| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - తృతీయాశ్వాసము |
| వ. | నా శరీరం బాహారంబుగా నిచ్చెదఁ గొనుము.’ | 322 |
| క. |
అని పలికి యగ్ని వలగొని | తన దేహము దానిలోనఁ దడయక యిడినం గని బోయ విస్మయంబున | మనమూనఁగఁ గొంతసేపు మ్రాన్పడి యుండెన్. |
323 |
| వ. | పదంపడి. | 324 |
| మ. |
‘కలదే యిమ్మెయి పౌరుషంబు జగతిం గారుణ్య మేపార ని ప్పులుఁ గి ట్లిచ్చునె మేను? నాదు చరితంబుల్ నిందకుం బట్టులై తలఁపన్ వచ్చిన నింత కీ డగునె యేతత్క్రూరతా ఘోర చే ష్టలు మానంగలవాఁడఁ; బక్షి గురువై సంధించె సద్బోధమున్.’ |
325 |
| వ. | అని యంతరంగంబున వైరాగ్యంబు నిరంతరం బగుటయు నంత నిలువక. | 326 |
| మ. |
‘ఇది యి ట్లాలిని బంధులం దొఱఁగి తా నీ యగ్నిలోఁ గూలె నొ ప్పిదమై యుండఁగ నిట్టి తెంప యెలయం బెంపారు వైరాగ్య సం పద పాపంబుల నెల్లఁ ద్రుంపఁగ మహాప్రస్థానపుణ్యత్వ మొం దెద నే నిప్పుడ’ యంచు మానసము శాంతిం బొంద నిర్మోహుఁడై. |
327 |
| క. |
వలలోన నున్న పులుఁగుల | వెలువడఁగా విడిచి వలయు వెండియుఁ దనకుం గల పక్షి నిహతిసాధన | ములు నచటనె యుండఁ బోయె బోయ నియతుఁడై. |
328 |
| ఆ. |
అక్కపోతి నాథుఁ డగ్నిలోఁ బడుటకు | శోకవహ్నిఁ జిత్త మాకులముగ నెలుఁగు రాలుపడఁగ నిట్లని పలవించె | నశ్రుజలతరంగితాస్య యగుచు. |
329 |
| క. |
‘నా యాఁకలి కోర్వ వెపుడు | వేయైనను నేఁ గొనంగ వెండి యనుభవిం తాయాసపడుటఁ గనుఁగొని | నోయుదు ననుఁ బాసి యిటు సనుట దగ వగునే?’ |
330 |
| వ. | అని వెండియు. | 331 |
| సీ. |
‘ఇగురు జొంపంబుల నింపారు విరులను | బలుపైన పొదల క్రేవలకుఁ దార్చి, సెలయేఱులందలి తెలినీటఁ దనువు సొం | పెలసిన గిరుల తెప్పలకుఁ జేర్చి, మావిమ్రోకల నెలదీవలఁ జెన్నొందు | తోటలకడ నలితోడఁ జెంది, యలరు నెత్తమ్ముల కలిమిఁ జెల్వగు డిగ్గి | యల తీరభూముల నల్లఁ బొంది, |
|
| తే. |
నన్ను మనమునఁ దేల్చి యానంద మొందఁ | గేలి సలిపెడు నీ దగు లీల మఱవ నావశంబె ప్రాణేశ! ప్రాణంబు లిపుడ | నిన్న కూర్చి యేతెంతు నీ సన్న కడకు. |
332 |
| వ. | అట్లుంగాక. | 333 |
| క. |
ఱేని యనుమరణమునఁ దన | మేను విడిచినట్టి కాంత మేలిపదవికిం దాను నతండును నరిగి య | నూన స్థిరసుఖము లందుచుండుట విందున్.’ |
334 |
| క. |
అని పలికి యపుడ యనలము | ఘనముగ దరికొల్పి మది వికాసముఁ బొందం దన వల్లభుఁ దలఁచుచు వల | గొని లీలం జొచ్చి యతనిఁ గూడం జనియెన్. |
335 |
| క. |
స్ఫురిత విమానము మీఁద న | మరతతి వేష్టింప రత్నమయ భూషణ సుం దర దివ్యమూర్తి వెలిఁగెడు | వరునిఁ గలిసి పరమ సౌఖ్య వైభవ మెసఁగన్. |
336 |
| తే. |
లీల మూరిఁబో నచ్చరలేమ పిండు | బలసి యభివందనము సేయఁ బొలిచె నిట్లు సనిన పక్షియుగ్మంబు వర్తనము దోఁచెఁ; | బుణ్యవర్తనుఁ డగుట నా బోయ కపుడు. |
337 |
| వ. | తోఁచిన నతండు. | 338 |
| క. |
‘ఏనును ని ట్లగుదు’ ననుచు | నూనిన కౌతూహలమున నుల్లము వొదలన్ మే నెల్ల ముండ్లు సింపఁగఁ | గానఁ దఱిసి గళిత రక్త కలితాకృతియై. |
339 |
| తే. |
అరుగుచుండు వాఁ డొకచో దవానలంబు | గట్టెదిరి కాననం బెల్ల ముట్టి మండ సంప్రమోదితచిత్తుఁడై చక్కఁ జొచ్చి | యొడలు దొఱఁగి దేవత్వంబు వడసి యొప్పె. |
340 |
| ఉ. |
ఈ యితిహాస మర్థిమెయి నెజ్జనముల్ వినినం బఠించినం బాయు నుదాత్త గోహనన పాతకమైనను భూరిసౌఖ్యముల్ వేయి విధంబులం బొరయు విన్ము తగన్ శరణార్థిఁ దోషితుం జేయనివాఁడు కల్మషముఁ జెందు నొకప్పుడుఁ బాయ దేమిటన్. |
341 |
| వ. | అని యిట్లు శరణాగత రక్షణ ఫలవిశేష ప్రకటనం బగు లుబ్ధ కపోతాఖ్యానంబు సెప్పిన విని యప్పితామహుని మీఁదం బ్రీతి వినయ విస్తారవిలోకనం బెలయ నప్పాండవాగ్రజుండు. | 342 |
| క. |
‘పాపంబు బుద్ధిపూర్వ | వ్యాపారము గాక తొడరినప్పుడు మనుజుం డేపాట దానినంతయుఁ | బాపికొనంజాలు సుజనబాంధవ! చెపుమా!’ |
343 |
| వ. | అని యడిగిన నయ్యార్యవర్యుం డా ధరణీభరణధుర్యునకు నిట్లనియెఁ: ‘దొల్లి పరీక్షిత్తనయుం డగు జనమేజయుం డను మహారాజు దన కబుద్ధిపూర్వకబ్రహ్మహత్య వాటిల్లినం దత్కిల్చిషంబు వాపికొనియె; నది పురాణకథయై మునులవలన వినంబడు; నత్తెఱం గెఱింగించెద; నాకర్ణింపుము. | 344 |
| క. |
పాపంబు దొడరుటయు నా | భూపాలకుఁ బ్రజయ విడిచె; భూసురులును నిం దాపాత్రంబుగఁ జేసిరి; | తాపము మదిఁ గదిరి యతఁడు దల్లడ మందెన్. |
345 |
| తే. |
అట్లు జనమేజయుఁడు వగ నారఁగూరి | పురము వెడలి యొక్కరుఁడును బోయి కాన నాంతరము సొచ్చి శౌనకుం డను మునీంద్రు | నాశ్రమము రోసికొని చని యమ్మహాత్ము. |
346 |
| వ. | కాంచి దండప్రణామం బాచరించి సవినయంబుగఁ గరంబులు మొగిచి నిల్చినం జూచి యతండు. | 347 |
| చ. |
‘పెనుఁ బొల వల్చుచున్న యది పీనుఁగుఁ జూచినయట్టు లయ్యెడున్ నినుఁ గనుఁగొన్న నీ యెడకు నీ విది యేటికి వచ్చె? దెక్కడేఁ జనుము; శిరంబు క్రిందుగ నజస్రము వ్రేలఁగలాఁడ వీ భవం బున తుదిఁ గ్రూరకాకచయముల్ దొలువన్ నరకాధివాసివై.’ |
348 |
| చ. |
అనుటయు ‘గర్హకర్హుఁ డగునట్టి దురాత్మునిఁ బూజితవ్రతుల్ గని యిటు లంట యుక్త మటుగాన కదా భవదీయ పాదవం దన మొనరించి మీవలన దారుణపాపము వాచికొందు నే నను మది వచ్చినాఁడ సదయంబగు చూడ్కిఁ బరిగ్రహింపవే!’ |
349 |
| వ. | అనిన విని కరుణాయత్తచిత్తుం డగు నత్తపోధనసత్తముం డిట్లనియె. | 350 |
| క. |
విను కొంద ఱల్పబుద్ధులు | నను నెంతయు ధిక్కరింప నవ్వఁగ వారిం గొనక బుధులైన విప్రులు | ననిమిషులును మెచ్చుచుండ’ ననియెద నీతోన్. |
351 |
| క. |
హీనప్రజ్ఞుఁ డకార్యము | లైనవి సేసి తుది వగచు నతులప్రజ్ఞా సానుమదారూఢుఁడు వగ | నూనఁడు దురిత మను వఱితి కోడక యునికిన్. |
352 |
| వ. | ప్రజ్ఞాకార్యంబు లైనవి యనుష్ఠింపవలయు; వానిఁ జెప్పెద; నీకుం బాపంబునెడ ననుతాపంబు గలిగి ధర్మ ప్రవణుండ వైతే?’ యనుటయు నమ్మనుజనాథుండు. | 353 |
| క. |
‘తాపసవర! తీవ్రం బగు | పాపాగ్నిజ్వాల చయము పాలుపడి పరీ తాపము నొందుచు ధర్మ | వ్యాపార జలాభిలాషి నై యున్నాఁడన్. |
354 |
| వ. | భవదీయ కృప నాశ్రయింప వచ్చితి; నన్ను రక్షింపవే!’ యనవుడు నమ్మునీంద్రుండు. | 355 |
| క. |
‘భీతి యొకటి గోరుటయును | నీ తలఁపులలోన దీని కిది గతమనఁగా నే తెరువును గలుగదు మ | చ్చేతోగతి ధర్మవృత్తిఁ జిక్కుట దక్కన్. |
356 |
| క. |
ఆతురత నీవు నా కడ | కేతెంచిన దానఁ జేసి యెలసిన ధర్మ ద్యోతన కౌతూహలమున | నీతోఁ బడవలసె; వినుము నిశ్చలమతివై. |
357 |
| క. |
భూవిబుధుల కెయ్యది హిత | మావిధమున నడచువాఁడవగునది ద్రోహా భావంబు ప్రతిజ్ఞాతం | బై వెలయఁగవలయు నీకు నా జాతియెడన్.’ |
358 |
| చ. |
అనవుడు ‘ధర్మవృత్తము మదాత్మకు నైజము; దోషవృత్తికిన్ మునివర! యేను భీతుఁడ; సముజ్జ్వల విప్రకులంబు నాకు మ న్ననలకుఁ బాత్ర; మెవ్విధమునం దెగి ద్రోహము దానియందు నా మనము దలంప; దింతకును మాన్య భవచ్చరణంబు లంటెదన్.’ |
359 |
| వ. | అనుచుఁ దదీయ పాదస్పర్శనంబు సేసి యవ్విధంబునం గృతశపథుం డగుటయుఁ గరుణాగోచరంబగు చిత్తంబుతో నత్తపోధనవర్యుం డాదరమేదురావలోకనం బా భూపాలుని మీఁద నొలయ నిట్లను: ‘నట్లేనిం జెప్పెద నవహితుండ వయి యాకర్ణింపుము. | 360 |
| సీ. |
శ్రీమంతుఁడును బలశ్రేష్ఠుండు నగు రాజు | భోగంబు దర్పంబుఁ బోవ విడిచి, ధర్మంబు గైకొని, తపమును దానంబు | నధ్యయనంబును యాగవిధులు నాచరింపగఁ జూచి యచ్చెరువడి యను | గ్రహము సేయదె భూతరాజి? యతని కధిప! యయాతివాక్యము నర్థ మెఱిఁగింతు | వినుము! సరస్వతియును దృషద్వ |
|
| తే. |
తియును నను పుణ్యనదులందుఁ దిరిగి తీర్థ | సేవ సేయుచు నధ్యయనావధాన దాననిర్ధూతరాగత్వదయలు గలిగి | పరఁగఁ బాపకళంకలేపంబు వాయు. |
361 |
| వ. | అదియునుంగాక యొక్క పరమస్మృతి సెప్పెద వినుము. | 362 |
| చ. |
దురితము సేసి తాపమునఁ దూలిన నిం కిటు సేయ నన్మతిం బొరసిన ధర్మ సంచరణ బుద్ధియ మేలని యూఁదినం గ్రియా పరుఁ డయి మేలుసేసినను బాదము పాదముగాఁ గ్రమంబునన్ విరియు సమస్తముం దదభివిష్టకళంకము నిర్భయంబుగన్. |
363 |
| చ. |
నరవర! వాసవుం డడిగినన్ గురుఁ డిట్లని చెప్పె బుద్ధితోఁ బొరయని పాతకంబులు సబుద్ధికపుణ్యములన్ నశించు నం బరమునఁ బట్టినట్టి మలపంకము గారములోన నద్దఁగా విరిసిన యట్లు నమ్ము మిది వేదము సెప్పిన నేనుఁ జెప్పితిన్. |
364 |
| వ. | అని యిట్లు బహుప్రకారంబులం గారుణికోత్తముం డగు నత్తాపసోత్తముం డా భూవరు బోధించి, తీర్థసేవాది పునశ్చరణంబులం బరిపూతాత్ముం గావించి,యశ్వమేధంబు సేయించిన నుజ్జ్వలుండయి యజ్జనమేజయుండు నిజరాజ్యంబు పరిపాలనంబు సేసె’ నని చెప్పి వెండియు. | 365 |