| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - పంచమాశ్వాసము |
| సీ. |
రజతాచలంబున రత్నతటంబున | నంబికాసహితుఁడై హరుఁడు పేర్మి నమరమునీంద్ర యక్షాదులు గొలువంగ | నుండు; నట్లుండంగ నొక్కనాఁడు దేవర్షికోటు లతిప్రమదంబునం | జనఁ జూచి ‘వీ రేమిపనికి నెచటి కరిగెద?’ రని పతి నడిగె భవాని; యా | తఁడు ‘దక్షుచేయు నధ్వరమునందుఁ |
|
| తే. |
దమహవిర్భాగములు గొనుదాని’ కనినఁ | ‘బొలఁతి నీ వేల పో?’ వను పలుకు పలికె; ‘నాకు మును భాగపరికల్పనంబు లేమి | నతఁడు బిలువఁ; డేనును బోవ’ ననియె భవుఁడు. |
437 |
| క. |
తన పతికి భాగకల్పన | మొనరింపఁడు దక్షుఁ డని మహోగ్రపుఁ గోపం బున బొమలు ముడివడఁగ న | వ్వనిత పలుకు మాని యుండె వసుధాధీశా! |
438 |
| సీ. |
దేవిచిత్త మెఱింగి దేవుండు ప్రమథసం | ఘంబులు దాను నా క్రతువు సెఱుప నరిగె; యజ్ఞాంగంబు లన్నింటిఁ బ్రమథులు | గాసి సేయుచును రక్తములు సల్లి యార్పంగ మృగరూపమై గగనంబున | కెగసె; నధ్వరము మున్నీశునుదుట నలుకఁ బుట్టిన ఘర్మజల కణ మిలఁ బడ్డఁ | బెనుమంట లెగసిన జనితుఁ డయ్యె |
|
| ఆ. |
నందుఁ బురుషుఁ డొకరుఁ డరుణ నేత్రకము నీ | లంబు నూర్ధ్వరోమకంబు ఘోర భంగికంబు నైన యంగంబుతో సప్త | తంతుదాహి యగుచు ధరణినాథ! |
439 |
| క. |
సురలు మునులు భయమునఁ బఱ | చిరి నలుగడ; బ్రహ్మ వచ్చి శివుఁ గని వినయో త్తరముగ మ్రొక్కుచు ‘నమరులు | పరికల్పించెదరు నీకు భాగము భక్తిన్. |
440 |
| వ. | స్వామీ! కోపం బుపసంహరింపుము.’ | 441 |
| క. |
నావుడు నల్ల నగుచు న | ద్దేవుఁడు గరుణించి మునుల దేవతలను సం భావింప భాగకల్పన | గావించిరి వార లా జగత్ప్రభువునకున్. |
442 |
| వ. | అప్పరమేశ్వరుండు సుప్రసన్నుండై యనిమిషులకు మునిగణంబులకు నానందం బొసంగె; శతానందుం డయ్యిందుశేఖరునితో ‘దేవా! నీనుదుటి చెమటం బుట్టిన యప్పురుషుండు జ్వరంబను నామంబున బ్రశస్తుండయి యెందునుం జరియించు; నీ జ్వరం బేకముఖత్వంబునం బృథివికి దుర్భరంబగు బహువిధంబుగా సృజియింపవే’ యనుడు నగ్గిరీశుండు కరులకు శిరస్తాపనంబును, భుజంగంబులకు నిర్మోకంబును, గోవులకు ఖురాంతర్బాధనంబును, మృగంబులకు నైజస్వరూపదర్శన ప్రత్యవరోధనంబును, దురగంబులకుఁ బార్శ్వ శోషణంబును, మయూరంబులకుఁ బత్రోద్భేదనంబును, గోకిలంబులకు నేత్రరోగంబును, శుకంబులకు హిక్కయు, నజంబులకుఁ జిత్తభ్రమణంబును, శార్దూలంబులకు శ్రమంబును, మనుష్యులకు జననమరణాదుల యెడ వేదనావేశంబునుంగా విభాగించె; నిది జ్వరప్రకారంబు. జ్వరంబు మాహేశ్వరతేజంబు గావున సర్వజనంబులకు నమస్కార్యంబును, మాననీయంబునై యుండు. | 443 |
| క. |
జ్వరకథ వినినఁ బఠించినఁ | బురుషుం డారోగ్యసిద్ధిఁ బొదలుం; దేజః స్ఫురణముఁ జిత్తసమాధియు | దొరకొనుఁ; గోర్కులు ఫలించు; దురితము లడఁగున్.’ |
444 |
| క. |
అని చెప్పి యమరతటినీ | తనూభవుం డాదరమున ధర్మసుతునితో ‘ననఘా! నీ విం కెయ్యది | వినవల?’ తనవుడు నతండు వినయానతుఁడై. |
445 |