పురాణేతిహాసములు శ్రీమహాభారతము శాంతిపర్వము - తృతీయాశ్వాసము
భీష్ముఁడు ధర్మజునకు శరణాగత రక్షణ సుకృతం బెఱింగించుట (సం. 12-141-4)
క. ‘శరణాగతసంరక్షణ | పరులకు సమకూరు నెట్టి పాటి ఫలము? ని
ర్భరకరుణాకర! పరమా | దరమున నెఱిఁగింపు నాకు దాని తెఱంగున్‌.
304
ఆ. అనిన భీష్ముఁ డిట్టులను ‘ముచుకుందుండు | నాఁగఁ బరఁగు ధరణినాయకుండు
దనుజమంత్రిచేత వినినది యొక కథ | యఖిలపాపహరణ మాచరించు.
305
వ. అయ్యితిహాసంబు సెప్పెద; దాన నీ యడిగిన యర్థంబు దెలియు; నవహితుండ వై యాకర్ణింపుము. 306
సీ. పాపాత్ముఁ డొకబోయ పక్షుల వధియించి | తినియును బె క్కమ్మికొనియు నదియ
బ్రదుకుగా దానికి బహుసాధనంబులు | సవరించుకొని మహాటవిఁ జరింప
నొకనాఁడు పెనువానయును గాలియును ముట్టి | సకలజీవులకు నాశంబు పుట్టు
నట్టిదియై కానయంతయు జలమయం | బైన బెగ్గిలి యన్నరాధముండు
 
తే. వేగ వఱ్ఱోడి యెల్లను వెడలి మిఱుత | నొక వనస్పతి జొంపమై యున్న దానిఁ
జెంది రాతిరి యగుటయు శిలయ సెజ్జ | గాఁగ శీతార్తుఁడై యుండెఁ గౌరవేంద్ర!
307
క. ఆ లుబ్ధకుఁ డత్తరువర | మాలోకించి కడు భక్తి ననియె ‘నిచటి భూ
తాలిం గొలిచెదఁ గరుణా | శీలత ననుఁ గాచుటకు విశిష్ట వినీతిన్‌.’
308
వ. అని యి ట్లప్పక్షిధ్వంసకుండు శయనంబు ప్రాపించియుండ నమ్మహీరుహంబు కోటరంబున వసియించియుండునది యొక్కకపోతంబు దనవల్లభ యెటయేని మేఁతకుం బోయి రాక తడసిన శోకించి. 309
సీ. ఎచట నున్నది యొక్కొ యింత ప్రొ? ద్దొకచోట | నుండునే ననుఁ బాసి యుజ్జ్వలాంగి?
యమ్మేను లేకున్న నిమ్మేని కలిమి ని | రర్థకం బధికానురాగయుక్త
యగు సతిగుణముల యైహికాముష్మి క | సుఖసాధనంబులు సువ్వె! పతికి
యేకారణంబున నే మయ్యెనో వాన | యేపునఁ దెగియెఁ గానోపు నకట!
 
తే. నేమి సేయుదు? మందిరం బిపుడు పాడు | వాఱుచున్నది’ యనఁగ నప్పలుకు లెల్ల
బోయవలలోన నున్న కపోతి విని మ | నంబు సంతోషపూరమగ్నంబు గాఁగ.
310
క. ‘పతి మదికి నింత యెక్కిన | యతివ గదా పుణ్యవతి; ప్రియాలాపము లీ
గతి వినఁ గాంచిఁ జన్మము | గృతకృత్యం బయ్యె నాకు; గెలిచితి జమునిన్‌.’
311
వ. అని యుల్లంబునన యుగ్గడించి పతికిం దన తెఱంగెఱింగించి, ‘విధి కృతంబునకు వగవంబని లే’ దని మఱియు నిట్లనియె. 312
చ. ‘శరణము సొచ్చినం దగఁ బ్రసన్నతఁ గైకొని రక్షణంబు సా
దరముగఁ జేయు టత్యధిక ధర్మముగా బుధకోటి సెప్పు; నీ
వరసి మహార్తు వీని శరణాగతు నోపినభంగి నాపదం
బొరయకయుండఁజేయుము ప్రభూతపు సీతునఁ గొంకు వోయెడున్‌.
313
క. అని యేర్పడ భాషిం | చిన విని శోకము డిగ్గ విడిచి విహగము గరుణం
దనజాతి సెప్పి తగ ని | ట్లనియె మనుజభాషణముల నా లుబ్ధకుతోన్‌.
314
క. ‘ఓ యన్న! డస్సినాఁడవు | మా యింటికి నతిథి వైతి; మసలక నీకుం
జేయవలయు నాతిథ్యం; | బేయది భవదీప్సితార్థ మెఱిఁగింపు తగన్‌.’
315
చ. అనవుడు నుల్ల మెంతయుఁ బ్రియంబు వహింపఁగఁ బక్షివైరి ‘సీ
తున సకలాంగకంబులుఁ బ్రతున్నము లయ్యెడుఁ; దీనిఁ బాపవే!’
యనిన విహంగమంబు రయమారఁగ నచ్చటి పుల్లలెల్ల ము
క్కునగొని తెచ్చి ప్రోవిడి యకుంఠిత మైన దయాగుణంబునన్‌.
316
వ. ఆ పొంతపల్లియకు రయంబునం జని పుల్లతల సంగతంబైన యింగలంబు. 317
క. కొని వచ్చి పుల్ల ప్రోవునఁ | దనుకంగాఁ జేసి నెమ్మి దళుకొత్తఁగ ని
ట్లను బోయతోడ ‘మే నీ | యనలంబునఁ గాఁచికొనుటకై లె’ మ్మనఘా!
318
చ. అనవుడు వాఁడు గువ్వహృదయం బలరం దనయంగకంబు ల
య్యనలశిఖాకలాపమున నల్లన యల్లన కాఁచి శీత బా
ధన ముడుగంగఁ జేయఁగఁ బదంపడి యాఁకలి చాలఁ దోఁచెఁ; దోఁ
చిన నెఱిఁగించె గువ్వ కది సేయ నుపాయము లేక యాత్మలోన్‌.
319
వ. వగచి వెలవెలంబాఱి తలంచికొని వాని కిట్లనియె. 320
తే. ఖగములకు జీవనం బనఁ గలదె సంగ్ర | హించినట్టిది యాఁకలి కేమియైన
మాకు దొరకొన్నఁ దిందుముగాక!; యైన | నీవు డస్సితి వాతిథ్యనియతి వలయు.
321
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )