పురాణేతిహాసములు శ్రీమహాభారతము శాంతిపర్వము - పంచమాశ్వాసము
ఉగ్రసేన శ్రీకృష్ణసంవాద ప్రకారము (సం. 12-223-23)
వ. అమ్మహాత్ముం డమ్మహీపతి కిట్లను. ‘నారదుని విషయంబుగా ఉగ్రసేనునకుఁ గేశవునకు సంవాదంబు గలిగె; నది నీ యడిగిన యర్థంబుఁ దేటపఱుచు; దాని నాకర్ణింపుము. 29
క. నరనాథ! యుగ్రసేనుఁడు | హరితో నిట్లనియె ‘జనము లభివర్ణన త
త్పరు లగుదురు నారదునెడ; | నరయఁగ నతఁ డంతవాఁడె? యంబుజనాభా!’
30
వ. అనుటయు నా కృష్ణుం డగ్గురుమతి కిట్లనియె. 31
సీ. ‘శ్రుతము నాచారంబు నతిశయవంతంబు | లెడ నహంకార మొక్కింతయేని
లేదు, శీలము గడు లెస్స, వేషము నిర్వి | కారం, బమత్సర గర్వమదుఁడు,
జననంబుఁ దపము దేజంబును బుద్ధియు | వినయంబు నయమును విశ్రుతములు,
ధైర్యంబు వచనమాధుర్యంబు శాఠ్యదై | న్య క్రోధలోభ నిరాసకత్వ
 
ఆ. మోజ యతనియందు నైజంబు; లీర్ష్య యు | నుద్ధతియు నసూయయును నవజ్ఞ
యును నెఱుంగఁ డట్టి మునివరు నారదు | నఖిలజనులుఁ బొగడు టరుదె యధిప!’
32
వ. అని చెప్పె నగ్గుణంబు లఖిల ప్రియకరంబులు, సకల సత్త్వ సమ్మతంబు’ లనిన విని ధర్మతనయుండు శంతను తనయుతోఁ ‘గాలావయవ ప్రకారంబులును, యుగప్రమాణంబులును, భూతవిధంబులును నెఱింగింపవే!’ యని యడుగుటయు, నతండు ‘శుకుం డడుగ వేదవ్యాస మునీశ్వరుండు సెప్పిన యర్థంబులు నీయడిగిన యవియును మఱియు ననేకంబులుఁ; గలవు సెప్పెద విను’ మని యజ్జనపతి కిట్లనియె. 33
క. అనఘుఁ బరాశరసూను స | వినయంబునఁ జేరి భక్తి వినతుం డై త
త్తనయుండు బుద్ధి సంప | ద్ఘనుఁడు శుకుం డిట్టు లనియెఁ గౌరవనాథా!
34
తే. ‘కాలవిధములు భూతసంఘప్రకార | ములును లోనుగ నెఱుఁగంగ వలయు వాని
బహులకారుణ్యసంపద పల్లవింప | నాకు నెఱిఁగింపవే మునినాథవర్య!’
35
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )