పురాణేతిహాసములు శ్రీమహాభారతము శాంతిపర్వము - తృతీయాశ్వాసము
వసుహోముఁడు మాంధాతృనకుఁ జెప్పిన దండోత్పత్తి ప్రకారము (సం. 12-122-1)
వ. దండంబు సాక్షాద్దేవుం; డట్లగుటఁ దెలిపెడునది యొక్క యితిహాసంబు గల; దంగదేశాధీశుండు వసుహోముం డను రాజు హిమశైలంబున ముంజపృష్ఠం బనం బ్రసిద్ధం బగు శృంగంబునకు దేవీ సహితంబుగాఁ జని యందు వసియించి మునిగణ పూజితంబగు వృత్తంబున నుదాత్తుండయి యుండ నమ్మహీపతి కడకు మాంధాతృండు సనుదెంచి సవినయంబుగాఁ బ్రణమిల్లిన, నబ్భూవల్లభునకు నతం డర్ఘ్య పాద్యాదులగు నుపచారంబు లాచరించి, ‘వచ్చిన పని యేమి?’ యని యడిగిన నప్పుడమిఱేఁడు ‘సవిస్తరంబుగా దండ ప్రకారంబు వినుటకై నిన్నాశ్రయింప వచ్చితి’ ననవుడు నమ్మహాత్ముం డతని కిట్లనియె. 115
సీ. ‘అజుఁ డధ్వరంబు సేయంగఁ దలంచి ఋ | త్విజు నాత్మసదృశుని వెదకి యెందుఁ
గానక, తా నొక్క గర్భంబు ధరియించి | వేయేండ్లకును దుమ్మి వెలువరించె;
క్షుతసంభవతఁ జేసి క్షుతుఁడను పేరిట | బరఁగెడు నా ప్రజాపతియు ఋత్వి
జుండుగఁ గ్రతు వొనర్చుచునుండ నంతర్హి | తం బయ్యె వలచు చందమున నడచు
 
ఆ. నట్టి దగుట దండ మధిప కార్యాకార్య | తంత్ర భేద మెడలె దానఁజేసి
మహి గలంగెఁ గడు నమర్యాద వర్తించెఁ; | గమలజుండు విష్ణు కడకుఁ జనియె.
116
క. చని సంప్రార్థించి, యతని | గొని రుద్రునిఁ గాంచి ‘నీ సఖుం డీతఁడు వ
చ్చిన కార్యము గృపతోడను | విను’మని దండంబు తెఱఁగు వినిపించెఁ దగన్‌.
117
వ. అట్లు లోకరక్షకుం డగు పుండరీకాక్షు దండగొని దండాభావంబున జగంబు గలంగు టెఱింగించిన, నవ్విరించి పలుకులు మనస్కరించి మహాదేవుండు నిజప్రభావంబు దండంబుగాఁ గల్పించి దండనీతి కాశ్రయుండై పరఁగుచుండె. 118
సీ. వినుము; ఋగ్వేదాది వేదముల్‌ నాలుగుఁ, | గల్పాదులైన యంగంబు లాఱు,
బెరసి విద్యలు పది పేర్చు; పురాణంబు | లనియును నొక విద్య యధిప! ధర్మ
విదులు సెప్పెడు శాస్త్ర వితతియంతయు నొక | విద్య; సర్వన్యాయ విస్తరంబు
నొకటి, మీమాంస దానొక్కటి; యిట్టులు | వివరింపఁ బదునాల్గు విద్య లయ్యె
 
తే. వైద్య కోదండ గాంధర్వ విద్య, లర్థ | శాస్త్రమగు నీతివిద్య, తత్సహిత వృత్తి
వెలయఁగాఁ బదునెనిమిది విద్య లభవుఁ | డేర్పరించె జగత్త్రయహితము పొంటె.
119
వ. ఇట్లు సమకట్టి, దండంబును దండనీతి ప్రపంచంబులయిన యవ్విద్యలను విష్ణు వశగతంబులు సేసె; నాసర్వేశ్వరుం డత్తమ్మిచూలికిఁ దుమ్ము ఘటించి యీ భంగిం బ్రజాపతి ప్రసవంబు గావించె; దండనీతి సమగ్ర రూపమై చెల్లె; నెల్ల జగంబులుం బ్రియంబందె; నరవిందభవుని యాగంబును సుప్రయోగంబై నడచె; విష్ణుండు దండనీతి శాస్త్రంబు సకలంబు నాంగిరసున కిచ్చె; నాంగిరసుం డింద్ర మరీచులకు, మరీచి భృగునకు, భృగుం డనేక మునులకు నిచ్చె; నీక్రమంబున నది జగంబులం బరఁగె; దండంబు జాగరణంబున లోకంబు మర్యాదామహితంబై వర్తిల్లెఁ; గపర్ది శంకరుండు రుద్రుండు భవుండు స్థాణుం డుమాపతి యనుపేళ్ళం బరఁగు నద్దండదేవుని నతులధర్మంబున నయించు భూపాలుం డైహికాముష్మిక సిద్ధులం బొందు. 120
క. అని వసుహోముఁడు సెప్పిన | విని మాంధాతృండు దండ విభవజ్ఞుండై
యనఘ! మహీపరిపాలన | మొనరించెను నీతిదండయుక్తి వెలయఁగన్‌.
121
క. ఈ యాఖ్యానము విని భూ | నాయకుఁ డెవ్వం డిలాజనంబుల నతుల
న్యాయంబున భావించుఁ జి | రాయుస్స్థిర పుణ్యభాగి యగు నతఁడు నృపా!
122
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )