పురాణేతిహాసములు శ్రీమహాభారతము శాంతిపర్వము - చతుర్థాశ్వాసము
భీష్ముఁడు ధర్మజునకుఁ గాలచక్రప్రభావం బెఱింగించుట (సం. 12-204-7,8)
ఆ. వ్యక్త సప్తధార మవ్యక్త నాభంబు | షోడశకవికార సుపరిమండ
లంబు ధ్రువ మధిష్ఠితం బాత్మచేతఁ జ | క్రంబు దిరుగుచుండుఁ గాలవశత.
279
క. ఈ చక్రంబున సకల చ | రాచరమయ మైన లోక మవశానిష్ఠా
గోచరమై చరియించుట | సూచికొనన్‌ వలయుఁ దత్త్వశోధన దృష్టిన్‌.
280
తే. పొందు సత్త్వరజస్తమంబులు విశుద్ధు | నంతరాత్మఁ బాంసువ్రాత మనిలుఁ జెందు
నట్లు సద్వివేకమునఁ దదంతరంబు | బుధుఁడు గాంచి యగ్గుణములఁ బొరయకుండు.
281
క. వేదాంతవిదుఁడు దుర్లభుఁ | డాదరము ప్రవృత్తి లక్షణాన్వితమగు ధ
ర్మోదయమంద కలుగు నది | లే దరయ నివృత్తి సౌఖ్య లీనత్వమునన్‌.
282
క. ఆర్యులుఁ బ్రవృత్తి లక్షణ | కార్యంబులచేతఁ జేసి గ్రాహ్యము నగు త
ద్ధుర్యత్వ మందు విడువర | నార్యములగు మదనమద భయక్రోధాదుల్‌.
283
తే. వినుము దేహాభిమానికి వీని నెల్లఁ | దొఱఁగ దొరకొన దెంత శాంతునకునైనఁ
గాన ఏమిట దేహాభిమాన మెడలు | నట్టి చూ పభ్యసించు వేదాంతవిదుఁడు.
284
ఆ. అడవి సొచ్చి యంతకంతకు నవులకు | నతికుతూహలమున నరిగి యరిగి
చూచుచుండునట్లు సూవె సంసార కా | ననము నందుఁ దిరుగు జనుల నడపు.
285
క. విను తెవు లుడుపఁగ భేషజ | మునకుం దలకొనిన చందమున మది సత్యం
బును శౌచము శమమును దమ | మును నెలకొలుపంగవలయు మోహచ్యుతికిన్‌.
286
తే. భూమి మొదలుగఁ గల భూతములకు నింద్రి | యముల కన్నింటికిని సత్త్వ మాదియైన
గుణములకు నెల్ల జగములకును దదీశ్వ | రునకు నరయ నహంకార మునికిపట్టు.
287
తే. స్మృతియు సంప్రీతియును బ్రసన్నతయు మఱియు | నీదృశములును సత్త్వగుణోదితములు
రాగలోభ రోషాదులు రాజసములు | దర్పశోక ప్రముఖములు దామసములు.
288
క. జ్ఞానమునకు నగ్గుణసం | తానం బడ్డంబుగాన తత్ప్రతిహతికై
పూని మును సాత్త్వికమునను | మానస మూన్పంగ వలయు మహనీయధృతిన్‌.
289
క. విను సాత్త్వికములు మది నెల | కొని రాజసతామసములకును వినతత్వం
బొనరించుఁ బదంపడి స | త్వనిరూఢత బోధసంపదకు హేతు వగున్‌.
290
తే. క్రియ లహంకారమునఁ గల్గుఁ గ్రియలవలన | దేహసంబంధ మెడలక తిరుగవలయు
జన్మపర్యాయములయందు జన్మ మనఁగ | మిళితనవశుక్లశోణితకలితవృత్తి.
291
ఆ. మూత్రమునఁ బురీషమున నూనుచును గర్భ | మునఁ బ్రవర్ధనమ్ముఁ బొంది వెడలి
సంతతానుబంధ సంసార దుఃఖ ని | ర్మగ్నుఁ డగుచు నుండు మానవుండు.
292
క. ఇంతకు మూలము దృష్ణా | తంతులతయ వత్స! వినుము దానికి నడరం
గాంతాజనంబు దొలు ప్రాఁ | కింత యెఱిఁగి తృష్ణ తొఱఁగు టిచ్చు విముక్తిన్‌.
293
క. జ్ఞానాజ్ఞానంబులకుం | దాన యుపాశ్రయము బుద్ధి తత్త్వాహంకా
రానూన లక్షణాఢ్యం | బైన యెఱుక దాని జీవుఁ డని చెప్పు శ్రుతుల్‌.
294
ఆ. అతఁడు కాలకలిత మైన కర్మమున సం | సార వర్తనంబు సల్పుచుండు
స్వప్న సంప్రవృత్తి సలిపెడు నరుమాడ్కి | నింద్రియములతోడ నెనయ బెరసి.
295
క. రాగ పరిలిప్తమానస | యోగంబున నింద్రియంబు లుల్లసితము లై
భోగు లగుట యుడిపిన నప | రాగత సంసార దుర్విరామము సేయున్‌.
296
క. పురుషు లఖిల భూతములను | బురుషులలో భూమిసురులు భూమిసురులయం
దరయంగ మంత్రవేదులు | వరు లధికులు బోధయుతులు వారలకంటెన్‌.
297
క. జ్ఞానంబు దృష్టి నరునకుఁ | గాన నయనహీను నడపు కరణి యగుటఁ బ్ర
జ్ఞాన విహీనుని నడవడి | దీని నెఱుఁగ వలయు నెఱుక దెచ్చికొనంగన్‌.
298
క. క్షమయును సత్యంబును శౌ | చమును సుధర్మములు! బ్రహ్మచర్యం బత్యు
త్తమ ధర్మము; వానికిఁ జి | త్తము నలవఱుపంగవలయు ధైర్యము పేర్మిన్‌.
299
క. పరిహాసము భాషణమును | నిరీక్షణము లోనుగాఁగ నింద్యంబులు సుం
దరులయెడ దీని కేమని | చొరఁదగ దట్లైన మనసు సొత్తురు సుదతుల్‌.
300
క. విను మాంసాస్థిమయం బని | వనితాంగము సద్వివేక వైభవమునఁ గాం
చిన నందు మది దగుల; దా | పనికిని నాడీ విశుద్ధి ప్రాపగుఁ బుత్రా!
301
క. శారీరస్థితికిఁ బ్రథమ | కారణమై యుండు నాడికాదశకము; సం
చారిక లగు నింద్రియముల | కారయ నాడికలు మఱియు నై దమలమతీ!
302
తే. స్థూల భంగులు పదియును సూక్ష్మ భంగు | లైదు నివి; వీనికంటె నత్యంత సూక్ష్మ
భంగి హృదయంబు నడుముగాఁ బరఁగియున్న | నాడియది సర్వగత యగుఁ జూడఁ జూడ.
303
క. ఆ చూపు మరిగి చిత్తం | బే చవికిం బోదు; పోయె నేని మరలుపన్‌
గోచరమగు వెలిచవులం | బాచిన లోచవిన నిలిచి పరమాత్మఁ గనున్‌.
304
క. ఆ విధము శుక్లగతి గను | భావమునకుఁ గాని పట్టువడదు; వినుము! శు
క్లావేశము సంకల్పజ | మావాసము శుక్లమునకు నఖిలాంగకముల్‌.
305
క. అరయఁగ సంస్పర్శనమునన | తిరుగుడువడు శుక్ల మనుట తెఱఁగే? సంక
ల్పరతింగలదే? చోఁకెడఁ | జరింపకుండంగ వలయు సంకల్పంబుల్‌.
306
తే. అత్రిముని యింద్ర దైవత్య మని జనులకుఁ | దెలిపె; నది కారణముగ నింద్రియ మనంగఁ
బరఁగుఁ జూవె నృబీజంబు పరమ మెల్ల | ధాతువుల కది విను పుత్ర! దాని విధము.
307
ఆ. శుక్లమునకు మనసు సూక్ష్మ రూపము; మనో | బలము నిల్వరింపఁ బక్వబుద్ధి
యోపుఁ; దరుణవృద్ధు లోప రజ్ఞాన దౌ | ర్బల్య మూఢ వికలభావు లగుట.
308
క. కావున శుక్ల స్థితికిం | గావించినయట్టి పుణ్యకర్మము లగు స
త్సేవిత యమనియమాదుల | త్రోవ సొరఁగవలయు విషయ దూరాత్మకుఁడై.
309
క. అరయఁగ విషయము లెంతయు | దురంతములు; వానియందుఁ దొడరినఁ జేటుం
బొరయుదురు దొడరకున్నం | బరమపదవి యమ్మహానుభావులకు నగున్‌.
310
క. జననము జరయును మరణం | బును మొదలుగఁ గలుగు దుఃఖములు లోకమునం
గనుఁగొని బుధుండు మోక్షం | బున కుద్యోగించు నియతిఁ బూతహృదయుఁ డై.
311
తే. వాఙఙ్మనః కాయములు శౌచవంతములుగఁ | జేసికొని యనహంకారశీల శాంత
బుద్ధియై నిరపేక్షతఁ బొంది యఖిల | భూతదయ గల్గి మెలఁగంగ బోధ మొందు.
312
క. మనసును వాక్కును గాయం | బు నియంత్రితములుగఁ జేసి పొందుదురు ధనం
బునకై మ్రుచ్చులు దానిం | గనుఁగొనఁ గావలదె మోక్షకాంక్షికి? వత్సా!
313
ఆ. బుద్ధిఁ గొని మనంబు వోనీక నిలిపి మ | నోభియుక్తి నింద్రియముల నాఁగి
విషయసమితి నెడల విడిచిన వానికి | ననిమిషులు ప్రసన్ను లగుదు రనఘ!
314
క. విను దేవతాప్రసాదం | బున నిర్మల యోగతంత్రములు పనుపడు న
య్యనువున నిశ్చలమతి ని | ల్చునది శిథిలితాన్నపాన సుఖతృష్ణుం డై.
315
క. శాక కణ మూల ఫల పి | ణ్యాకాదుల భైక్షమైన యన్నంబున ని
శ్శోకత నాఁకలివుచ్చుచు | లోకాలోకంబున నచలుఁడు గావలయున్‌.
316
క. జ్ఞానమ యింధనముగ వి | జ్ఞానాగ్నిం బ్రబలఁజేయ జరయు మరణమున్‌
నానావిధ దుఃఖంబులు | లేని యమృత మక్షరంబు లెస్సై తోఁచున్‌.
317
క. విని నిద్రాదోషంబునఁ | గను కలల రజస్తమో వికారంబులచే
మనసు దిరుఁగఁబడఁగాఁ గఱ | చినవి మఱచి యపుడు దుష్టశీలుండ యగున్‌.
318
వ. అది యోగి కొప్పదు గావున. 319
క. వినుతజ్ఞానాభ్యాసం | బున సమధిక జాగరత్వముం బడసి సకృ
జ్జనితం బగు నిద్రాభర | మునుఁ బొందును యోగి యదియుఁ బోఁ ద్రోచుఁ దుదిన్‌.’
320
వ. అని వెండియు. 321
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )