పురాణేతిహాసములు శ్రీమహాభారతము శాంతిపర్వము - పంచమాశ్వాసము
దేవల జైగీషవ్య సంవాద ప్రకారము (సం. 12-222-34)
వ. అసితుం డగు దేవలుండు జైగీషవ్యుం డను సంయమితోడ ‘నీవృత్తం బెఱింగి కొనవలయు నెఱింగింపవే!’ యనిన నమ్మహాత్ముం డమ్మునివరున కిట్లనియె. 20
ఆ. ‘శాంతిమంతు లైన సౌమ్యుల కెయ్యది | నిష్ఠ దానియందు నిరతిశయ స
మాదరంబు గలదు నాదుచిత్తంబున | వినుము తద్విధంబు విస్తరింతు.
21
క. వినుతించిన నిందించిన | ననఘా! మనమునఁ బ్రియంబు నప్రియమును లే
కునికియు వ్రేసిన నైనను | గనలు వొడమమియుఁ బ్రబుద్ధగణ్యగుణంబుల్‌.
22
ఆ. ఒకటిగోరి దాని కుల్లంబు గందంగ | జాలిఁ బడమి, యేమి సంభవించె
నేని దానఁ దృప్తి నూనుట దప్పిన | పనికి వగవ కునికి భవ్యగుణము.
23
క. హర్షంబును మానంబు న | మర్షము నపరాధమును సమదభావము ను
త్కర్షాపకర్ష చింతలు | నార్షసమాచారమున నిరస్తగుణంబుల్‌.
24
క. అవమానమునకుఁ దృప్తుం | డవు నమృతము ద్రావినట్ల యంచితసమ్మా
నవిధికి నుద్వేగముఁ బొం | దు విషంబునఁ బోలె శమరతుఁడు మునినాథా!
25
క. చుట్టము పగ యను భేదం | బెట్టిజనులవలనఁ దగుల దెల్లప్పుడు నె
ప్పట్టున నద్దానను మదిఁ | బుట్టదు సంతోష హాని బుద్ధాత్మునకున్‌.
26
ఆ. ఇంద్రియముల గెల్చి హృదయంబు శాంతిసు | ఖంబుఁ బొంద నిర్వికార వృత్తి
యైనవాని పొందు మానితగతి దేవ | తలకుఁ బొంద నరిది ధర్మనిరత!’
27
క. అని చెప్పె ననుడుఁ గుంతీ | తనయాగ్రజుఁ డాత్మ సమ్మదముఁ బొంద నదీ
తనయునితో ‘నెవ్వఁ డఖిల | జన ప్రియుఁడు సకలసత్త్వసమ్మతుఁ?’ డనినన్‌.
28
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )