| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - తృతీయాశ్వాసము |
| క. |
‘విను ధర్మంబున ధనమగు, | ధనమున సిద్ధించుఁ గామతంత్రం, బటు గా వున మధ్యమంబు నధమము | ధన కామము; లుత్తమంబు ధర్మం బధిపా!’ |
453 |
| చ. |
అనవుడుఁ బార్థు డిట్టులను ‘నర్థము మూలము ధర్మకామవ ర్తనముల; కట్లు గాకయు విరక్తతనొంది జటాదిధారణం బునఁ జరియించువారికిని భూవర! యర్థము దేహకృత్య సా ధన మసురేజ్య కణ్వులును దానిన మేలని పూని చెప్పరే. |
454 |
| వ. | కావున నర్థంబు ప్రధానం’ బనుటయు నకుల సహదేవు లేకవాక్యత నిట్లనిరి. | 455 |
| తే. |
అర్థ ధర్మంబు లితరేతరాశ్రయములు | గాన వానిలో నొకఁ డూఁదు మానవేంద్రు జగము పోకులఁ బుచ్చు నసంభృతార్థుఁ | డైన వానికిఁ గామమ ప్రాప్యమరయ. |
456 |
| క. |
తమలో సరి ధర్మము న | ర్థము నర్థంబునకుఁ గామతంత్రము ఫలరూ పము గావున నప్పురుషా | ర్థమునుం గొనియాడవలయు ధరణీనాథా!’ |
457 |
| వ. | అనిన విని పవననందనుం డిట్లనియె. | 458 |
| క. |
‘దధిసారము చందంబున | నధిపా! ధర్మార్థ సారమగు కామరసం బధమ మను తలఁపు సుఖసం | విధానబాహ్య మని నీ వివేకమ యెఱుఁగున్. |
459 |
| క. |
విను మళి యలరునఁ దేనియఁ | గొనుగతి నత్యంత సుఖము గొననగుఁ; గామం బున నధిక సుఖము లొందని | జను సిరి తాఁ గొల్చులేని సస్యమ కాదే! |
460 |
| తే. |
అనఘ! ధర్మార్థకామంబు లందు నొకట | నర్థిఁ దగిలిన మానవుం డధముఁ; డొకటి మాని వర్తించు నాతఁడు మధ్యముండు; | నడపు నన్నింటి నుత్తమనాయకుండు.’ |
461 |
| క. |
అని యిట్లందఱుఁ జెప్పఁగ | విని చిఱునవ్వున ముఖారవిందము చెలువం బినుమడిగా ధర్మజుఁ డి | ట్లను వారలఁ గలయఁ జూచి యాదర మెసఁగన్. |
462 |
| వ. | ఏ నడిగిన తెఱంగునకు విదురుని వాక్యంబు సిద్ధాంతంబు; దక్కటివారి వచనంబులు నొక్కక్కమెయి నాదరణీయంబు; లదియట్లుండె; నా మతంబు వినుండు. | 463 |
| క. |
భూతములు జరామరణో | పేతంబులు గాన మోక్ష మెదఁ గోరుట మే; లాతతవర్గ త్రయ సం | జాత మనోదుఃఖభారసహుఁ డగు కంటెన్. |
464 |
| వ. | అది గోరిన దొరకొనునే? యందు మేని. | 465 |
| క. |
మనమున ధర్మము నర్థం | బును గామముఁ గీలుకొనక పొరపొచ్చెములై చన సుఖదుఃఖంబుల మద | మును దైన్యముఁ బొందకునికి మోక్షకర మగున్.’ |
466 |
| వ. | అనిన విని వారలందఱు నభినందించిరి; మఱునాఁడు నదీనందనుం గొలిచియుండి ధర్మనందనుండు ‘నరపతులకు వలయు వారును, వలవని వారును నెట్టెట్టి వా?’ రని యడిగిన నమ్మహాత్ముం డమ్మహీపతి కిట్లనియె. | 467 |
| ఉ. |
తాలిమిఁ బేర్చువారలును, ధర్మవిధిజ్ఞులు, సత్యవంతులున్, లోలత లేనివారు, మదలోభ నిరర్థక కోపహీనులు న్శీల సమేతులుం బలుకనేర్చుట కార్యము కాన్పు పెంపుమైఁ జాలుట గల్గు భృత్యులును సంపద సేయుదు రాత్మభర్తకున్. |
468 |
| ఉ. |
క్రూరుఁడు లోభియున్ శఠుఁడు గొండియుఁడున్ జడుడుం గృతఘ్నుఁడున్ నేరనివాఁడు బొంకరియు నిందకు నోర్చు నతండుఁ బందయున్ ధీరతలేమి దుర్నయ మతివ్యసనత్వముఁ గల్గు వారలుం జేరువ నున్కి భూపతికిఁ జెట్ట యొనర్చు నరేశ్వరోత్తమా! |
469 |
| క. |
ఒప్పని గుణములఁ బరఁగెడు | నిప్పురుషాధములలోన నెల్లఁ గృతఘ్నుం డొప్పఁడు గడు; నిట్లగుటం | జెప్పెడు నితిహాస మొకటి సెప్పెద నధిపా! |
470 |
| వ. | అది కాశ్యపగౌతమాఖ్యానంబనం బెద్దల గోష్ఠిం బ్రవర్తిల్లు. | 471 |