పురాణేతిహాసములు శ్రీమహాభారతము శాంతిపర్వము - చతుర్థాశ్వాసము
పంచశిఖుండను విప్రుండు జనకునకుఁ దత్త్వోపదేశంబు సేయుట (సం. 12-211-6,8)
ఆ. విను మవిద్య గామమునకుఁ గామము గర్మ | మునకుఁ బుట్టఁబట్టు లనఘ! యింత
వట్టుఁ గారణముగ వచ్చుఁ బునర్జన్మ | మండ్రు తత్త్వవేదు లైన మునులు.
343
ఆ. ఒలసి లోభమోహములు దోషసంసేవ | నం బొనర్పఁగా ఘనత్వగాఢ
యగు నవిద్య భూమియై బహుకర్మ బీ | జముల కంకురాది శక్తు లొసఁగు.
344
క. ప్రియములు నప్రియములును హృ | దయమును జిక్కువడఁ దివ్వఁ దత్తదనేక
క్రియలకుఁ జొచ్చు నరుఁడు మేన్‌ | వ్రయమగు టెఱుగఁడు వితత జరావ్యాధులచేన్‌.
345
క. ధనములు బంధులు భోగము | లనియెడు నస్థిరము లెల్ల నాత్మ కెరవు సే
సిన శాంతి యలవడును మన | మున శాంతిశ్రీ సమృద్ధి మోక్షము నిచ్చున్‌.’
346
వ. అనిన విని జనకజనవల్లభుం డమ్మునివల్లభునితోడ. 347
క. ‘కేవల వైరాగ్యము మో | క్షావహ మగునేని యట్టులైన విరక్తిన్‌
భావమున నరుఁడు దాల్చెడిఁ | బో వాఁ డవ్యయ పదంబుఁ బొందునె? యనుడున్‌.
348
వ. అవ్విప్రవరుం డతని కిట్లనియె. 349
క. విను నృప! హర్షంబు ప్రియం | బనూన సుఖయుక్తి నిర్భరానందము శాం
తినిరూఢి యనఁగ మనమునఁ | బనిగొనునవి సాత్త్వికాఖ్య భావంబు లగున్‌.
350
క. పరితాప మనభితోషము | నరేశ్వరా! శోచనము జనవ్యాపారా
దర మక్షమ యనియెడు నివి | యరయంగా రాజసంబు లగు భావంబుల్‌.
351
క. తలఁపులు గ్రందుగఁ బొడముట | గల గను టేమఱుట భ్రమము గదురుట జాడ్యం
బలసత యను నీ భావం | బులు దామసకోటి యండ్రు బుధులు నరేంద్రా!
352
క. కారణము గలిగియును ని | ష్కారణ కలితంబులయ్యు జనియించు ధరి
త్రీరమణ! మూఁడు దెఱఁగులు | నారయ నివి యస్థిరంబులై తిరుగఁబడున్‌.
353
చ. జనవర! సౌఖ్యముం బొరసి సాత్త్వికభావ సముద్గమంబు సు
మ్మనియును దుఃఖముల్‌ గదిరినప్పుడు రాజసభావభంగి సు
మ్మనియు జడత్వసంగసమయంబునఁ దామసభావవృత్తి సు
మ్మనియును ద్రోచి వానఁ బడ కాత్మరతిన్‌ నిలు పిచ్చు మోక్షమున్‌.
354
వ. ఇవ్వెరవునకు వైరాగ్యంబు మూలం బని చెప్పి వెండియు. 355
తే. వినుము సత్త్వాదిగుణముల ననఘ! యాత్మ | తత్త్వమున లీనములఁ జేయఁ దన్మయత్వ
దర్శనము దాన నవి మహోదధి నడంగు | నేఱు లట్టుల రూపఱు వేఱులేక.
356
తే. నరుఁడు సుఖదుఃఖములవెంటఁ బొరయ నీక | మలచి యాత్మునిఁ జేర్చిన మానసంబు
లీనమగు నంద జలములలోన నిడిన | లవణకణము చందమ్మున నవనినాథ!
357
క. తోలు దిగవిడిచి నాగము | లీలఁ బొలుచు మాడ్కిఁ గర్మలేపముఁ దనతోఁ
గీలుకొననీక వెలుఁగు ని | రాలంబన బోధఘనుఁడు రాజవరేణ్యా!
358
వ. అని బోధించె; నిట్లు పంచశిఖునిచేత బోధితుండై కాదె! జనకుండు దన పురంబైన మిథిల గాలునప్పుడు దుఃఖంబులం బొరయమింజేసి తన కేమియుం గాలదని పలికెం గౌంతేయాగ్రజా! యాకర్ణింపుము. 359
క. అమలం బగు నీ యితిహా | సము భక్తిఁ బఠించినం బ్రశాంతి యొలసి దుః
ఖములం దొఱఁగి మనుష్యుం | డమృతత్వావాప్తి మహితుండై వెలుఁగొందున్‌.’
360
వ. అనిన విని ధర్మతనయుండు దేవవ్రతుతో ‘నెట్టివాఁడు సుఖియును మంగళవంతుండును నిర్భయుండునునై వర్తించు?’ నని యడిగిన నప్పుడమిఱేని కప్పురుషవరుం డిట్లను ‘దమసంపన్నునకు నీ చెప్పిన చందంబుగలుగు నాకర్ణింపుము. 361
తే. సర్వవర్ణాశ్రమములకు శమము దమముఁ | గలిగియునికి విశిష్ట ప్రకార మగుట
బ్రాహ్మణునకు విశేషించి రాజవర్య! | దమసమాహిత వృత్తి పెద్దయును వలయు.
362
వ. దమంబు సద్గుణంబులరాశి; యవి యెయ్యవి? యంటేని. 363
సీ. శౌచ, మక్రోధంబు, సంతోష, మార్జవ, | మనసూయ, విగతదైన్యత్వవృత్తి,
యప్రమాదంబు, దురభిమానరాహిత్య, | మతివాదవర్జన, మఖిలభూత
దయ, గురుపూజ, నిందాస్తుతి ప్రవణతా | త్యాగం, బపైశునత్వంబు, సాధు
జనసంగమం, బమృషాభాషణంబు, ని | స్పృ హత, యహింస, సుశీలభావ,
 
తే. మింద్రియగ్రామజయ మివి యెల్ల దమము | నాకృతులు; వీనిఁ గల పుణ్యుఁ డభయుఁ డైహి
కములవలనను నాముష్మికముల వలన | శాంతిమంగళ నిధి బోధ సౌమ్యమూర్తి.’
364
వ. అనినం బితామహునితోఁ బాండవేయాగ్రజుండు ‘వ్రతస్థు లొక్కొక్కయెడ భోజనంబులు సేయుదురు. వారలకు వ్రతహానిలేకుండునే?’ యని యడిగిన నతనితో నతండు. 365
తే. ‘వినుము విప్రకామార్థ భోజనములోను | గాఁగఁ గలుగు వేదోక్త ప్రకార భోజ
నములు వ్రతహాని సేయవు నరవరేణ్య!’ | యని నిరూపించి పలికి యిట్లనియె మఱియు.
366
వ. ‘సదోపవాసియు, సదాబ్రహ్మచారియు, నమాంసభోజియు, విఘసాశనుండును, నమృతాశియు, నస్వప్నుండునుం గావలయుఁ దత్స్వ రూపంబు లెట్టి వంటేని. 367
సీ. ‘ఇరు ప్రొద్దు గుడుచుచు నెడనెడఁ గుడవక | యుండునాతండు సదోపవాసి;
ఋతుకాలమున నాత్మసతియంద రతిసల్పు | భవ్యశీలుఁడు సదా బ్రహ్మచారి;
దేవ పిత్రతిథి పూజావిధులం దిడి | మఱి నంజు పురుషుఁ డమాంస భోజి;
దనయట్లు పంక్తివారును భుజింప భుజించు | నంచితాత్ముఁడు విఘసాశనుండు;
 
తే. భృత్య వర్గంబు గుడిచిన పిదపఁ గుడుచు | నాతఁ డమృతాశి; దివసంబునందు నిదుర
వోని పుణ్యుఁడస్వప్నుఁ; డిప్పొలములగు మ | హాధిక వ్రతములు దేహ బాధకములు.’
368
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )