| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - చతుర్థాశ్వాసము |
| క. |
‘విను మాయావిధ మిట్టిది | యని యారయ వెరవుగలుగ దవనిం జరణం బనఘా! మోపని జంతువు | సను చొ ప్పరయంగ రాని చందం బొందున్. |
190 |
| క. |
గుణమూర్తి మాయ దానిని | గణుతించెద నన్నఁ దెగడు; గ్రాహ్యత్వంబున్ గుణములఁ బెడఁబాపంగా | గణనాతీతమగు వెలుఁగు గనుఁ దాన తనున్. |
191 |
| తే. |
వినుము నృప! సత్త్వమును రజస్సును దమస్సు | ననఁగ గుణములు ముప్పిరిగొనుచు నాత్మఁ జుట్టుకొను నొండుమొయిఁ దెగ విట్టలముగ | నొలయు వైరాగ్య మను కొడవలిన కాని.’ |
192 |
| వ. | అని నిర్దేశించి వెండియు. | 193 |
| ఆ. |
‘మణిమయములుఁ గనకమయములు రజతమ | యములు మఱియు మృణ్మయాదికములు నైన పెక్కుపూసలందుఁ ద్రాడున్నట్లు | భూతకోటియందుఁ బురుషుఁ డుండు. |
194 |
| క. |
ఏకరసమయ క్షేత్ర మ | నేకౌషధి రసమయం బయినయట్లు సుమీ యేకవిధమైన బుద్ధి య | నేకము లగు కర్మములమెయిం బోక నృపా! |
195 |
| ఆ. |
జలము పృథివికంటె, జలముకంటెను దేజ, | మంతకంటె వాయు, వాకసంబు దానికంటెఁ బెద్ద; వాని కెల్లను బెద్ద | మనసు; బుద్ధి పెద్ద మనసుకంటె. |
196 |
| తే. |
ధరణి మొదలయిన పంచభూతములకంటె | మనసుకంటెను బుద్ధికంటెను మహత్త రంబు గాలంబు; గాలతత్త్వంబు మిగిలి | యుండు విభుఁ డిజ్జగంబుల కొడయుఁ డతఁడు. |
197 |
| క. |
ఆదియు మధ్యము నంతము | నా దేవేశునకు లేమి నవ్యయుఁ డతఁ డీ వేదములకు నానావిధ | వాదములకుఁ జేరుగడ భవక్షేపి నృపా! |
198 |
| క. |
అనుభవము మ్రింగు శాంతిం | గనునది నిర్భేద సత్ప్రకాశం బది దా విను తలఁపునకును బలుకున | కు నగమ్యము, గర్మముల కగోచర మనఘా! |
199 |
| క. |
మనసు గొని, మనసు బుద్ధిం | గొని, బుద్ధిని దర్శనంబు గొని, దర్శనమున్ విను క్రమమున నొదిఁగించినఁ | గను బుధుఁ డక్షరుని విష్ణు ఘనబోధమయున్. |
200 |
| క. |
అమృతం బచ్యుత మమలం | బమేయ మవ్యయ మనంత మవ్వెలుఁగు యమా ద్యముల నలవడిన చిత్తము | శమాతిరేకమునఁ బొంద సంవేద్య మగున్. |
201 |
| క. |
అని గురుఁ డుపదేశించిన | విని మనువు గృతార్థుఁ డయ్యె విద్వన్నుత! నీ వును నలవరింపుమీ మన | మున నివ్వాక్యముల యర్థముం దత్పరతన్.’ |
202 |
| వ. | అనిన విని పరమహర్షంబునం బాండవాగ్రజుండు పితామహుం బ్రశంసించి ‘మహాత్మా! మహనీయుండగు కృష్ణుని మాహాత్మ్యంబు వినవలతుం జెప్పవే?’ యని యడిగిన నతం డమ్మహీపతితో ‘నారద జామదగ్న్య మార్కండేయ వ్యాస వాల్మీకి ప్రభృతి మునీంద్రులు సెప్ప వినిన తెఱం గెఱింగించెద నాకర్ణింపు’ మని యిట్లనియె. | 203 |
| క. |
‘కృష్ణుఁడు ప్రభవిష్ణుం డగు | విష్ణుం; డనిలాగ్నితోయవియదిలలఁ గ్రియా నిష్ణాతత్వ వినోదన | తృష్ణం గల్పించెఁ దనదు దివ్యవిభూతిన్. |
204 |
| తే. |
అట్లు కల్పించి జలములయందు భవ్య | తల్పగతుఁ డైన నాభిఁ బద్మంబు దోఁచె; నం దజుఁడు పుట్టి సృజియించె నందనుల మ | నంబునన సప్తసంఖ్యుల నరవరేణ్య! |
205 |
| వ. | మరీచియు నత్రియు నంగిరసుండును బులస్త్యుండును బులహుండును గ్రతువును దక్షుండు ననం బరఁగువారలయందు మరీచికిం గశ్యపప్రజాపతి జన్మించె; అతనివలన సురాసుర గరుడ నాగాదిజాతి సంభవంబునుం గలిగె; నతనికి సూర్యుండును నత్రికి సోముండును నుదయించి, రాజవంశంబులకుఁ గవాటస్థులైరి; సూర్య సోమాన్వయ జాతులైన నృపతు లనేకు లనేక దేశంబు లేలిరి; దేశకాల విశేషంబుల నృపకులంబులు బహుశాఖంబులై వర్ధిల్లువాని నెల్లం దన వలసిన యప్పుడు విష్ణుండు పరస్పర విరోధజనిత సంగ్రామంబులు నిమిత్తమాత్రంబులుగాఁ గల విశేషప్రకారంబుల నుపసంహరించుచు నద్దేవుండు వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్నానిరుద్ధాత్మకంబు లగు చతుర్విధ దివ్యస్వరూపంబులు గలిగి జగద్భరణం బాచరించుచు నిట్లు లీలా జన్మంబులం బొంది క్రీడ సలుపు నని కృష్ణునిం జూపి ‘ఈ భూతేశ్వరు మానుషసామాన్య దృష్టిం జూచుట యజ్ఞానంబు గృష్ణుండు భక్తపరతంత్రతం జేసి యుత్కృష్ట చరితుల యారాధనంబునకు భాజనంబయి భోగమోక్షంబులు గరుణామయ కటాక్షంబుల నొసంగు’ ననినం బ్రీతుండై భీష్మునకుం బ్రణమిల్లి యుధిష్ఠిరుండు. | 206 |
| క. |
‘మునిజన వినుత చరిత్రా! | మనుజుం డెవ్వనిఁ దలంచి మహనీయ నిరం జన సిద్ధిఁ బొందఁ గను? నే | యనువు దలఁపు నలవరించు?’ నని యడుగుటయున్. |
207 |