!
169
క. అది బెట్టిదంపు వెరవున | మృదుభూతో పాయమునను మెయికొనద ప్రజం
బొదువ వలయు నాజ్ఞా సం | పద గల సాకతముతోడఁ బతి యవహితుడై.
170
క. విను బండారము పెరుఁగని | జనపతికి బలంబు మిత్రసంపదయును గ
ల్గునె? బలమిత్రవిహీనున | కొనరునె రాజ్యంబు విభవ మున్నత మగునే?
171
ఉ. కావున నర్థ సంపదలు గల్మియ యింతకు మూలమైన ను
ర్వీవరుఁ డాత్మశక్తి కతిరిక్తము లైన సముద్యమంబులం
దా వెలయం దలంచి సముదగ్రతఁ గైకొను టొప్ప; దవ్విధం
బావిభు తొంటి కల్మికిని హాని యొనర్చు, హరించుఁ బ్రాణముల్‌.
172
క. తన కొలఁది నుపాయంబులు | వొనరిచి ధనవంతుఁ డగుట భూపగుణము ని
ర్ధనుని నిజ ప్రజయును గై | కొనదు విరోధులును సరకుగొనరు కుమారా!
173
క. తెరవాటున మ్రుచ్చిమి ను | ద్ధురు లగు క్రూరులకు మూఁక దోరంబగు న
న్వెరవరిదొరల బలంబుగ | ధరణీశుఁడు గూర్చుకొనుట దైన్యము దెచ్చున్‌.
174
క. అన్యాయంబునఁ బొదలిన | సైన్యముచే సమర జయము సమకూర; దనూ
నన్యాయ పరులు గాంతురు | మాన్యత్వము దస్యులైన మనుజాధీశా!
175
వ. ఇ ట్లగుటకు నుదాహరణం బగు నొక్క యితిహాసంబు గల; దాకర్ణింపుము. 176
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )