| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - పంచమాశ్వాసము |
| క. |
‘పరమబ్రహ్మపదము న | ధ్వరముననో, ప్రజ్ఞ పెంపు వలననొ, యోగా చరణముననొ, సాంఖ్యసమా | దరణముననొ పొందవచ్చుఁ దత్త్వజ్ఞవరా!’ |
104 |
| చ. |
అనుటయు నమ్మునిప్రవరుఁ డాతని కిట్లను ‘నీవు పేరు గ్రు చ్చినయవి యెల్ల మేల; సవిశేషతపంబును, నింద్రియప్రవ ర్తనముల నిగ్రహించుటయు, రాగము లోభముఁ ద్రోవఁ జాలు నే ర్పును దృఢవిద్యయుం గలుగు పుణ్యుఁడు వొందఁగనోపు బ్రహ్మమున్. |
105 |
| క. |
విను! మందు నొక విశేషం | బనఘా! బుద్ధీంద్రియంబు లైదును బరముం గను వెలుఁగున కడ్డము వా | ని నడంగింపంగ మనసునిపుణత యొప్పున్. |
106 |
| క. |
మనసు నియమింప భూతా | త్ముని యత్నం బోపు నియమమునకున్ లోనై మన సింద్రియములఁ గుదియిం | చిన శబ్దాదులు దొఱంగి సిద్ధి దొరకొనున్. |
107 |
| ఆ. |
కనుట వినుట యాదిగాఁ గల యింద్రియం | బుల కగోచరంబు బుద్ధి; దీన రూపుగాఁగఁ దోఁచు రూపశబ్దాది గు | ణత్వరహితమైన తత్త్వ మనఘ! |
108 |
| చ. |
వినయము విద్యయుం గలుగు విప్రునియందును, గోవునందు, నొ ప్పు నెఱయు హస్తియందు నొక పోఁకకుఁబోవని కుక్కయందు, దా ని నడఁచి తెచ్చి వండి తిను నీచపుమాలనియందుఁ దుల్యద ర్శనులు దదంతరాత్ముని నిరంజనునిం గనునట్టి పండితుల్. |
109 |
| క. |
స్థావరముల జంగమముల | నా విభుఁడు వసించు; నతనియందు నవి నిస ర్గావాసత నుండును; ద | ద్భావన మెఱుఁగుట తదైక్యపదముం జేర్చున్. |
110 |
| తే. |
క్షరము నక్షరమును ననం గలవు రెండు | మూర్తు; లాత్మ కఖిలభూతములను బూర్వ మొలయు మృత మన దివమున నుండు నమృత | మనఁగ నపరంబు రెంటిని గను బుధుండు. |
111 |
| క. |
ఈ లోకంబుల నెల్లం | గాలము పక్వంబు సేయఁగా నెవ్వాఁ డ క్కాలము పక్వము సేయం | జాలు నతం డమృతు నజరు సత్యుఁ గనుటకున్. |
112 |
| తే. |
విను నవద్వారపురమున వెలుఁగుచుండు | హంసుఁ; డతనిన యక్షరుఁ డమృతుఁ డండ్రు పరమయోగు లాతత్త్వంబు భంగిఁ గాంచు | యోగ్యసత్క్రియాభ్యాసవైరాగ్యపరుఁడు.’ |
113 |
| వ. | అని చెప్పి యప్పారాశర్యుండు వెండియు. | 114 |
| తే. |
‘అనఘ! విను కామమును గ్రోధమును భయంబు | నిద్రయును లోభమును జాల నిందితములు యోగిజనులకుఁ గావున నుడుగవలయు | వీని నైదింటి నచలావధాన వృత్తి. |
115 |
| శా. |
కామంబుం బెడఁబాచుఁ బండితుఁడు సంకల్పంబు వర్జించి, ని ద్రామోహంబు నడంచు సత్త్వగుణ చింతన్, లోభముం బ్రాజ్ఞ సే వాముద్రం దొలఁగించుఁ, గ్రోధము శమవ్యాప్తిన్ మగుడ్చున్ మతి శ్రీమాన్యా! భయ మప్రమాదమున నిర్జించున్ దృఢస్వాంతుఁడై. |
116 |
| తే. |
శిశ్నము నుదరమును ధృతిఁ, జేయుఁ గాలుఁ | జూడ్కిఁ జూడ్కిని వినికిని శుద్ధమాన సమున మానసవాక్కుల విమలవిద్య | నవహితుండు రక్షించుఁ గులాగ్రగణ్య! |
117 |
| వ. | మఱియు నొక్కతెఱంగు సెప్పెద. | 118 |
| తే. |
ఇంద్రియములలో నొక్కటియేనిఁ బట్టు | వడక వెడలిన నా గంటిఁ బ్రజ్ఞ గాఱు నట్లు కావున మనసు మున్నాఁగి వినికి | యాదియగు నైదుఁ గ్రమమున నాఁగవలయు. |
119 |
| క. |
మనసును నింద్రియములనుం | దనయం దొదుఁగంగఁ జేయఁ దానుఁ దెలివి నొం ది నిరంజనత్వ సిద్ధిం | గని యపధూమానలంబు కరణి వెలుంగున్. |
120 |
| మ. |
మన సేకాగ్రతఁ బొందఁ జేయ జనసమ్మర్దంబు వర్జించి శూ న్యనికేతాద్రిగుహా వివిక్త వనదేవాగార ముఖ్యంబు లై న నివాసంబుల నుండఁగావలయుఁ దన్మన్నించినం గీడు సే సిన హర్షంబు నమర్షముం హృదయముం జెందింప కక్షోభ్యుఁడై. |
121 |
| క. |
సమదృష్టిని ఱాయియుఁ గన | కముఁ జూచుచు సత్స మాధికలితం బగు వృ త్తము నడపిన శబ్దబ్ర | హ్మము షణ్మాసముల యోగి యతివర్తించున్. |
122 |
| క. |
సుత! విను; శబ్దబ్రహ్మము | నతివర్తించి భువనత్రయమునను యోగా న్వితుఁ డగు ముని గను నజు శా | శ్వతు నచలుఁ బురాణతము నజరుఁ బరమాత్మున్.’ |
123 |
| వ. | అనిన విని శుకుండు వేదవ్యాసమునీశ్వరునితో నిట్లను ‘వేదంబు గర్మంబుల నాచరించుటయుం, బరిత్యజించుటయుం జెప్పు; నివ్విధంబులు పరస్పర విరుద్ధంబులై యున్నయవి; యిం దెద్దాన నెట్టిగతి సిద్ధించు; నేర్పడ? నెఱింగింపవే!’ యనుటయు, నతం డతని కిట్లనియె. | 124 |
| ఆ. |
విను ప్రవృత్తి కర్మ మనఘ! నివృత్తి ని | ష్కర్మ మరయ బంధకంబు మోక్ష ణంబు నగుట బోధనత్వసంపన్నులు | సొరరు కర్మతంత్ర కరణమునకు. |
125 |
| క. |
కొందఱు కర్మకరణ మభి | నందింతురు; వారలకు జనన మరణములం బొందక పోరాదు; మహా | నందముఁ బొందుదురు నిత్య నైష్కర్మ్య పరుల్. |
126 |
| ఆ. |
చిత్తశుద్ధి మాత్రఁ జేసెనేనియు నవి | ద్యాత్మకంబ చూవె యరయఁ గర్మ మది దొఱంగు టంచితాత్మ విద్యాత్మక | ధర్మ మదియ మోక్షదంబు సుమ్ము! |
127 |
| ఉ. |
గుమ్మడిపువ్వుఁ దేనియయుఁ గూపము నైందవరేఖకాంతియున్ జు మ్మరయంగఁ గర్మఫల శోభనసంపద; జున్ను నేఱుఁ బూ ర్ణమ్మగు చంద్రబింబము ననం దగు నిర్మలవిద్య గాఢపా కమ్ము ఫలోదయం బది యఖండసుఖాత్మ పదంబు పుత్రకా! |
128 |
| వ. | కర్మంబునం గానిది యై విద్యనయ్యెడునట్టితెఱం గెఱింగించెద. | 129 |
| క. |
విను! రేఖామాత్రపుఁ జం | ద్రుని యట్టుల జీవుఁ డతని దుష్పక్షముఁ బో లిన యజ్ఞానము నపగమ | మున బోధానందసాంద్రపూర్ణతఁ బొలుచున్.’ |
130 |