పురాణేతిహాసములు శ్రీమహాభారతము శాంతిపర్వము - తృతీయాశ్వాసము
భీష్ముఁడు నకులునకు ఖడ్గ ప్రభావంబు తెఱం గెఱింగించుట (సం. 12-160-9)
సీ. అతనికి నాతఁ డిట్లను ‘బ్రహ్మ జగములు | సృజియించి భూతసంసృష్టి సేయ
దివిజమర్త్యా ది జంతువు లమ్మహాత్ము వి | ధించిన తెరువులఁ దిరిగి బ్రదుకు
చుండ దైత్యులు సముద్దండత నన్యాయ | వర్తులై సురమునివ్రాతములకు
బాధ లొనర్ప నప్పరమేష్ఠి హిమశైల | తటమున వేయువత్సరము లధిక
 
తే. నియతిమెయిఁ దప మొనరించి నిష్ఠఁ గ్రతువు | సేసె నయ్యగ్నిఁ బుట్టె నశేష లోక
భీతికర మగు నుగ్రంపుభూత మొకటి | ప్రాంశుకృష్ణమై దంష్ట్రలు ప్రజ్వరిల్ల.
442
ఆ. అప్పు డినుఁడు మాసె, ననిలుండు సుడివడి | వీచె, నుల్క లురలె, వెఱఁ దలంకు
సురల మునులఁ జూచి సరసిజభవుఁ ‘డిది | నాదుమతమ యొండు గాదు వినుఁడు.
443
వ. ఇది రాక్షస నాశంబునకుం దోఁచిన యుత్పాతంబు; లోకంబుల రక్షింపను రాక్షసుల వధియింపను సాధనంబుగా ఖడ్గంబుఁ గల్పించితి నని పలుక, నా భూతం బారూపంబు విడిచి ఖడ్గాకృతి గైకొని తన మెఱుంగులు దిక్కులు దీటుకొనం బొల్చిన. 444
క. కమలాసనుండు నిజ చి | త్తము భక్తి మయంబు సేసి తలఁచె; హరుని ఫా
లము కంటి మంటతో న | య్యమరవరదుఁ డేగుదెంచె నచటికి నెమ్మిన్‌.
445
ఉ. వచ్చినఁ దత్పదాంబురుహవందనపూర్వముగాఁగఁ బద్మజుం
డిచ్చెఁ గృపాణ; మవ్విభుఁ డహీన సముద్యమలీలఁ గ్రాలుచుం
బుచ్చికొనంగ నా సభ యపూర్వ మనఃప్రమదంబుతోడి పే
రచ్చెరువాటు నొందె నటు లయ్యసిఁ గైకొని మేను వెంచుచున్‌.
446
తే. హరుఁడు బెట్టుగ నవ్వి పెల్లార్చుటయును | విని సముద్ధతరయమున దనుజకోటి
మునుగఁ బఱతెంచి తాఁకిన మునుముకొని వ | ధించి యిల యెల్ల నెత్తుట ముంచె నతఁడు.
447
ఉ. దైత్యుల నిట్లు గీటడఁచి ధర్మము నిల్పి ప్రసన్నమూర్తి సాం
గత్యము నొంది యప్పరమకారుణికుండు త్రిలోకరక్షణౌ
దాత్త్యమునన్‌ వెలుంగు హరిఁ దద్దయు వేడుకఁ బిల్వఁ బంచి సం
ప్రీత్యభిరాముఁ డై యొసఁగెఁ బెంపుగ నమ్మహనీయఖడ్గమున్‌.
448
వ. అ ట్లొసంగినం గైకొని దుష్టదమనం బాచరించుచు నుండెడు నవ్విష్ణుండు మహాస్త్రరూపంబగు నయ్యాయుధంబు పదంపడి మరీచి కొసంగె; మరీచి భార్గవునకు, భార్గవుం డనేకమునులకు, మును లింద్రునకు, నింద్రుండు లోకపాలురకు నొసంగెఁ; గ్రమంబున మనుప్రభృతులైన మానవేంద్రులు వడసి నిజసంతతి కినిచ్చుచు వచ్చి; రందు దుష్యంతుండు భరతున కిచ్చె; నా భరతవంశంబునందు ఖడ్గ సంప్రదాయంబు గలిగి వచ్చె; నొక ముని యనుగ్రహింప ద్రోణుం డధిగమించి కృపున కిచ్చెఁ; గృపునిచేత మీ రేవురుం బడసితిరి; విశేషించి యీ విద్యయం దత్యంతాదరణవంతుండ వగుటంజేసి దీనివలన వెలసితివి నిస్త్రింశంబునకు నక్షత్రంబు గృత్తిక యగ్ని యధిదేవత గురుండు రుద్రుం’ డని చెప్పి వెండియు నిట్లను ‘నసి విశసనంబు ఖడ్గంబు తీక్ష్ణధారంబు దురాసదంబు శ్రీగర్భంబు విజయంబు ధర్మపాలనంబన నెనిమిది పూజ్యనామంబులం బరఁగి కృపాణంబు ప్రహరణంబులోనం బ్రధానంబై నెగడుచుండు. 449
క. సుమహిత మగు నీ ఖడ్గా | గమమగు పుణ్యకథ వినగఁ గాంచిన పురుషుం
డమితయశంబును నధిక | ప్రమదంబును సద్గతియును బడయుఁ గుమారా!’
450
క. అని యిట్లు నకులునకు భీ | ష్ముని చెప్పిన కథ సుచిత్తమున విని కుంతీ
తనయాగ్రజుండు పురికిం | జనియెడు ప్రొ ద్దగుడు వినయ సంభృతుఁ డగుచున్‌.
451
వ. సముచితంబుగా నమ్మహాత్ముని వీడ్కొని చని, యోగ్యవర్తనంబు లాచరించి, వినోదగోష్ఠి నుండి విదురునిం దమ్ముల నుపలక్షించి ధర్మార్థకామంబులయం దుత్తమమధ్యమాధమత్వ నిరూపణంబు సేయుఁడు చూత’ మని పల్కిన నవ్విభునకు విదురుం డిట్లనియె. 452
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )