పురాణేతిహాసములు శ్రీమహాభారతము శాంతిపర్వము - పంచమాశ్వాసము
బ్రహ్మచర్యంబు బ్రహ్మవిద్యాప్రాప్తికి ముఖ్యకారణంబని చెప్పుట (సం. 12-234-12)
వ. అని చెప్పిన విని ‘విద్య యెట్టివారికి నలవడు? నెఱింగింపవే!’ యనిన నందనునితో గంధవతీనందనుం డిట్లనియె. 131
తే. బ్రహ్మచర్యసమేతతపంబు విపుల | కాననమున వానప్రస్థ గణము పొంత
నిలిచి చేయుచుఁ బర్ణశాలలకు నుచిత | కాలమునఁ జని యెత్తి భిక్షలు భుజించి.
132
క. నుతియు నమస్కృతియును లే | క తిరిగి, శుభ మశుభమను వగం బొందక, గో
ష్ఠి తెరువు సొరకుండుట సు | వ్రత, మది యధ్యాత్మవిద్యఁ బ్రచురముఁ జేయున్‌.’
133
ఆ. అనుడు నతఁడు ‘కర్మ మఖిలంబు నీడఁ బో | విడుచు టొప్పదండ్రు వేదవిదులు;
దాని నాదరింపఁ దగదొకో సంయమి | ప్రవర! సందియంబు వాపవలయు.’
134
వ. అనినం ‘గర్మంబు విడువమియు, విడుచుటయుం గలిగియుండుఁ; దదీయయోగ్యతావిశేషంబు లెఱింగించెద. 135
సీ. విను’ మని ముని యిట్టులను ‘బ్రహ్మచారి గృ | హస్థ వానప్రస్థ యతులు విహిత
కర్మ నిష్ఠత సిద్ధిఁగాంతు; రాశ్రమ చతు | ష్కముఁ జతుష్పట్టికా ఘటితమైన
నిఃశ్రేణి తుదిముట్టు నెలవెక్కుటకు నిట్టి | క్రమవర్తనము సుకరంపుమార్గ;
మాయువు మొదలి నాలవపాలు గురుపాల | దాసునియట్లు సంతతముఁ బనులు
 
తే. ప్రీతిఁ జేయుచుఁ గుడిచిన పిదపఁ గుడిచి | శయ్యఁ జెందిన నాతని చరణయుగము
గరయుగంబున నొత్తుచు గలితనిద్రుఁ | డైన నిద్రించు బ్రహ్మచర్యాన్వితుండు.
136
క. రసగంధప్రముఖంబుల | దెస వేడుక లేక గురుమతికి వచ్చిన య
ట్టిసమయములఁ దగ వేదా |భ్యసనంబులు సేయుచుండు నాతఁడు నియతిన్‌.
137
వ. ఇది బ్రహ్మచారి ప్రకారం; బాతం డాశ్రమాంతరగతుం డయి వర్తించు విధంబు సెప్పెద. 138
సీ. సవినయంబునఁ దన శక్తితో గురునకు | దక్షిణ యిచ్చి, యాతండు వనుపఁ
గా సమావర్తనకార్యంబు నడపి వి | వాహమై హవ్యకవ్యముల నతిథి
తోషణ బాంధవ పోషణంబుల సత్య | భాషల నిజదారపరతఁ బుత్ర
సంశిక్షఁ గ్రతువిశేషంబుల నొక యాయు | రంశంబు గడపి గృహస్థ, ధర్మ
 
తే. వృత్తిఁ గృతకృత్యుఁ డగు నగ్ని విడువ కడవిఁ | బూరిపంటల ఫలమూలములను భిక్షు
పూజ సలుపుచుఁ, బరిశిష్టములు భుజించి | తపము సేఁత వానప్రస్థ ధర్మసరణి.
139
క. వానప్రస్థ ప్రక్రియ | దా నొకపా లాయువునఁ బదంపడి తుది పా
లైనను సన్న్యాసాను | ష్ఠానమునకుఁ జొచ్చువాఁడు శాంతాత్మకుఁడై.
140
వ. ఇ ట్లాయురంశంబులు నాలుగుం జెల్లుట యుత్తమ ధర్మస్వరూపం; బంశత్రయకాలాచరితంబైన యాశ్రమత్రితయంబు ప్రవర్తనంబులఁ గషాయపక్వంబగుటయుఁ జతుర్థాశ్రమంబుఁ జెందుట కృత్యంబు; దాని తెఱం గెఱింగించెద నవహితుండ వై యాకర్ణింపుము. 141
సీ. ఆత్మయం దగ్ని సమారోపణము సేసి | యజన మాంతరముగ నకృతసంధి
విగ్రహుం డగుచుఁ బరిగ్రహ విముఖుఁడై | ముండుండు ననికేతనుండు వృక్ష
మూలవాసియును గపాలధారుండు నే | కాకియు నక్రోధకామశోకుఁ
డును గాఁగవలయు; భిక్షునకు నిందా స్తుతుల్‌ | దనయంద యడఁగంగఁ దాను బరుల
 
తే. దిక్కు వలుకక దివియెల్లఁ బిక్కటిలఁగఁ | దాన యున్నట్లు గనుచు నేమేనిఁ గుడిచి
యెద్దియేనియుఁ గట్టి యెందే శయించు | నతని దేవతల్‌ బ్రాహ్మణుఁ డండ్రు పుత్ర!
142
క. జన నికరములకుఁ దొలఁగును | ఘన భుజగంబులకుఁ బోలెఁ గనుఁ బీనుఁగుఁ గా
వనితం దనుఁ బాటించిన | ననఘా! నరకముగఁ దలఁచు నతఁడు మనమునన్‌.
143
తే. అతనివలన భూతములకు నభయ మగుట | భూతముల దెస నభయంబ యాతనికిని
బుత్ర! యీగు లెల్లవియును భూతములకు | నభయ మిచ్చుటఁ బోలవం డ్రార్యజనులు.
144
ఆ. జంతుపదము లెల్ల దంతిపదంబులో | నడఁగు క్రియ నహింసయందు సకల
ధర్మములు నడంగుఁ గర్మ సంత్యాగికి | నైన భూతదయ సమర్హగుణము.
145
వ. కావున. 146
క. జగముల కెల్ల శరణ్యుం | డగుచు నమృతసిక్తమైన యట్టి మనసుతో
విగతాఖిలలేపస్థితి | గగనము నట్లుండు నతఁడు గణనాధికుఁడై.’
147
వ. అని చెప్పి యప్పరాశరనందనుండు వెండియు నిట్లనియె. 148
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )