పురాణేతిహాసములు శ్రీమహాభారతము శాంతిపర్వము - చతుర్థాశ్వాసము
భీష్ముఁడు ధర్మజునకు విష్ణుమంత్రప్రభావంబు తెఱం గెఱింగించుట (సం. 12-200-3)
వ. ఆ ధర్మతనయుతోడ నద్దేవవ్రతుం డిట్లను; ‘నారదునిచేత వినిన తెఱంగు వివరించెద నాకర్ణింపుము. 208
తే. పరము నక్షరు విష్ణునిఁ బ్రస్తుతించి | నారద మునీంద్రుఁ డంజలి నమితమైన
మస్తకముఁ జేర్చి భక్తిసమగ్రచిత్త | వృత్తి నల్లన యిట్లని విన్నవించె.
209
క. ‘దేవా! మోక్షార్థి జనము | లే వెరవున నిన్నుఁ దలఁతు? రే జప్యము సం
భావింతురు? నా కానతి | యీవే? భక్తపరతంత్ర! యేర్పడఁ గరుణన్‌.
210
తే. అనిన నద్దేవముని పలు కాదరించి | వరదుఁ డగు విష్ణుఁ డిట్లనుఁ బరమభక్తి
నిర్మల శ్రద్ధ యింద్రియనిగ్రహంబు | మన్మయ ధ్యానమునకు నమాత్యకోటి.
211
క. విను, వీతకల్మషున కవి | పనుపడుఁ; గల్మషము లెల్లఁ బాపఁగ నా మె
చ్చిన యట్టి పరమసాధన | మనుస్మృతి జపించునది నియతిమెయి దానిన్‌.
212
తే. ప్రణవ పూర్వకమగు నమః పదము పొంత | షడ్గుణైశ్వర్య వాచక సర్వవసన
నిర్వచన శబ్దములు గ్రమనిష్ఠ మెయిఁ జ | తుర్థిఁ గూర్పంగ మంత్రంబు తోఁచు బెరసి.
213
క. తొలి తొలి యిమ్మంత్రము ని | శ్చల మానసుఁడై జపించి జపియింపంగా
వలయు; ననుస్మృతి దానం | గలుగుఁ జతుర్వర్గ సాధకత పురుషునకున్‌.’
214
క. అని మఱియు ‘దయ ననుస్మృతి | యనుపేరం గలుగుదాని నమ్మునిపతి కి
ట్లని చెప్పె నచ్యుతుఁడు నిజ | మనఃప్రియం బైన యట్టి మహితస్తవమున్‌.
215
సీ. ‘అవ్యక్తు శాశ్వతు నఖిల ప్రభవ భూమి | భక్తివత్సలు విష్ణుఁ బరమపురుషు
నక్షయుఁ బ్రాంజలియై యాశ్రయించెదఁ | బుండరీకాక్షుని భువనసాక్షి
నిత్యుఁ బురాణు వర్ణించెదఁ బరు సహ | స్రాక్షు నక్షరుని లోకైకనాథు
భవ్యుఁ గొల్చెద భూతభవ్య భవత్ప్రభు | సర్వతోముఖు భూతసంప్రవర్తి
 
ఆ. నమృతు నచ్యుతుని ననంతు హృషీకేశు | రవిసహస్రనిభు హిరణ్యగర్భు
నబ్జనాభు సత్యు నాద్యంతరహితు భూ | గర్భుఁ బ్రభువు భక్తిగమ్యుఁ దలఁతు.
216
తే. అచలు సూక్ష్ము వరేణ్యు సహస్రశీర్షు | నభయకారి నశీర్షు నారాయణుని స
నాతనుని యోగమూర్తి లోకాతిరిక్తు | ధ్రువుని నీశ్వరు హరి భక్తితోడఁ గొలుతు.
217
క. ఎవ్వఁడు సచరాచర గురుఁ, | డెవ్వని నాభీసరోజ మీనె విధాతన్‌,
నివ్వటిలు జగములన్నియు | నెవ్వనిచే నమ్ముకుందు నెప్పుడుఁ గొలుతున్‌.
218
తే. స్థావరములు జంగమములు ధాత లోను | గాఁగఁ బ్రళయంబు నొందిన కాలమునను
నిలుచు నెవ్వఁ డొకండ యానిత్యసత్య | లలితు శారిఁ బ్రపన్నుఁ గాఁ గొలుతు నియతి.
219
క. కాలముఁ బర్జన్యుండును | నేలయు సస్యంబుఁ గ్రియయు నిష్క్రియయును ధ
ర్మాలోకమునై మహిమన్‌ | లీల సలుపు వాసుదేవునిం బ్రణుతింతున్‌.
220
క. అనలునకు రవికిని శశాం | కునకును గ్రహ తారకములకును దేజం బె
వ్వనివలన నావహిల్లెడు | ననుపాధిక తేజుఁ గొల్తు నవ్విశ్వాత్మున్‌.
221
తే. నాలుగింటను వెండియు నాలుగింటఁ | రెంట నైదింట మఱియును రెంట వేల్చి
యజ్ఞశీలు రారాధించునట్టి విష్ణుఁ | డిష్టదాయి ప్రసన్నుఁ డయ్యెడును నాకు.
222
ఆ. యజ్ఞధరుఁడు పంచయజ్ఞుండు లక్ష్మి కి | నునికిపట్టు యోగమునకు నెలవు
సర్వమునకు నిష్టసదనంబుగా నొప్పు | వాని నాశ్రయింతు వరదుఁ బరము.
223
క. అగమనునిం బాంథు నఖిల | జగద్భరణపరు నమూర్తి సాగరనిభ బో
ధ గరిష్ఠుఁ బంచకాల | జ్ఞు గుణాత్మకు నిర్గుణత్వ శోభితుఁ గొలుతున్‌.
224
క. వ్యక్తమునకుఁ బ్రభవం బ | వ్యక్తం బాతత్త్వమునకు నవల యను వచో
యుక్తికిఁ బరాయణం బగు | భక్తపరాధీను భవ్య భావ్యు నుతింతున్‌.
225
క. జ్ఞాన ధ్యాన పరాయణు | లైన మహాత్ములు జితేంద్రియత్వ మహితు లె
వ్వానిం బొందిన మరలరు | వాని శరణుఁ జొచ్చి బ్రదుకువాఁడ సుకృతినై.
226
క. లోకం బంతయు నెవ్వం | డేకాంశంబునన నిర్వహించుచు నగ్రా
హ్యాకారుండై వెలుఁగు ద | యాకరు నప్పద్మనాభు నభివర్ణింతున్‌.
227
తే. అయిదు దెఱఁగులఁ బ్రకృతిఁ బంచాననముల | ననుభవించు క్షేత్రజ్ఞు సత్త్వాది గుణ చ
యంబు లీల భుజించు మహత్త్వ కలితు | సంశ్రయింతు మదాత్మ ప్రసక్తిఁ గోరి.
228
క. మతి గల సాంఖ్యులు, యోగా | న్వితులు నగుమహాత్ము లెవ్వనిం గని పున రా
గతిలేని సుగతి వడయుదు | రతర్క్య వైభవునిఁ దలఁతు నప్పరమాత్మున్‌.
229
క. ఇనునడుమ వెలుంగుచు సో | ముని మధ్యమునం జలత్వముం బొందని ని
ప్పున వెలయు దీప్తి యగు వా | ని నిరంజను నంతరాత్మునిం బాటింతున్‌.
230
క. సోమార్కాగ్నిమయముఁ దా | రామయమును నిత్య సుస్థిరంబును నగు తే
జోమయతత్త్వము నాత్మా | రామత్వంబున నిరంతరంబును జూతున్‌.
231
క. గుణములకు నాదియై ని | ర్గుణమ్ములకు నాద్యుఁడగు నరూపుని లక్ష్మీ
ప్రణయవరు నజుని సూక్ష్ము నిఁ | బ్రణుతింతుఁ బ్రసన్నుఁగాఁ బరము సర్వగతున్‌.
232
క. కలయంగ నెల్లయెడలం | దలలును లోచనములును వదనములు నగు ని
ర్మలు నిర్వికారు నిన్నుం | గొలిచెద సర్వైకసాక్షి గోవింద హరీ!
233
క. నిను నెఱుఁగకున్న సంసా | ర నిమగ్నత వోదు; గోచరము గావు మనం
బునకు నఖిలేంద్రియములకు | నను నేమనువాఁడ నిఁక నారాయణుఁడా!
234
క. రోషముఁ గామము రాగ | ద్వేషములును లేక భక్తి తిరమై యేకా
శ్లేషిణిగాఁ గొలుతు రవి | శ్లేష మనోనిలయ వృత్తి సిద్ధులు నిన్నున్‌.
235
క. ఫలములు గోరక కర్మం | బులు నడపుచు వాని విమలబోధాగ్నిహతిం
బొలియించుచు నిర్ద్వంద్వత | నెలకొను నేకాంతిజనులు నినుఁ గండ్రు హరీ!
236
క. దేహస్థు నదేహు నఖిల | దేహిసమున్‌ నిన్ను భక్తిఁ దెలుతురు దురిత
వ్యూహమ్ముఁ బుణ్యచయము న | మోహత నిరసించు యోగిముఖ్యులు కృష్ణా!
237
చ. ప్రకృతియు, బుద్ధ్యహంకృతులు, భావము, భూతచయంబు, నింద్రియ
ప్రకరముఁ గేశవా! భవదుపాశ్రయ భాసిత వర్తనంబు; లా
సకలమునందు నీవును బ్రసన్నత ని; ల్తవి నీకు, నీవు వా
నికి నిలువంగఁ బట్టగుట నిక్కముగా నిటులై వెలుంగవే?
238
క. ఏకత్వం బన్యత్వ మ | నేకత్వము గలుగు నీ మహిమ చందం బా
లోకింప నిపుణులగు సు | శ్లోకులకుం బరమపదము సులభము శార్‌ఙ్గీ!
239
తే. అచరములును జరంబులు నైన భూత | సముదయంబులు మణులు సూత్రమున నున్న
కరణి నీ యంద యున్నవి గాన సమత | నేక భక్తి నేఁ గోరెద నిమ్ము దేవ!
240
క. హేతురహితుఁడవు, కర్తవు, | భూతస్రష్టవు, సమస్తభోక్త, వతత్త్వం
బై తత్త్వము నగుదు జగ | న్నేతవు కూటస్థుఁడవును నీవ ముకుందా!
241
సీ. ద్వేష్యంబుఁ బ్రియ మను వేర్పాటు లేదు, భూ | తములయం దెల్లను సముఁడ నాకు
భూతసంయోగంబు బుద్ధ్యహంకార యు | క్తియు గుణత్రయసంగతియును లేవు
ప్రారంభణంబు ధర్మాధర్మములు నింద్రి | యముల పొందును విషయాభిరతియుఁ
బరిహృతంబులు జరామరణమోక్షార్థి నై | శరణంబు వేఁడెదఁ గరుణ నాదు
 
తే. ఘ్రాణజిహ్వలు మహి నుదకమున దృక్కు | త్వక్కు దేజంబునందును వాయువునను
శ్రోత్ర మాకాశమునఁ గ్రమసూత్రితముగఁ | బొందఁ జేసి గోవింద! యానంద మిమ్ము.
242
సీ. ఇల జలంబుల జలంబులు, శిఖి శిఖి, వాయు | వున వాయు, వంబరంబునను నంబ
రంబు, చిత్తమునఁ జిత్తం, బహంకృతి నహం | కృతి, బుద్ధిఁ దగ నొదిఁగించి యింత
వట్టును గూడ నవ్యక్తంబుఁ జేర్చి య | వ్యక్తంబు నిజభంగి యైనఁ ద్రిగుణ
సామ్యవ్యవస్థితి సడిసన్నఁ గారణ | భూత తన్మాత్రలు పొదువకుండఁ
 
తే. దొలఁగఁ బెట్టుట దొరకొనవలయు దానఁ | బరమమున కేవలము నగు పదము గలిగి
యేన నీ వను నైక్యంపు టెఱుక వొడముఁ | గాత గమనాగమనములు గ్రాఁగి పోవ.
243
క. హరియం దేనును నాయం | దరయంగా హరియుఁ గలము; హరి నాకును నా
హరి కేను ననశ్వరులము | హరిప్రసాదోదయము మహత్తర మహిమన్‌.
244
తే. బుద్ధియును బ్రాణమును నిన్నుఁ బొరయఁ జేయఁ | జాలు భక్తి నా కొసఁగుము జలధిశయన!
పూర్వ కర్మఫలంబులు పొందుఁగాక!; | యవి ఋణంబులు గడతేఱుటై సుఖింతు.
245
తే. నిన్ను నెప్పుడుఁ దలఁచెద; నన్ను నీవు | వత్సలుఁడ వయి వీఁడు నావాఁ డనంగ
వలయుఁ జుమ్మయ్య! మఱవక వాసుదేవ! | దేవ దేవ! మునీశ్వర భావనీయ!
246
క. తనుఁ దనయంద నిలిపి పే | రనువున బుద్ధికడ వెలుఁగు నచ్యుతుని సనా
తను నగ్రాహ్యునిఁ జిన్మయు | ననుస్మరించునది యపునరావృత్తికినై.
247
క. పరమాత్ముని నారాయణుఁ | జిరంతనుని భక్తశేముషీనిష్ఠా స్వీ
కరణైకాయనుని నమ | స్కరణంబునఁ దలఁతు నతుల షడ్విధభూతిన్‌.’
248
తే. అని జపించి సర్వావస్థలందు నను వి | శిష్టభక్తి ననుస్మరించిన యతండు
సకల పాపంబులను బాసి శాంతి నొంది | యవ్యయానంద పదమున నతిశయిల్లు.
249
తే. వైష్ణవియుఁ గల్మషవ్రజధ్వంసినియును | నైన యీ యనుస్మృతి ప్రాజ్ఞుఁ డైన నజ్ఞుఁ
డైన నెవ్వాఁడు పఠియించు యజ్ఞదాన | సమయముల వాఁడు తత్ఫలశతము వడయు.
250
క. సురపితృపూజలఁ బావక | పరిచర్యలయందు నన్ను భక్తిఁ దలఁచుచుం
బరమనియతి నివ్వాక్యో | త్కరముఁ బఠించిన యతండు గనుఁ బుణ్యగతిన్‌.
251
క. వినుపించునది యనుస్మృతి | నను భక్తిం గొలుచు బహుజనముల కమావా
స్యను బున్నమ బారసిని స | వినయంబుగ దాననెల్ల విభవము గలుగున్‌.
252
క. జనము లనుస్మృతిఁ జదువఁగ | విని మ్రొక్కిన యంత్యజునకు విశ్రుతగతి గ
ల్గు ననిన సద్భక్తి జపిం | చిన యుత్తమజాతిజునకుఁ జెప్పఁగ నేలా?
253
ఆ. అఖిల కర్మఫలము నంతవంతంబు మ | ద్భక్తులకు ననంతపదము గలుగు
నట్టు లగుటఁ దలపు మమర మునీంద్ర! ని | న్నది మదీయపదమహార్థిఁ జేయు.
254
క. జ్ఞానము గేవలకృప న | జ్ఞానికి నుపదేశ విధిఁ బ్రజనితము సేయం
గా నది సకలధరిత్రీ | దానంబునకంటె నధికతరఫలద మగున్‌.
255
క. కావున నీకేఁ జెప్పిన | యీ విధ మంతయును శుద్ధహృదయులకుఁ గృపా
శ్రీ వెలయఁ జెప్పుమీ! పు | ణ్యావహశీలురకు సులభమగు సర్వంబున్‌.
256
తే. అశ్వమేధ సహస్రంబు లాచరించి | పడయరాని మహోన్నత పదము నస్మ
దీయ భక్తిరసైక పరాయణుండు | వడయనేర్చు సుకరముగ బ్రహ్మపుత్ర!
257
సీ. అని చెప్పె నిట్టు లయ్యనిమిష మునిపతి | యడుగంగ శంభుఁ డెయ్యది సమాద
రంబున నెఱిఁగించె రాజవంశోత్తమ! | తెల్లంబుగా నది యెల్ల నీకుఁ
జెప్పితి; నేకాగ్రచిత్తుండవై పర | మాత్ము న న్నారదునట్ల భక్తి
సంభృత శ్రద్ధానుషంగ తాత్పర్యంబు | తోఁ దలంపుము కృతార్థుండ వగుదు;
 
తే. పరమ వరద రహస్యానుభావ పూజ్య | మానమూర్తి యనుస్మృతి దీనిజపము
బుద్ధిఁ బెనుచు, దుఃఖంబులఁ బోవఁ ద్రోచు, | బంధములఁ బాపు, నిత్యశుభంబు నొసఁగు.’
258
క. అని భీష్ముం డుపదేశిం | చిన విని యానందభరిత చిత్తుండై పాం
డు నృపాత్మజుఁ డప్పుణ్యా | త్మునకుం బ్రణమిల్లె వినయమునఁ దనువొప్పన్‌.
259
వ. ఇట్లు ప్రణామంబు సేసి యాధరణీవరుండు గురుపితామహుతో ‘మోక్షమార్గ బోధన ప్రపంచం బుపదేశింపవే?’ యని యడిగిన నతండు వార్షే ణ యాధ్యాత్మం బను నితిహాసంబుగల ‘దా తంత్రంబు నీ యడిగినదియైయుండు’ నని పలికి ‘వినుము వార్షే ణ య నామధేయుం డగువాఁడు. 260
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )