| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - తృతీయాశ్వాసము |
| సీ. |
అని వినతుం డగు నా ధర్మసుతునకు | ముదమునఁ జెప్పి భీష్ముండు మఱియు నిట్లను నిది యొక్క యితిహాస మధిప! యా | కర్ణింపు: హిమవన్నగంబునందుఁ గల దొక్క బూరువు; గడుఁ బెద్ద కాలంబు | ముదురు శాఖాశోభి మూలదృఢము నారదముని యొక్కనాఁ డత్తరువు పొంతఁ | జనిచని వేడ్క నిట్లనియె: ‘నెమ్మి |
|
| తే. |
బూరువా! యింతపఱపును బొడవుఁ | గల్గి నీవు మృగపక్షిసంశ్రయణీయ మగుచు నునికి గని ప్రీతి నడిగెద ననిలుచేతఁ | బడు నొకప్పుడు తరులు నీ పడమి యెట్లు. |
383 |
| క. |
పవనునకును నీకును బాం | ధవము గలదొ? యతఁడు నిన్ను దయ రక్షింపన్ సవినయవృత్తిని బ్రతికితొ? | చెవులకు నింపెసఁగ నిజము సెప్పుము నాకున్. |
384 |
| క. |
అనిన విని బూరు విట్లను | ‘ననిలుని బల మస్మదీయమైన బలముతో నెనగా దేర్పడ; విను పదు | నెనిమిది యగు నంశమునకు నెనయ దరయఁగన్. |
385 |
| వ. | అని పలుకుటయు నమ్మునీంద్రుండు. | 386 |
| ఆ. |
‘అమ్మచెల్ల! యిట్టు లనకుము గొండలు | లోనుగాఁగ బవనుచే నపాస్త మహిమ గలుగు టెఱుఁగుమా భూతముల చేష్టి | తములు వాయువశగతములు గావె? |
387 |
| క. |
అనుటయుఁ ‘బెలుచని యెలుఁగున | ఘనమూల ప్రబలశాఖికా దుర్జయు న న్నును దాఁకిన నతని ప్రభం | జనుఁ డను నామంబునకు నసత్యత వచ్చున్.’ |
388 |
| వ. | అని గర్వంపు మాట లాడిన యా శాల్మలిం జూచి సురమునిప్రవరుండు. | 389 |
| చ. |
‘మఱవకయుండు నీ బిరుదు మాటలు నీ విటు లంట మారుతుం డెఱిఁగెడు నెట్లు నంచు వెస నేఁగి సమస్తముఁ జెప్ప నాతఁ డే డ్తెఱఁ జనుదెంచి నీ వటు కడిందిమగండవు; నిన్నుఁ దాకినం జెఱుతటె పేరు? బూరుగ నశించితిగా కిటఁ బల్కు లేటికిన్?’ |
390 |
| మ. |
అని కోపంబునఁ బల్క నప్పవనుతో నా భూరుహం ‘బింత పె ల్చన నీ వాడెదు నంత తక్కువనె? బేలా! లోకసామాన్య వృ క్షనికాయంబును నన్ను నొక్కటిగ నిచ్చం జూచితే?’ యన్న న ల్లని న వ్వొప్పఁగ నా సమీరణుఁడు హేలాస్ఫారుఁ డై యిట్లనున్. |
391 |
| క. |
‘ఒకనాఁ డజుండు నీ నీ | డకు డబ్బా టరుగుదెంచుటయు నమ్మే లా త్మకు వ్రేఁగై మన్నించిన | మెకమెక పడితిట్ల పలుకుమీ తగరేపున్.’ |
392 |
| వ. | అని పలికి బలుమొగంబుతోడం బోయిన నబ్బూరువు దలంకి. | 393 |
| చ. |
‘మనుగడ దప్పు నొక్కొ! మునిమాటలు గైకొన నైతి; నా బలం బన నది యెంత? యుగ్రత మహాబలురాకకు నోర్వఁ జాల; నా తని నొక భంగి గెల్తు’నని తాఁ దలపోసి హరించె నాకులుం గొనలును జొంపముల్ నిడుదకొమ్మలు రే యగుడున్ రయంబునన్. |
394 |
| వ. | అట్లు తన్నుం దాన విఱుచుకొని యున్నంత వేగుటయు. | 395 |
| చ. |
ప్రతినకు నీడుగా భయదభంగిఁ బ్రభంజనుఁ డేఁగుదెంచి యా క్షితిరుహముం గనుంగొని ‘యిసీ! యిది నా పని నీవ చేసి తీ ధృతి మతి సంతసింపు మిట తేజముఁ బొందుము నీదు బాంధవ ప్రతతికి నివ్విధంబు సదుపాయము మే లెఱిఁగింపు పెంపునన్.’ |
396 |
| వ. | అని యుల్లసంబాడి సముల్లసద్గతి నా సదాగతి సనియె; నట్లు శాల్మలి పవనుచేత భంగంబు నొంది వగం గుందెఁ; బ్రబలునితోడ దుర్బలుండు దొడరి మత్సరగ్రస్తుం డయిన నపాస్తవిభవుం డగు నని తెల్పు నప్పవన శాల్మలీ సంవాదంబు పుణ్యప్రదం బయిన యుపాఖ్యానం బని చెప్పిన. | 397 |
| ఆ. |
పాండవాగ్రజుండు ‘పాపంబునకు నధి | ష్ఠాన మెద్ది భరతసత్తమాగ్ర గణ్య! దాని నెఱుఁగఁగాఁ జెప్పు’ మనుడు నా | తనికి భీష్ముఁ డిట్టు లనియెఁ బ్రీతి. |
398 |
| సీ. |
‘వినుము పాపముల కెల్లను నధిష్ఠానంబు | లోభంబ; యది గామలోలతయును గ్రోధంబు మత్సర ద్రోహంబులును బర | ధన దార వాంఛలు దైన్యపాటు వ్రీడాక్షమాసత్య విముఖ భావంబును | గలిగించి ధర్మంబు గలఁచి నరునిఁ బ్రయి మాలి యేమిటి కయినను గర్దించు | వానిఁగా సమకట్టుఁ గాన లుబ్ధ |
|
| ఆ. |
జనులఁ దొఱఁగి లోభ మను తిరిం బడని స | త్యవ్రతులను బరమధార్మికులను బాపభీతమతులఁ బనిగొను లోభంబుఁ | జెంద నీకు నీదు చిత్త వృత్తి.’ |
399 |
| వ. | అనిన విని యజాతశత్రుం ‘డజ్ఞానం బాపదలకును దుర్గతికిని మూలం బని విందు; దాని తెఱం గెఱింగింపు’ మనిన నాపగాతనయుం డమ్మనుజపతి కిట్లనియె. | 400 |
| క. |
‘రోషము శోకము రాగ | ద్వేషము లభిమాన దర్ప వేగాలస్యా శ్లేషము లజ్ఞాన మని మ | నీషి జనము సెప్పు మాననీయచరిత్రా! |
401 |
| క. |
విను లోభము నజ్ఞానం | బును సదృశ ఫలప్రదముల; పుట్టును లోభం బున నజ్ఞానము గావున | జననాయక! లోభముడుగ సౌఖ్యము లొందున్.’ |
402 |
| ఆ. |
అనిన ధర్మపుత్రుఁ ‘డనఘ! ధర్మంబు నా | నా ప్రకారగతి వినంగఁబడు; మ దీయ చిత్తమునకుఁ దేటపడంగ వి | శిష్ట ధర్మ మెద్ది సెప్పు’ మనుడు. |
403 |
| వ. | ప్రియంబంది భీష్ముఁ డతనికి నిట్లనియె. | 404 |