| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - తృతీయాశ్వాసము |
| వ. | ఆ దుర్బ్రాహ్మణుండు దనరేపటి పయనంబునకు నాహారంబు చింతించి ‘యిమ్మహాబకంబు శరీరంబు గ్రొవ్వియున్నది; దీనియందు మాంసంబు సాలం గల; దిది యేమఱి నిద్రవోయెడుఁ; జావనడిచి చెండికొని పోయెదంగాక!’ యని పాపనిశ్చయుండై చీర సక్కంగట్టికొని యొక్క కాష్ఠంబు గర యుగంబునం జిక్క నమర్చికొని. | 497 |
| క. |
అందంద మెడయుఁ దలయు న | మందాటోపమునఁ బెక్కు మాఱు లడిచి చావుం దెలియఁ జూచి యలరెడు | డెందముతో నీఁకలన్నిటిని వెస నూడ్చెన్. |
498 |
| తే. |
ఊడ్చి బొండువు వ్రచ్చి ప్రేవురివి నంజు | డంతయును బుచ్చి పొదుకగా నమరఁ గట్టి కొనుచు వేగుఁ బోకగుటయుఁ జనియె; నట్టి | సమయమున మేలుకని దనుజప్రభుండు. |
499 |
| క. |
‘పొల వలచె నేమి గీడొకొ | కలిగెడు!’ నని తలఁచి మనసు గలఁగఁగఁ దనవా రలతోడ నుగ్గడించుచుఁ | జలియించుచునుండఁ బ్రొద్దు జామెక్కుటయున్. |
500 |
| వ. | రాజధర్మునిం దలంచి. | 501 |
| ఉ. |
నిచ్చలు వచ్చు రేపకడ నెయ్య మెలర్పఁగ మత్సఖుండు; నేఁ డిచ్చటి కేల రాఁడు? గుణహీనత విప్రునియందుఁ గల్మి నా యిచ్చఁ దలంచితిం; దులువ యేమి దలంచెనొ? యక్కటా! మదిం బొచ్చెము లేదు నమ్ము బకపుంగవుఁ; డెట్లగు నొక్కొ దైవమా! |
502 |
| క. |
అని తూరవగచి యారయఁ | బనిచెం బనిగఱపి భటులఁ బలువుర వారుం జని బకము డొక్క యేర్పడఁ | గని యతనికిఁ జెప్పి పుచ్చి కడు వేగమునన్. |
503 |
| వ. | అవ్విప్రుని చొప్పువట్టి. | 504 |
| చ. |
పరిమెయిఁ బాఱి వానిఁగని పట్టి వడిం బెడగేలు గట్టి తె చ్చి రసురభర్త సూచి ‘యిటు సేరఁగఁ దేవల దీ కృతఘ్నునిం; బొరిగొని వే తినుం’ డనినఁ బోకడ మాలిన వార మయ్య! యి ద్దురిత శరీరముం దినఁగ దోసము మా’ కని వార లొల్లమిన్. |
505 |
| వ. | అతండు. | 506 |
| క. |
‘తినుఁడు తినకుఁ; డొం డేమై | నను జేయుఁడు; వీని నేల నా ముందటికిం గొని వచ్చితి?’ రని పలికిన | దనుజులు పురి వెడలఁ దెచ్చి తద్గాత్రంబున్. |
507 |
| క. |
వెడ గోఁతల నెత్తు రొలుక | బడఁ ద్రోచిన వచ్చి కుక్క పదుపు వెనుకకున్ జడిసెఁ గబళింప నొల్లక | కడుపులు నకనకఁ బడంగఁ గౌరవముఖ్యా!’ |
508 |
| వ. | అని చెప్పి భీష్ముండు. | 509 |
| క. |
‘విను మది యట్టిద; కుక్కలుఁ | దినగా రోయుం గృతఘ్ను దేహము మాంసం బని చెప్ప నాగమంబులు | మనుజేశ్వర! తెల్లమయ్యె మన కిచ్చోటన్.’ |
510 |
| వ. | అని పలికి వెండియు నిట్లనియె. | 511 |
| క. |
పురపురఁ బొక్కుచు బకపతి | కరంకముం దేరఁ బనిచి గారవమున నె య్యురుఁ దాను నగ్ని యిచ్చి య | సురపతి యున్నంత వచ్చె సురపతి నెమ్మిన్. |
512 |
| క. |
కని యతఁడు సంభ్రమంబును | వినయంబును బెరయ గారవించి యడిగె నా తని ‘రాజధర్ము నీవే’ | యని దైన్యము దోఁప వగచి యశ్రులు దొరఁగన్. |
513 |
| వ. | అడిగిన నమరవిభుండు ‘నీ సఖుండు చతుర్ముఖునకు సఖుం డగుట యెఱుంగవే? వానికి వగవనేల? యవ్వారిజాసనుండు దనపాలికి ననుదినంబు వాఁడు వచ్చుటం గోరుచుండుం గావున. | 514 |
| క. |
పలుమాఱును రామికి ను | త్తలపడియెను; దాన నిట్టి దశ నతఁ డొందెం; జెలి యగుట నితని డొక్కకు | నలఘువిథిన్ వహ్ని యిచ్చి తది మేల కదా! |
515 |
| వ. | అ ట్లగ్నిసంస్కారంబు సేసి నీవు వచ్చిన యనంతరంబ తచ్చితాసమీపంబున. | 516 |
| క. |
కడు నర్మిలిఁ గ్రేపుం జను | గుడుపఁ దొడఁగె నొక్క సురభి గుఱుపా ల్బెరయం బడు వత్స వక్త్ర ఫేనము | సుడిగాలిం దూలిపడియె సొదపై ననఘా! |
517 |
| వ. | దానంజేసి యన్నాడీజంఘుండు సంజీవితుం డయి యెప్పటియట్ల యొప్పెడు నాకారంబుతో నరుగుదెంచుచున్నవాఁ; డి ట్లగుటకుం గారణంబును నద్దేవుని దివ్యచిత్తంబు మహానుభావంబ.’ | 518 |
| క. |
అని చెప్పె నంత బకపతి | సనుదెంచెను దనుజపతికి సమ్మద మెసఁగన్ మును వాసవుఁ డజువాక్యము | నన పాశ నిబద్ధుఁ జేసినాఁ డవ్విప్రున్. |
519 |
| క. |
ఆ నాడీజంఘుండును | దాని నెఱిఁగి భూసురునకుఁ దనకతమున న ద్దీనదశయగుట కోర్వక | వాని విడుపు గోరి వేఁడె వరముగ నింద్రున్. |
520 |
| చ. |
అతఁడును దివ్యబోధమున నా సమయంబున బ్రహ్మ సత్కృపా న్వితుఁ డగు టేర్పడం గని వినీతతముం డగు రాజధర్ము వాం ఛిత మొనరించె విప్రునకుఁ జేర్చిరి తెచ్చినవారు తద్ధన ప్రతతియు దైత్యనాయకుఁడు పంప బకాధిపుఁ బ్రస్తుతించుచున్. |
521 |
| వ. | అవ్విప్రుండు ధనసంచయంబు మోచికొని మరలి మరలి చూచుచు సంభ్రమంబునం బోయెఁ; దదనంతరంబ. | 522 |
| క. |
సురపతియుఁ ద్రివిష్టపమున | కరిగె; బకాధీశుఁడును నిజాలయమునకున్ గరిమంబు మెఱయఁ జనియెం | బరితుష్టుం డగుచు దైత్యపాలుం డనుపన్.’ |
523 |
| క. |
అని చెప్పి తాత యిట్లను | మనుమనితో నాదరమున మఱియును ‘బ్రహ్మ ఘ్నునకును నిష్కృతి గలుగును; | వినుము కృతఘ్నునకు లేదు విమలచరిత్రా! |
524 |
| క. |
ఆరయ మిత్త్ర ద్రోహము | దారుణమగు పాతకము గృతఘ్నత కంటెన్; వైరము గొని విడువవలయు | నా రెండు దెఱఁగుల వారి నాప్తుల నైనన్. |
525 |
| క. |
మిత్త్రుం డైహికములు నా | ముత్త్రికములు నైన భద్రములు దలకొలుపున్; మిత్త్ర ధనంబులలోనను | మిత్త్రుఁడ యెక్కు డనుమాట మెత్తురు ప్రాజ్ఞుల్. |
526 |
| క. |
ఉత్తమ కులజుఁడు సుగుణా | యత్తుఁడు సస్నేహమతియు నగు మిత్త్రునకుం చిత్తమెలర్చు తెఱంగునఁ | బొత్తు మనఁగవలయు శుభము పొందవలసినన్.’ |
527 |
| వ. | అని యిట్లు కృతఘ్నతయు మిత్త్రద్రోహంబును నధిక పాతకంబు లగుటయు సన్మిత్త్రుఁ బాటించుట శుభంబు చేయుటయు భీష్ముండు భీమాగ్రజునకుం జెప్పె’ ననిన విని ‘యయ్యుత్తమ పురుషుల యడుగుటలును, నుత్తరం బిచ్చుటలును నింత లెస్సలై చెల్లెడునే? యటమీఁదఁ జెల్లిన తెఱంగు లెఱింగింపు’ మనుటయు. | 528 |