| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - పంచమాశ్వాసము |
| వ. | అనియె నని చెప్పిన విని యజాతశత్రుండు తాతతో ‘నవశ్యకర్తవ్యంబు గృహస్థధర్మంబో పరిత్యాగంబో నిరూపించి చెప్పవే’ యనిన నతండు ‘రెండును మాననీయ ధర్మంబుల; కపిలగోసంవాదంబను నితిహాసంబు వినుము; దాన నీవితర్కంబు వినిశ్చయ దశంబొందు, నని పలికి యిట్లనుఁ ‘గపిలుం డను సంయమిసత్తముం డుత్తమాకృతియు భీతిరహితయు నహుషసంభావితయు నగు నొక్కగోవుం గాంచి ‘నీవు వేదస్వరూపవు గావే’ యని పలికె నమ్మాట వేదంబుల వలని యాదరంబు లేమింజేసి వెడలినదిగా నూహించి యప్పుడు గెలన నున్న స్యూమరశ్మి యనుముని సూక్ష్మ రూపంబున నగ్గోవు నందుఁ బ్రవేశించి. | 300 |
| క. |
వేదములు డాంబికత్వా | పాదనములు గాఁగ యతులు వలుకుదు; రవి స ర్వాదరణీయంబులు నీ | కాదరపాత్రములు గావొ?’ యని పలుకుటయున్. |
301 |
| వ. | అగ్గోవున కతం డిట్లనియె. | 302 |
| క. |
‘వేదములవలన నాకు న | నాదరమును నాదరమ్ము నను రెండును లే; వేది గతంబుగ నడిగితొ | నీదు తలం పెఱుఁగునట్టి నేరిమి గలదే. |
303 |
| వ. | అయినను నా యెఱింగినంత సెప్పెద నాకర్ణింపుము; బ్రహ్మచర్య గృహస్థ ధర్మ వానప్రస్థ వృత్తి పరివ్రజనంబు లను నాలుగాశ్రమంబులు దేవయానంబుల; యత్తెరువుల నడచుట సంసారులకుఁ గర్తవ్యంబు గావున. | 304 |
| క. |
వారలకు వేదవిహితా | చారంబులు వలయు నది ప్రశస్తము హింసా ప్రారంభ మాచరించుట | యారయఁగా మేలొ కీడొ యంచితమూర్తీ!’ |
305 |
| వ. | అనుటయు స్యూమరశ్మి యతని కిట్లనియె. | 306 |
| క. |
‘అలఘుమతిని యజ్ఞార్థం | బులుగాఁ బశువులను ధాన్యములఁ గల్పించెన్ జలజభవుం; డదిగాకయుఁ | దలకొని యజ్ఞంబు లతఁడు దాఁ జేయఁడొకో!’ |
307 |
| క. |
విను మజ్ఞునకును బ్రాజ్ఞున | కును గలయది దివ్యసుఖము గోరుట దివ్య త్వనిరూఢి యాగకరణం | బునఁ దక్కఁగ నొంటఁ గలుగఁ బోలునె చెపుమా! |
308 |
| క. |
అమలిన గృహస్థ ధర్మో త్తమముం గల్మషహరంబు దైవతసంభా వ్యము నైన యజ్ఞ కర్తృ | త్వము మునివర! హింస గాఁగ దలఁపం దగునే? |
309 |
| చ. |
అనుటయు నిట్లనుం గపిలుఁ ‘డాత్మ సుఖైక పరాయణుండు మె చ్చునె పెఱసౌఖ్యకోటి గతశోకుఁ డకాముఁడ సంగశీలుఁ డా తని కవియెల్ల నేటికి మదప్రదలోకము లొల్లమిన్ సనా తన మగు మోక్షముం గొఱలి తా విడుచున్ గృహధర్మవర్గమున్.’ |
310 |
| వ. | అనిన విని స్యూమరశ్మి యా సిద్ధప్రవరున కిట్లనియె. | 311 |
| ఆ. |
ప్రజలు దల్లిఁ జెందు పగిది గృహస్థ ధ | ర్మంబు నెల్ల యాశ్రమములుఁ జేరి కాదె జీవనంబు గావించుకొను గృహ | యుక్తుఁ డోషధులకు నొడయుఁ డగుట. |
312 |
| క. |
విను మోక్షము గార్హస్థ్యం | బునఁ గాదని యెన్నఁ డెచటఁ బురుషుం డెవ్వం డు నిరూపించి పలికె? స | ర్వనిధానము గృహము వేదవాక్యఫలజ్ఞా! |
313 |
| క. |
అలసులు ధనహీనులు నై | సొలసి క్రియలు విడుతు; రది విసూత్రత; దానం గలదే సద్గతి? వేదం | బులు విడిచి యఘంబుపరతఁ బోవరె తండ్రీ! |
314 |
| క. |
విదితము గర్భాధానము | మొదలుగ శ్రుతికలితమంత్రములు నిర్మల సం పద లెల్లను బ్రాహ్మణునకు | నొదవించుట దగునె శ్రుతుల నొల్లక యుండన్.’ |
315 |
| ఆ. |
అనినఁ గపిలుఁ డిట్టు లని వివరించు ‘నా | చారములను దేవ సమితి నెల్ల భూమిసురులు దృప్తిఁ బొందింతు; రమృత మా | నంగఁ బ్రీతి నిచ్చు భంగి యొలయ. |
316 |
| వ. | అది యట్లుండె వినుము చెప్పెద. | 317 |
| క. |
పాణి యుపస్థం బుదరము | వాణి యనఁగ మూయరాని వాకి ళ్ళివి; గీ ర్వాణులకు వీని బుధుఁడు పు | రాణపురుషరక్షకై తిరంబుగ మూయున్. |
318 |
| తే. |
పుచ్చికొనఁడు ముందటఁ బైఁడిప్రోక యున్న ; | నలుక నొడమియుఁ బొడువను నడువఁ దొడఁగ; డట్టి యా నైష్ఠికుని చేత నడఁగకున్నె | పాణి యనియెడు వాకిలి బంధురముగ. |
319 |
| క. |
ఏ విధము కాంతనైనన్ | దా విహరణమునకు నెపుడుఁ దార్పఁడు తనయం దావిష్టము భార్యావ్రత | మావెర వడ్డం బుపస్థ మనువాకిటికిన్. |
320 |
| క. |
తనుయాత్రకుఁగా నశనము | గొనుఁ; బూర్ణముగాఁ గొనండు; గోరఁడు లౌల్యం బున రాని దాని; నమ్మెయి | ముని యుదరద్వార మోపి మూసెన కాదే? |
321 |
| క. |
పలుకఁ డసత్యము, దూఱం | బలుకఁడు, బెట్టిదముగాఁగఁ బలుకఁడు, వాదం బులకుఁ జొరఁడు వాణి యనం | గలవాకిలి యట్టి బుధుఁడు గప్పం జాలున్. |
322 |
| తే. |
ద్వారములు నాల్గు మూయంగ దక్షుఁడైన | వాఁడ చూవె బ్రాహ్మణుఁ; డట్టివాని కేల తపములును యజనంబులు దానములును | వ్రతములును వేదకింకరత్వంబు దొడఁకు. |
323 |
| తే. |
ద్వంద్వములు లేక పేర్మికి వ్రస్సి పడక | ప్రకృతి వికృతులఁ గనుచుండు బ్రాహ్మణత్వ శాలి యా సదాచారంబు సలుపలేని | వాఁడు ఫలకాంక్షియై కర్మవశతఁ బొందు. |
324 |
| వ. | అని నిర్దేశించిన గోవునం దడంగియునికి దక్కి సన్నిహితుండై స్యూమరశ్మి తన పేరు సెప్పి ‘యేను ధర్మనిర్ణయం బెఱింగికొనవలసి గోవిలీనుండనై పలుకుచుండితిఁ గాని యొండుగాదు. మహాత్మా! ని న్నాశ్రయించితి. వేదంబులు ప్రమాణంబు లగుట యూఁది వర్ణాశ్రమ విహితాచారంబులు నడపుటయుం, బరిత్యాగంబునుం గల దెయ్యది యత్యంత విధేయంబు సువ్యక్తంబుగా నెఱింగింపవే. నీవు ధర్మసూక్ష్మత్వదర్శి; వేను శుశ్రూషకుండ; న న్ననుశాసింపు’మనవుడుఁ గపిలుండు ప్రీతుండై యతని కిట్లనియె. | 325 |
| క. |
జ్ఞానంబు నాశ్రయించిన | వానికి నే పనులఁ గీడు వాటిల్లదు; ప్ర జ్ఞానరహితుండు గామా | ధీనత మెయిఁ గర్మసమితి త్రిప్పునఁ జిక్కున్. |
326 |
| క. |
అనహంకారుఁడు నక్రో | ధనుఁడు నతృష్ణుండు నై నతఁడు శుభ మశుభం బను భేదముఁ బొరయఁడు; విడు | పున సమతాసుఖమయత్వముం గనుచుండున్. |
327 |
| క. |
విను మెఱుక గలర మీరె | ల్లను నేకాత్మత్వసిద్ధి లాభం బెందే ని నొకని కలవడు నాతం | డనుమానింపఁ డఖిల క్రియలుఁ బోఁ ద్రోచున్.’ |
328 |
| వ. | అనిన విని స్యూమరశ్మి య మ్మునివరున కిట్లనియె. | 329 |
| ఆ. |
వేదశాస్త్రసరణి విడుచు టున్మార్గవ | ర్తనము; మోక్షపదము రాదు దాన ననఁగ విందు; నంచితాత్మ వేదంబులఁ | గైకొనమియ కీడు నాకుఁ జూడ. |
330 |
| వ. | నా మనంబు సందియంబుఁ బాపవే’ యనినం గపిలుం డమ్మహాద్విజునితో ‘వేదంబుల నేల కై కొనకుండ వచ్చు? నవియ చూవె లోకంబులకుం బ్రమాణంబు’లని పలికి యిట్లనియె. | 331 |