| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - తృతీయాశ్వాసము |
| సీ. |
‘మనుజేంద్ర! సంకల్పమునఁ బుట్టుఁ గామంబు | రూపఱు దేహ నిరూపణమునఁ బరులదోషంబునఁ బ్రభవించుఁ గ్రోధమ | క్షీణక్షమాయుక్తిఁ జేసి పొలియు భూతాస్థిరత్వంబు బుద్ధిఁ గానమి లోభ | మనఘ! జనించుఁ గాంచిన నడంగు నజ్ఞానమున మోహమావహిల్లు నధర్మ | లేపవర్జనమున లేక తక్కుఁ |
|
| తే. |
గులమునను విద్యధనమునఁ గలుగు మదము | మరలి వాని పెంపూహింప మ్రందిపోవు సాత్త్వికుఁడు గామిఁ బొడము మాత్సర్య మదియుఁ | జెడఁ గురూత్తమ సాధు సంసేవనమున. |
421 |
| క. |
ఈ యాఱింటను సకలా | పాయంబులు మానవులకుఁ బాటిలు; వీనిం బాయంగ జడియనోపిన | ధీయుతునకు శుభము సద్గతియు సమకూరున్. |
422 |
| క. |
ఇవి దోఁడేళుల భంగిం | గవియుఁ బురుషు ధైర్యహానిఁ గనికొని; ధైర్యం బవలంబించిన నరుఁ జే | రవు; వీనికి నిదియ తెఱఁగు రాజవరేణ్యా! |
423 |
| తే. |
అధిప! యివి ధార్తరాష్ట్రులయందుఁ జాలఁ | గలిగియుండు; నీ బుద్ధి నొక్కండుఁ జొరదు; సారధీరతా సంప దుదారమతివి | గాన యింకను నిర్జింతు వీని నెల్ల. |
424 |
| వ. | అని వెండియు. | 425 |
| క. |
హింసావిహారి యైన నృ | శంసుం డీ యాఱుఁ గలుగు జనుకంటెను గీ డంసప్రదేశలలితో | త్తంసీ కరణోపలాల్య ధరణీ వలయా! |
426 |
| క. |
మే లనుభవించుఁ జుట్టము | లాలోకింపంగఁ గుజనుఁ డదియు నృశంసా శీలమ; పంచి కుడుచు నతఁ | డే లోకంబుననుఁ బేర్మి యెసఁగ సుఖించున్.’ |
427 |
| వ. | అని చెప్పి వెండియు. | 428 |
| ఆ. |
‘విను కుటుంబ భృత్యజన జీవనంబుఁ ద్రి | వర్షములకుఁ గల్గువాఁడు నధిక మొదవినట్టి యతఁడు నుర్వీశ! యర్హులు | మాననీయ సోమ పానమునకు. |
429 |
| క. |
క్రతువు లొనరించు భూసుర | తతికిఁ గ్రియాశేష యోగదానాదులు దు ర్గతిఁ గొఱఁత వడిన ధరణీ | పతి నెఱపఁగవలయు వానిఁ బరికించి తగన్. |
430 |
| క. |
ధనధాన్య పశు సమగ్రుం | డనఁ బరఁగెడునట్టి వైశ్యుఁ డధ్వరముం జే యనినాఁడు బ్రాహ్మణాధ్వర | మునకు నతని సొమ్ము రాజు పుచ్చి యిడఁదగున్. |
431 |
| క. |
కుడువక పెట్టక శూద్రుఁడు | కడునెక్కుడు గూర్చినట్టి కనకముఁ గొలుచుం బుడమిపతి ధర్మకృతులకు | నిడునది సగము గొని మేదినీశ్వరవర్యా! |
432 |
| క. |
విను విప్రులు పేద లగుట | మనుజేంద్రుఁడు బుద్ధిలేమి మాతాపితృ భా వన నతఁడు వారిఁ బ్రోచినఁ | గను మేలున కెల్ల గలదె కౌరవనాథా! |
433 |
| క. |
ఆమద్రవ్యము మణియును | రామయు శుచు లగుటఁ గాదె రామారత్నా రామత దగవగు దుష్కుల | మై మెచ్చమి దోఁచెనేని ననిరి మునీంద్రుల్. |
434 |
| క. |
అమృతము విద్యయుఁ బరమహి | తము సేయుటఁ బుచ్చికొండ్రు దానిని దానిన్ సుమతులు విషము వలన నై | న మహీశ్వర! నీచమగు జనముచే నైనన్. |
435 |
| క. |
భూపాలక! విను పంచమ | హాపాతకకరులుఁ బతితు లక్కీడులఁ బ్రా ణాపాయాంత ప్రతికృతిఁ | బాపుదు; రత్యధిక పుణ్యపరతను బాయున్. |
436 |
| క. |
యానాసనాన్నపాన వి | ధానాదులఁ బతితు బెరసి తాఁ బతితుఁ డగున్; మానవుఁడు దపోముఖ ధ | ర్మానుష్ఠానములఁ బాచు న క్కిల్బిషమున్. |
437 |
| క. |
అనృతము పాతక మగు; నై | నను వనితల యెడను, బెండ్లి, నవ్వున మృతి వ చ్చిన సర్వధనముఁ జెడు చో, | విను మది పాపంబు గాదు విమలచరిత్రా! |
438 |
| క. |
ఏ పాపమేని లేనిది | కాపురుషత నొకనిమీఁదఁ గలిగించిన న ప్పాపము సేసినవాఁ డగు | నా పొలువ యనంగ విందు మార్యులచేతన్. |
439 |
| ఆ. |
తల్లిఁ దండ్రిఁ బాయఁ దగ ద కారణమునఁ | బాసెనేని వాఁడు పతితుఁ డాస నంబు సెజ్జ భోజనము చీర వటుకుమా | రులకుఁ బ్రీతి నొసఁగఁ బొలియుఁ గీడు. |
440 |
| వ. | అనియె; నట్టియెడం గృపాణరణ నిపుణుండగు నకులుండు సకలాస్త్రశస్త్ర సారవిశారదుండైన యబ్భాగీరధీసుతునకు సవినయంబుగాఁ బ్రణమిల్లి ‘ధను వుత్తమాయుధం బని చెప్పుదు; రది సర్వజన సమ్మతంబు; ధనువునకు బాణంబులకు వైకల్యంబు వాటిల్లినయెడం బరవీరప్రహరణంబునకు నాత్మత్రాణంబునకుం గృపాణంబు మేలని యుండుదు; నా తలంపెట్టిదియో తెలిసికొనవలయుఁ; దత్ప్రభవ ప్రభావంబులుం దదీయ పూర్వాచార్యునిం జెప్పవే’ యని యడిగిన. | 441 |