పురాణేతిహాసములు శ్రీమహాభారతము శాంతిపర్వము - తృతీయాశ్వాసము
భీష్ముఁడు ధర్మరాజునకు ధర్మార్థకామంబుల తెఱం గెఱింగించుట (సం. 12-123-3)
వ. అనిన విని ధర్మనందనుండు ‘ధర్మార్థ కామంబుల నడవడి యె ట్లయిన మేలై చెల్లు?’ నని యడిగిన, భీష్ముం డిట్లనుఁ ‘దొల్లి యాంగరిష్ఠుం డను నరవరుండు కామందక నాముండైన ముని నిట్లని యడుగ నతం డతనికిఁ జెప్పిన భంగిం జెప్పెద నాకర్ణింపుము. 123
చ. అనయముఁ బేర్చు కామమున నర్థము ధర్మముఁ గ్రాఁగుఁ గామతం
త్ర నిరతుఁ డైనవాఁడు సుపథప్రతిపన్నుఁడు గాఁడు దుష్టదం
డన మొనరింపఁ డట్టిపతి డాయరు సాధులు నార్యులున్‌ సుహృ
జ్జనులును; దానఁ జేటు నగుఁ, జావును బాటిలు నెల్ల భంగులన్‌.
124
ఉ. కావున ధర్మసిద్ధికి ముఖంబగు నర్థమునందు నిష్ఠమై
నేవిధినైన ధర్మరతి యెక్కుడుగా మదిఁ జొన్పుటొప్పుఁ గా
మావిలబుద్ధి గాక యుచితాగత సౌఖ్యము లాచరించుచున్‌
భూవిభుఁ డెప్డు భూమిసతిఁ బొంది రమింప మహోన్నతుం డగున్‌.’
125
క. అన విని ధర్మతనూజుఁడు | ‘జనమ్ము శీలమ్ము నధిక సంస్తుత్యముగాఁ
గొనియాడుఁ; దత్స్వ రూపం | బనఘా! వివరింపవే దయారతి నాకున్‌?’
126
వ. అనుటయు నాపగాతనయుండు విను మని యతని కిట్లనియె. 127
క. ‘ము న్నింద్రప్రస్థంబున | నున్నతి మెయి ననుజ తనుజయుక్తంబుగ నీ
వున్న తెఱఁగు దుర్యోధను | కన్నులు గమరింప నతఁడు గడు వగ నొందెన్‌.
128
వ. భవదీయ సభ యొప్పునకును రాజసూయంబు చెల్లిన యుల్లాసంబునకును న ట్లసహ్యపడి ధృతరాష్ట్రునితో భవద్గృహంబున నిచ్చలుం బదివేవురు భూసురులు పసిండి పళ్ళెరంబులం బాయసాహారంబులు గొనుట మొదలుగాఁగ లక్ష్మి పెం పుగ్గడించి తనవగపు దోఁపంబలికిన నతం డతని కిట్లను ‘మధురాన్నపాన మణిభూషణ వరవాహనాదులం జేసి యుజ్జ్వలంబై యున్నది గాక నీ యైశ్వర్యం బసదే? పాండవాగ్రజుం డెక్కుడు మెఱసి యునికియుం గలదు; వినుము చెప్పెద. 129
ఆ. శీలవంతులైన సిరిఁ బొందుదురు ధర్మ | తనయునింటి సిరికి నెన యనంగ
నెక్కు డనఁగ లక్ష్మి యెసకం బెసఁగ నీవు | శీల మలవరింపు చిత్తమునను.
130
వ. మాంధాతృండు, నాభాగుండు మొదలయిన మేదినీపతులు శీలంబునం గాదె యీ లోకంబునం బెంపువడసి; రివ్విషయంబునకు నొక్క యితిహాసంబు గల; దాకర్ణింపుము. 131
క. దనుజవిభుఁడు ప్రహ్లాదుం | డనిమిష పతి రాజ్యలక్ష్మి యతులిత శీలం
బునఁ గొని త్రైలోక్యంబును | దనకు వశగతంబు సేసె ధర్మం బలరన్‌.
132
క. దానికి రోసి బృహస్పతి | తో నమరేంద్రుండు మేలు దొరకొను విధమె
ట్లో నావుడు భార్గవునిం | గానఁగఁజను మతఁడు సెప్పుఁ గరుణాన్వితుఁడై.
133
క. అని గురుఁడు పంప నింద్రుఁడు | సని భార్గవుఁ గాంచి ‘మేలు సమకూరు తెఱం
గనఘా! యుపదేశింపవె’ | యనినం ‘బ్రహ్లాదుఁ జెందు; మతఁ డెఱిఁగించున్‌.
134
ఆ. అతని నాశ్రయించి యవ్వెర విప్పించి | కొనిన మేలు వొందు’ ననియె భార్గ
వుండు వజ్రి బ్రాహ్మణుం డయి ప్రహ్లాదుఁ | జేరి శిష్యవిధులు సేయుచుండె.
135
వ. అంత నద్దానవేంద్రుండు ప్రసన్నుండై భూసురాకృతి యయిన సురపతితో సంభాషించిన నతండు ‘నీకుఁ ద్రైలోక్యరాజ్యంబు సంప్రాప్తం బైన కారణం బేమి? యెఱింగింపవే!’ యనుటయు. 136
ఆ. దనుజనాథుఁ డిట్టులను ‘రాజ నను గర్వ | మున ధరామరులకు మనసు గందఁ
జేయ నెపుడు నే నసూయాదు లమ్మహా | త్ములకు ధనము లిత్తు నెలమితోడ.
137
వ. వారలు మెచ్చునట్టి శీలంబునం బ్రవర్తిల్లుదు; దానంజేసి మహోన్నతుండ నైతి. 138
క. అనవుడు ‘నీ శీలము నా | కనఘా! దయ నొసఁగవే! మహాత్ములఁ దగఁ జెం
దినవారు బ్రదుకవలదే?’| యని దీనత దోఁప ననిమిషాధిపుఁ డడిగెన్‌.
139
క. విని ప్రహ్లాదుఁడు గృప దన | మనమునఁ గదురంగ విప్రమాత్రుఁడు గాఁ డీ
తని భంగిఁ జూడ నను వెఱ | పును బుట్టఁగ నిచ్చె శీలముం బెం పెసఁగన్‌.
140
తే. పడసి యింద్రుండు శీలసంపన్నుఁ డగుచుఁ | జనియెఁ; దదనంతరంబ యద్దనుజవరుని
తనువునందుండి తేజిష్ఠ తనువిలాసుఁ | డైన పురుషుండు వెడలిన నతఁడు సూచి.
141
వ. ‘నీ వెవ్వండ?’ వన నప్పురుషుం ‘డేను శీలంబ; నీ విచ్చిన యవ్విప్రుపాల వసియింపం జనియెద’నని చెప్పి పోయెం; దదనంతరంబ క్రమంబునం దేజోమయ రూపంబులు నిజదేహంబున నుండి నిర్గమింప నద్దానవేశ్వరుం డడుగుచు. 142
క. ఉత్తమ ధర్మము సత్యము | వృత్తంబు బలంబు నగుట వినఁబడి బడిఁ ద
చ్చిత్తము విషాద మంద మ | హత్తర మూర్తి యొక వారిజానన వెడలెన్‌.
143
క. వెడలిన ‘నీ వెవ్వత?’ వని | యడిగిన నాతనికి నిట్టులను దీనత న
ప్పడఁతి ‘సిరి నేను; బలమె | క్కడకు నరుగు నందుఁ బోవఁ గడఁగి వెడలితిన్‌.’
144
చ. అనిన భయంబు నొంది యతఁ డా సతితోఁ బరమేశ్వరీ! మహా
వినయమతిన్‌ ననుం గొలిచె విప్రవరుం; డతఁ డెవ్వఁ?’ డన్న న
వ్వనిత ‘సురాధినాథుఁడు భవద్ఘన రాజ్యవిభూతి యింతయుం
గొనుటకు నిన్నుఁ జెందె; నిటు గోల్పడి తీవును నీదు శీలమున్‌.
145
వ. వినుము చెప్పెద ‘శీలంబున ధర్మంబు వెలయు; ధర్మంబున సత్యంబు దొరకొను; సత్యంబున వృత్తంబు సొప్పడు; వృత్తంబున బలంబు వాటిల్లు; బలంబున నేను గలుగుదుం; గావున సమస్తంబునకు మూలంబు శీలం’బని చెప్పి, సిరి పురందరుపాలికి ధర్మాదులతోడఁ గూడంజనియె’ ననుటయు దుర్యోధనుండు ‘శీలం బెట్టి?’ దనిన ధృతరాష్ట్రుం డతని కిట్లనియె. 146
క. ‘ఒలసి మనోవాక్కాయం | బుల ద్రోహాభావ మఖిల భూతముల యెడం
గలిమి విను శీల; మది మే | లొలయించును దాన నుల్ల మూన్పుము పుత్రా!
147
క. పరహితము సిగ్గుపాటుం | బొరయక యుండంగ నెదిరి బోధించుటయున్‌
నరసముదయంబు వొగడెడు | చరితము శీలమున కంగసంపద వత్సా!’
148
క. అనియె నని చెప్పి భీష్ముం | డను ధర్మజుతోడ ‘నీకు నది నైజమ యే
నును బోధించితి శీలము | మనమ్మునం దిరము సేయు మనుజాధీశా!’
149
వ. అనిన విని యజ్జనపతి భీష్మునితో ‘నాశ యనునది యనంతయైయుండు నది నిరర్థకయైన నయ్యెడు దుఃఖం బధికం బది దుర్యోధనుం బేర్చి కలిసి యుండం జూచితి; నమ్మహాత్ముండు దేఱక మదీయాశఁ గుంఠితంబుఁ జేసి నన్ను దుర్బుద్ధిం గావించె; నది విషాదంబు సేయు; నాశ నడంచుట యరిదిగదే!’ యనుటయు ‘నాశాదోషనిరాసకం బైన యొక్క యితిహాసంబు గలదు; విను’మని య క్కురుసత్తముం డిట్లనియె. 150
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )