| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - పంచమాశ్వాసము |
| వ. | అనిన విని ధర్మనందనుండు శంతనునందనుతో ‘సర్వభూతభయావహంబగుచుం గాలం బతిక్రమించుచుండఁ బురుషుం డెద్ది యాచరించుట మేలు? దీని మున్ను నడిగి విన్నవాఁడ; నిది పెద్దయు వినవలయునది గావున నడిగెదం జెప్పవే!’ యనుటయు, నమ్మహాత్ముం డీ యర్థంబు దెలియుటకు ముంద రేను జెప్పిన పితాపుత్ర సంవాదం బను నితిహాసంబు లెస్స; యందుఁగొన్ని వాక్యంబు లప్పుడు సెప్పనియవి యునుం గలవు; చెప్పెద విను; మధ్యయనపరుం డగు నొక్క బ్రాహ్మణపుత్రుం డన్వర్థనామధేయుండు మేధావి యనువాఁడు దండ్రి కభిముఖుండై. | 380 |
| సీ. |
‘ఆయువు దఱుఁగు నంతంతకు ధీరుఁ డె | య్యది సేయువాఁ?’ డన్న నతఁడు ‘బ్రహ్మ చర్యంబు వేదాభ్యసనమును సంతాన | సంపాదనంబు యజ్ఞప్రవర్త నంబును జేసి వానప్రస్థధర్మంబు | నడపి యాచరితసన్న్యా సుఁ డగుట కృత్యం’ బనుడు ‘జరామృత్యువుల్ జననమా | దిగ వెను తగులంగ దిగులు లేమి |
|
| తే. |
మీను వలదన్నుఁ బొదువుట గాన కిష్ట | వృత్తి విహరించుచుండెడు విధమ కాదె! యెల్లి సేసెద ననక మే లిపుడ చేయు | మనఘ! వార్చునె మృత్యువు జనుల పనుల.’ |
381 |
| వ. | అని పలికి పుత్రుండు వెండియు. | 382 |
| క. |
‘కృత మిది యకృతం బిది యిది | కృతాకృతంబనుచు నరుఁడు కింకర్తవ్య త్వతిరోహితాత్మహిత సం | స్మృతియైనఁ గృతాంతుఁ డతనిఁ జేర్చుఁ దనపురిన్. |
383 |
| క. |
అనఘా! మృత్యువు నమృతం | బును దేహమునంద కలవు; మోహము మృత్యు త్వనిరూఢ మున్నరూపుం | గనుటమృతత్వోపహితము గాఁగ నెఱుఁగుమీ. |
384 |
| క. |
ననుబోఁటికిఁ బశుయజ్ఞం | బున హింసకుఁ డగుట దగునె భూసురవర! హిం సనరహితమైన శాంతి య | జనమున బ్రహ్మాధ్వరంబు సలిపెద నియతిన్. |
385 |
| క. |
యోగంబుఁ దపంబుఁ బరి | త్యాగంబును గాక యొండు లగునె హితంబుల్? రాగము సరి దుఃఖంబును | ద్యాగముఁ బోలెడి సుఖంబు నరయం గలవే? |
386 |
| క. |
ప్రజ యేన కాన నన్నుం | బ్రజ సుగతికిఁ బుచ్చునని భరంపడి కోరం బ్రజ విడిచెద నా యందది | యజేయమును నవ్యయంబు నగు పద మిచ్చున్. |
387 |
| ఉ. |
కావున లోకసంక్షయము గన్గొని యెల్లెడ నిర్మముండ వై నీవును శాంతియున్ సమత నిష్ఠయుఁ బూని గుహాప్రవేశ సం భావన నాత్మదర్శన విభాసివి గమ్మనినం దదీయ వి ద్యావచనంబులం జనకుఁ డట్టిఁడ యై వెలిఁగెం గృతార్థతన్. |
388 |
| క. |
నరనాథ! యమృతమగు ను | న్నరూపు గను దీవు మరగు నా చెప్పిన యి ప్పరమేతిహాస వాక్యో | త్కరంబు నర్థంబు చిత్తగత మగుచుండన్. |
389 |
| వ. | అనిన విని యుధిష్ఠిరుం ‘డెవ్విధంబు శీలంబు గలవాఁడు బ్రహ్మపదంబు నొందు?’ నని యడిగిన భీష్ముం డత్యాదరంబున. | 390 |
| తే. |
‘అధిప! లఘ్వాశియై యింద్రియప్రపంచ | జయము గలిగి మోక్షార్థోక్త సారధర్మ నిరతి నుండెడి వానికిఁ బరమ మగు ప | దంబు తంగేటిజున్ను చందంబు నొందు.’ |
391 |
| వ. | అని పలికి మఱియు నిట్లను ‘హారీతగీతి యను వాక్యసంచయం బాకర్ణింపుము. దాన మోక్ష ధర్మంబులు దేటపడుం జెప్పెద హారీతుం డను మునివరుండు విద్వజ్జనంబులు దనవలనం బ్రవ్రజనంబు సమీచీన ప్రకారంబుగా నెఱుంగ నపేక్షించిన. | 392 |