| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - చతుర్థాశ్వాసము |
| క. |
మానితముని యొకఁడు సుఖా | సీనుండై యున్న నతని శిష్యుఁడు వినయం బూని నిలిచి ‘మోక్షము తెరు | వానతి యీవే దయామయా! నా’కనుచున్. |
261 |
| వ. | పాదములకుం బ్రణమిల్లినఁ బ్రబోధమహితాత్ముం డగు నమ్మహాత్ముండు. | 262 |
| ఆ. |
‘భక్తి గలవు నాకుఁ బ్రజ్ఞాన ఘనుఁడ; వ | ట్లవుట నీవు యోగ్యుఁడవు కుమార! సదుపదేశమునకు సమవధానుండవై | వినుము నాదువాక్యవృత్తి తెఱఁగు.’ |
263 |
| వ. | అని పలికి యిట్లనియె. | 264 |
| తే. |
‘కాలచక్రంబు నిరవధికంబు; దీని | సర్గములుఁ బ్రళయంబులుఁ జనుచునుండుఁ; బ్రళయమునఁ బరమాత్ముఁడు ప్రకృతిఁ బొంది | యఖిలమును సృజియించుఁ గల్పాదియందు. |
265 |
| తే. |
భూతజాలంబుతో మునిపుంగవులును | దోఁచి మును ప్రళయంబునఁ దోఁ పడంగి చనిన సర్వవేదంబులు శాస్త్రములును | బడసి రద్దేవు దివ్యానుభావమునను. |
266 |
| క. |
న్యాయా ద్యనేక తంత్రము | లా యంచితమతు లొనర్చి యఖిల జనాను ష్ఠేయాచారములుఁ బరి | జ్ఞేయములుగ విశదభంగిఁ జేసిరి పుత్రా! |
267 |
| క. |
అవి వినఁగ నెఱుఁగఁ జేయను | నవుఁ బరమబ్రహ్మబోధ; మమరులకు ముని ప్రవరులకును దుర్లభ మ | య్యవగతము జనార్దనునక యలవడియుండున్. |
268 |
| ఆ. |
సకల దుఃఖ భేషజం బగు నత్తెరు | వప్పురాణపురుషు నగ్గలంపుఁ గరుణ నతనివలనఁ గనిరి మునీంద్రులు | గ్రమముతోడ నర్హగమ్య మయ్యె. |
269 |
| క. |
చైతన్యశక్తిఁ బురుష స | మేతత్వవిశేషమున వహించుఁ బ్రకృతి; త జ్జాత యగును బుద్ధి; తదు | ద్భూత మహంకార; మదియుఁ బొరయుం జిత్తున్. |
270 |
| క. |
కలిగె విను మహంకారము | వలన నభము, దానఁ జేసి వాయువు, గ్రమసం కలిత జననములఁ దేజము | జలము నిలయుఁ దత్తదాత్త జన్యత్వమునన్. |
271 |
| వ. | బుద్ధికి మహ త్తను తత్త్వనిర్దేశంబును గలిగియుండు. | 272 |
| క. |
వికృతులు మహదాదిక స | ప్తక ముభయ విధేంద్రియములు పదియు విషయ పం చకమును మనసును గూడఁగ | వికారషోడశక మిది వివేకాభ్యర్థీ! |
273 |
| క. |
ఈ సర్వము దేహత్వా | భాసిత; మిది దేహియైన పరమాత్ముని వి న్యాసమునకుఁ గా నొదవి యు | పాసించుం గరణరూపమై యా కర్తన్. |
274 |
| తే. |
పుత్ర! వినుము నవద్వార పుణ్యపురము | నం దచింత్య సంవ్యాపకుఁ డై శయించు నీ సమస్త భావంబుల నెనసి యట్టు | లగుటఁ బురుషుండు నాఁ జను నవ్విభుండు. |
275 |
| క. |
అమరుం డవ్యయుఁ డజరుం | డమేయుఁ డమలస్వభావుఁ డప్పురుషుఁడు దే హమున మహీజమునం దన | లమున్న గతి నుండు మథనలక్ష్యుం డగుచున్. |
276 |
| ఆ. |
వినుము! యోగమథనమునఁ దోఁచు నత్తేజ; | మది ప్రబోధసాంద్ర, మఖిల భూత గణసమాశ్రయంబు గావున శ్రవణ ద | ర్శన ముఖక్రియాకరంబు దాన. |
277 |
| క. |
భూతము లవ్యక్తంబున | జాతములగు; నంద పెరుఁగు సమయుఁ; దదీయ స్ఫీతత్వమునన పురుషుం | డే తద్విధ సాక్షితాసమిద్ధుఁడు వత్సా! |
278 |