పురాణేతిహాసములు శ్రీమహాభారతము శాంతిపర్వము - తృతీయాశ్వాసము
బ్రహ్మదత్తునితోఁ బూజని యను శకుని కైన సంవాద ప్రకారము (సం. 12-137-4, 5)
సీ. బ్రహ్మదత్తుం డనఁ బరఁగిన నరపతి | నగరఁ బూజని యను నామ మొప్పఁ
జతురభాషిణి యొక్క శారిక వర్తించు | నది పిల్లఁ బెట్టి యింపారుపండ్లు
దెచ్చి యర్మిలి దాని కిచ్చుచో మేలేఱి | యధిపపుత్త్రున కిచ్చు; నందుఁ గొన్ని
వాఁడును మచ్చిక వచ్చి యప్పిల్లతోఁ | జర్లాటమాడుచు సంచరించు;
 
ఆ. నొక్కనాఁడు దాది యొద్ద లేకుండ న | ద్దారకుండు పిల్లతల నొగిల్చి
చంపె; దాని తల్లి సనుదెంచి కని మది | నిట్టులనియె శోక మెసక మెసఁగ.
245
తే. ‘అకట! కూడి మెలంగి యే మొకటి యైన | నర్థి నిదియును దానును ననుభవించుఁ
బట్టి యాడుచునుండు నిప్పాపజాతి | పడుచు సంపునె యిటు దీని మిడుకమిడుక.
246
ఆ. రాచకొడుకుగాఁడె రాచవారికి నేటి | పరిచయంబు వేగ కరుణ విడుచు
హితవు మఱచు రాజు లెందు నమ్మికకుఁ బా | త్రములె సమదమతులు క్రౌర్యరతులు.’
247
వ. అని నిందించి. 248
క. ఈ పగ దీర్చెద నంచుం | గోపంబున రాజు కొడుకు గ్రుడ్డులు రెండుం
బోపడునట్లుగ గోళ్ళన్‌ | వే పెఱికి రయమున గగనవీథికి నెగసెన్‌.
249
వ. ఎగసి యచ్చోట నిలిచి బ్రహ్మదత్తుండు విన నిట్లనియె. 250
క. ‘చేసె నఘము; దత్ఫలముం | జేసేతం గుడిచెఁ గాని శిశువు నెడన్‌ నా
చేసిన క్రౌర్యము లే; దేఁ | జేసితి మా; ఱొండు గీడు సెందదు నన్నున్‌.’
251
చ. అనవుడు బ్రహ్మదత్తుఁ ‘డది యట్టిద; నీ దెసఁ గీడు లేదు; నీ
చనుటకు నా మనం బతివిషాదముఁ బొందెడుఁ; దొంటి యట్ల నె
మ్మిన నిలు ‘మన్నఁ బూజని’ శమించునె యొండొరుచేతఁ బడ్డ యీ
పెనుపగ నొంచి మాటపస బేల్పడి క్రమ్మఱఁ జేరు టొప్పునే?’
252
వ. అనిన విని యతండు. 253
క. ‘చేసిన దానికి మాఱుగఁ | జేసినఁ బగయంతతోడఁ జెడుఁ గాక గుణుల్‌
డాసిన నమ్మేలు విడిచి | దోసముఁ బట్టుదురె యెట్టి తుచ్ఛులుఁ జతురా!
254
వ. అనిన నతనికి శారిక యిట్లనియె. 255
క. ‘నెయ్యము సెడినను మాటల | తియ్యఁదనము వట్టి పగ మదిన్‌ మఱచినఁ జా
వయ్యెం జేటయ్యె గలఁక | యయ్యె నొకటి మూఁడుఁగాక యది మే లగునే?
256
ఆ. వినుము! నేల దోఁచికొనినను దాయాదు | లైన మాట మాటకేని నాఁడు
వారి యెడను గీడు వారక చేసినఁ | బగ జనించు నిట్లు భంగు లైదు.
257
ఆ. పగయుఁ గల్గెనేని పాయునె గూఢమై | మ్రాన నగ్నియున్న మాడ్కి నుండుఁ
గాన నమ్మి బేల కాలాంతరంబున | నైనఁ జెడును సందియంబు వలదు.
258
క. జననీ జనక సహోదర | తనూభవుల సఖుల నమ్మఁ దగ దనినను నె
మ్మనమునఁ బగ గలవారలఁ | జనునే నమ్మంగ విడువు చతురవచనముల్‌.’
259
వ. అనుటయు బ్రహ్మదత్తుం డిట్లనియె. 260
క. ‘కాలవశంబునఁ గీడు | న్మేలును జనులకును మూఁడు నీకును నాకున్‌
వాలి యవి సేయ వచ్చునె? | బేలనె యే నంత యేల పెడఁబాయంగన్‌.
261
వ. అనిన విని శారిక యతని మొగంబు దేఱకొనంజూచి. 262
క. ‘విను చల్లని మాటలలో | మునిఁగి యలుక గుబ్బతిలు సముద్ర జలములో
నన యుండి యాఱ కెప్పుడు | గనగన మను బాడబాగ్ని కరణి నరేంద్రా!’
263
క. అని పలికి యవిశ్వాసము | మనమున నెలకొల్పి రాజు మాటలకుం దే
లని వెరవుతోడ నా పూ | జని దనకిమ్మైన యెడకుఁ జనియెఁ గుమారా!
264
వ. అదియునుం గాక. 265
క. జననాథునకు నవిశ్వా | స నిరూఢత వలయు నెల్ల జనములయందుం
దనుఁ దనసిరిఁ గాచుటకై | యని నీతులు సెప్పుదురు బృహస్పతిముఖ్యుల్‌.
266
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )