పురాణేతిహాసములు శ్రీమహాభారతము శాంతిపర్వము - చతుర్థాశ్వాసము
భీష్ముఁడు ధర్మజునకు స్వప్నాద్యవస్థల తెఱం గెఱింగించుట (సం. 12-209-1, 2)
క. ‘విలయం బింద్రియములకుం | గలుగఁగ విషయానుభవము గలిగిన భంగిన్‌
మెలఁగును స్వప్నంబున మెయి | గల యట్టుల దేహి భావగతి యెయ్యదియో.
322
క. అని యి ట్లొలయు వితర్కం | బునెడ హృషీకేశుఁ డైన పురుషోత్తము ద
ర్శనమును గ్రమమున నెఱిఁగిన | ముని వర్గము శిష్యవర్గమున్‌ బోధించున్‌.
323
క. శ్రమమున నింద్రియములు లీ | నము లగునది నిద్ర కలయనం దత్సంస్కా
రము మిథ్యావిషయ ప్రా | ప్తమగుట యప్పుడును దేహి దా సాక్షి యగున్‌.
324
తే. అనిలముఖ దోషములను సత్త్వాదిగుణ వి | కారముల జాగరంబునఁ గలుగునట్టి
తోఁపు బెరయంగఁ గల యయి తోఁచు; నది శు | భాశుభములకు సూచక మనియుఁ గలదు.
325
క. స్వాపావస్థం బ్రకృతి క | దీపిత వాటిల్లు నపుడుఁ దెలి వెడలక తా
దీపించుఁ బురుషుఁ డిమ్మెయి | చూపు ప్రబోధంబు పరమసూక్ష్మ త పుత్రా!
326
తే. తెలియ మేల్కని యుండుట, గలలు, నిద్ర | యను నవస్థాత్రయంబును, నవులఁబెట్టఁ
జాలు విజ్ఞాననిర్మల సత్యబోధ | రూప నిర్భరానందస్వరూపుఁ డనఘ!
327
తే. వ్యక్త మవ్యక్తమును రెండు నవగతములు | గాక మోక్షంబు మార్గంబు గానరాదు;
వ్యక్త మది మృత్యు వవ్యక్త మమృత మనియె | నతుల విజ్ఞాన ఘనుఁడు నారాయణుండు.
328
క. అనఘా! విను మవ్యక్తం | బనునది త్రైలోక్యమునకు నాధారము; దా
ని నివృత్తి లక్షణం బగు | ననుపమ ధర్మ మని చాటు నాగమఫణితుల్‌.
329
తే. వినుము బ్రహ్మోదితంబు ప్రవృత్తిధర్మ | మది గతాగతవ్యాప్తుల నావహించు
బ్రహ్మమండ్రు; నివృత్తిధర్మంబు నమ్మ | హాశ్రయము మోక్షదం బను నాగమములు.
330
క. కట్టిన చీరయునుం, బైఁ | బెట్టిన చీరయును, మౌళి బిగి యారంగాఁ
జుట్టిన చీరయుఁ బోలెను | నెట్టన పొదివినది దేహిని గుణత్రయమున్‌.
331
క. విను సత్త్వరజస్తమముల | పెనఁకువ కవుల వెలుఁగొందు పెంపు గలుగు తు
ర్య నిరంజనతత్త్వము పర | మనఘా! యది భావనీయ మను వేదంబుల్‌.
332
క. వాకును మనసును గాయము | నేకాయన వృత్తి శౌచ మెడలని తపముం
జేకొనునది యది బోధ | శ్రీకి ఘృతంబునకు వెన్నక్రియ జనక మగున్‌.
333
తే. బ్రహ్మచర్య మహింస నాఁ బరఁగు పరమ | ధర్మములు రెండు సువ్వె యుత్తమ తపంబు;
దానిఁ గలవాఁడు నిర్మల జ్ఞానయోగ | వంతుఁడై చూడనేర్చు సర్వంబు ననఘ!
334
క. ఆతత సంసారము తృ | ష్ణాతంతు స్యూతిబంధనంబున దృఢమై
చేతస్సంగతిఁ బాయమి | కాతెఱఁగు తపంబు పుత్ర! యౌషధము సుమీ!
335
క. వికసిత తృష్ణాలతికకు | న కుటిలమగు తపము దాత్రమై నఱకంగా
వికృతులఁ బ్రకృతినిఁ బురుషుని | నకలంక జ్ఞాన దృష్టి నవలోకించున్‌.
336
క. అని యమ్ముని పలుదెఱఁగులఁ | దను బోధించినఁ గృతార్థతం బొందెఁ దపో
ధనుఁ డా శిష్యుండు నీవును | గనికొను మేతద్వచో నికాయార్థంబుల్‌.’
337
తే. అనిన విని ప్రీతుఁడై పాండవాగ్రజన్ముఁ | డాపగాసూనుతో ‘మిథిలాధినాథుఁ
డైన జనకుండు మోక్షంబు ననఘ! యేమి | కృత్యమునఁ గాంచె?’ నది యెఱిఁగింపు మనుడు.
338
వ. అతం డతని కిట్లనియెఁ ‘దత్సంబంధియైన యితిహాసంబు సెప్పెద. 339
క. విను మాచార్యులు నూర్వురు | జనకనృపాలునకు; వారు సతతంబును న
జ్జనపతి వినిపింతురు త | త్త్వ నిరూపక శాస్త్రమును పృథగ్విధములుగన్‌.
340
క. ఏవాఁ డెమ్మెయిఁ జెప్పిన | నా వసుధాధిపుఁడు దాని ననుమోదించున్‌
భావము సంతోషశ్రీ | భావిత మగుచుండఁ గురునృపాలప్రవరా!
341
వ. అట్టియెడఁ దత్త్వజ్ఞానఘనుండును నిర్ద్వంద్వుండును సంశయరహితుండును నగు పంచశిఖుండను మునివరుండు మహిం దిరుగుచుండి మిథిలకుం జనుదెంచె; నతండు కపిలాభిధాన యగు గురుకుటుంబిని చన్ను గుడిచి పెరిఁగిన వాఁ డగుటం గాపిలేయుండు ననంబరఁగు; నమ్మహాత్ముండు హేతుమద్వాక్య విశేషంబుల నయ్యాచార్యుల నూర్వుర నయ్యుర్వీపతి సన్నిధిన నిరుత్తరులంజేసిన, నాతం డతని విశేషజ్ఞత యెఱింగి వారల విడిచి తన్నుం బ్రబోధించుటకై ప్రార్థించి యతనికిం బ్రణతుఁ డైన నమ్మాననీయుం డనూన దయాయత్తచిత్తుండు గావున నా భూవల్లభునకు మోక్షోపాధి బోధప్రదంబులగు వాక్యంబు లిట్లని యుపదేశించె. 342
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )