| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - పంచమాశ్వాసము |
| తే. |
‘శాస్త్రతత్త్వ మెఱుంగక సంశయాత్ముఁ | డగుచుఁ బరమార్థ మిట్టిది యనఁగలేని యట్టివాఁ డేమి కర్మంబు నాచరించు | వాఁడు సెప్పవె ధర్మప్రవర్తనజ్ఞ!’ |
446 |
| వ. | అని యడిగిన నమ్మహామతి యతని కిట్లను ‘గురుపూజయు వృద్ధోపసేవనంబును విద్యాశ్రవణంబు నవశ్యకర్తవ్యంబులు; మఱియునుం జేయవలయునవి నారద గాలవ సంవాదంబు వినినం దెలియు; వినుము చెప్పెద; నారదు నాశ్రయించి గాలవుండు. | 447 |
| క. |
నానా శాస్త్రంబుల న | ర్థానేకత్వంబు గనుచు నప్రాప్త సువి జ్ఞానపరినిష్ఠ మగు మ | న్మానసముం దేర్పవే సమగ్రవివేకా!’ |
448 |
| వ. | అని యభ్యర్థించిన నద్దేవముని యమ్మహాద్విజున కిట్లనియె. | 449 |
| క. |
చతురాశ్రమముల వృత్త | స్థితులు పరీక్షించి యందుఁ జెందఁదలఁచి త ద్గతి సూక్ష్మ దృష్టిఁ గనుఁగొని | సతతంబుఁ ద్రివర్గచరిత సౌమ్యుం డగుచున్. |
450 |
| తే. |
పాపకర్మంబు లెల్లనుఁ బాయఁ బెట్టి | పుణ్యకృత్యంబు లగువానిఁ బురుషుఁ డోపి నట్లు శుద్ధమనస్కుఁడై యాచరించు | వాఁడు సజ్జనసంగతి వలయు నెపుడు. |
451 |
| క. |
విను సర్వభూతముల యం | దును మార్దవయుక్తుఁడై మధుర వాగ్వృ త్తిం బనుపడఁగవలయు; నార్జవ | మనూనముగ దేవపితృసమర్చకుఁ డగుచున్. |
452 |
| క. |
అనహంకారము, నప్రా | ర్థనమును విషయములఁ బెద్ద దగులమియును మే; లనఘా! పరునిందించుట | దను వర్ణించుకొను టనుచితము లెయ్యెడలన్. |
453 |
| క. |
విను మలసుండును గర్వియు | ననర్థభాషియును మత్సరాలీఢుఁడుఁ గ్రో ధనుఁడును గా వలవదు శ | క్త్యనురూపతఁ జేయవలయు నాతిథ్యంబున్. |
454 |
| క. |
వేదాధ్యయనంబుఁ దదం | గాదరణము యజ్ఞవిధిసమారంభము ధా త్రీదైవత సమ్మానము | నే దేశమునందుఁ గలుగు నిర వది నిలువన్. |
455 |
| క. |
ఇత్తెఱఁగునఁ బురుషుం డ | త్యుత్తమ చరితముల నడచుచుండఁగఁ బాయుం జిత్తంబుకలఁక బోధో | త్పత్తికి నది మూల మగు నధర్మవిదూరా!’ |
456 |
| క. |
అని చెప్పె ననుడుఁ గుంతీ | తనయాగ్రజుఁ డమరతటిని తనయునితో ని ట్లనుఁ ‘గాలపాశసంఛే | దనమును ననుబోఁటి యెవ్విధంబునఁ జేయున్?’ |
457 |
| వ. | అని యడిగిన నతం డతని కిట్లనియె. | 458 |