| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - పంచమాశ్వాసము |
| సీ. |
‘ఇంద్రుఁ డుజ్జ్వలరథం బెక్కి దేవానీక | సహితుఁడై వృత్రుపైఁ జన నతండు దనుజసైన్యముఁగొని తాఁకెఁ; దత్సంగర | మవ్వాసవునకు భయం బొనర్చెఁ; బర్వత ప్రతిమరూపమున నయ్యసుర యు | గ్రతఁ జూచి వడఁకు దైవతకులేంద్రు నద్దానవుండు మాయాబలంబున మోహి | తునిఁ జేయ సొగయుడు ముని సమాజ |
|
| తే. |
సంస్తుతముగ రథంతరసామశక్తిఁ | జేసి యమ్మూర్ఛదేర్చి వసిష్ఠుఁ డతని తోడ నజుఁడును హరియు రుద్రుండుఁ బోరు | గనుఁగొనంగ వచ్చినవారు గడఁగు మనుడు. |
423 |
| చ. |
అతఁడు గడంగ దేవగురుఁ డప్డు మునీంద్రులుఁ దాను నమ్మరు త్పతి విజయంబు గోరి హరుఁ బ్రార్థన సేయఁ దదీయతేజ ము ద్ధత చటులజ్వరం బగుచు దైత్యపతిం బొదివెన్ సురేశ్వరో ద్యతకులిశంబుఁ బొందె హరి దత్సమయంబునఁ గౌరవేశ్వరా! |
424 |
| తే. |
ఇంద్రునకు రుద్రుఁ డత్తఱి నిట్టు లనియె | ననఘ! యఱువది వేలు దివ్యాబ్దములు మ హాతపం బొనరించె నీయసుర; వీని | కొసఁగెఁ బద్మజుఁ డధికమహోగ్రబలము. |
425 |
| క. |
అని చెప్పి ‘యబ్బలము నా | ఘనతేజముచేత నడఁగు గడఁగు’ మనుడు న య్యనిమిషనాథుఁడు వజ్రం | బున వైవ నతండు వడియె మునిగణ మలరన్. |
426 |
| క. |
సుర లార్చిరి, తూర్యంబులు | మొరసె ననేకంబు; లపుడు మోదమున మునుల్ హరిహరులం గీర్తించిరి, | సురేంద్రు నగ్గించి రధికశుభవాక్యములన్. |
427 |
| క. |
విను విష్ణుని సంస్పర్శం | బున నప్పుడ చూవె కసటు వోయిన నతనిం గనుటయు శాంతిం బొందుట | యును గురువర! కలిగె వృత్రు నుల్లంబునకున్.’ |
428 |
| వ. | అని పలికి భీష్ముండు వెండియు నవ్విభున కిట్లను నట్లు వృత్రుని జయించి. | 429 |
| చ. |
హరునకు మ్రొక్కి ‘మీ కరుణ నార్తి దొఱంగి యనూన సౌఖ్యముం బొరసితి’ నంచు వీడుకొని పోయె మహేంద్రుఁడు బ్రహ్మహత్య యా సురపతి నప్డు వెన్కొనియెఁ జొచ్చె బిసాంతర మాతఁ డందునుం బరిగొని యుగ్రవృత్తి నది పట్టెఁ జలంబున నమ్మహాత్మునిన్. |
430 |
| ఆ. |
బ్రహ్మహత్య దన్నుఁ బట్టిన నమరేంద్రుఁ | డజుని కడకు నేఁగి ప్రార్థనంబు చేసి ‘దీనిఁ బాయఁజేయవే’ యన నతం | డది దొలంగఁ జేయుననువు దలఁచి. |
431 |
| వ. | అగ్నినోషధివృక్షతృణంబులను వనితా జనంబులను జలంబులను దలంపున రావించి వృత్రునివలన వాసవునకుం బాటిల్లిన బ్రహ్మహత్య చతుర్భాగంబులు సేసితి. మీర లొక్కొక్క పాలు గై కొనుండని పనిచెఁ; బనిచిన వారు ‘దేవా! నీ పంపు సేసెదము; మాకు నిష్కృ తి యెట్టిది? దాని నీదివ్య చిత్తంబున నవధరింపవలయు’ నని పలికిన నగ్ని కిని నోషధివృక్షతృణంబులకును, వనితాజనంబులకును, జలంబులకును వరంబులుగాఁ గ్రమంబున నీవు ప్రజ్వలింపక హవిఃప్రదానంబు సేయు వానియందును, మీకుఁ బర్వంబుల భేదనచ్ఛేదనంబు లాచరించువానియందును, మీరు రజస్వలలై యుండ మీతో సురతంబు సలుపువాని యందును, మీలో మల మూత్ర శ్లేష్మంబులు విడుచువాని యందును మీ మీ కడనున్న బ్రహ్మహత్య ప్రవేశింపఁ గలయది’ యని నిర్దేశించిన దానికిం బ్రియం బంది, యగ్ని ప్రముఖంబులు శతమఖు బ్రహ్మహత్య పాళ్ళు ధరియించి; రిట్లు విరించి ప్రసాదంబునం గల్మషంబు దొఱంగి యాఖండలుండు దదనుమతి నశ్వమేధంబు సేసి నాక సామ్రాజ్యంబున సర్వలోక పూజ్యత్వంబు నొంది వెలింగె’ నని చెప్పి వెండియు నిట్లనియె. | 432 |
| తే. |
ఒదవు వృత్రురక్తమున బుద్బుదము లెసఁగి | పుట్టకొక్కులై యవి జనభోజ్యభావ మొంది విప్రాదికద్విజ యోగ్యతాభి | పన్నములు గావు ధర్మసంపన్నచరిత! |
433 |
| క. |
ఆ వాసవు చందంబున | నీవును శత్రుజయకీర్తనీయుఁడ వగుచున్ భూవిబుధుల కెపుడుఁ బ్రమో | దావహుఁడవు గమ్ము. భారతాన్వయముఖ్యా! |
434 |
| తే. |
పర్వములయందు విప్రసభను సభక్తి | కంబుగా నెవ్వఁ డీశక్రకథఁ బఠించు వానిఁ బాపము లొందవు, మాననీయ | ధర్మములయందు రతుఁడగు ధర్మతనయ!’ |
435 |
| వ. | అనిన నతండు ప్రీతుండై ‘వృత్రుండు జ్వరంబుచేతం బొదువంబడియె నని వింటి; దాని జననంబును దత్ప్రకారంబును నెఱిఁగింపవే’ యనుటయు భీష్ముం డా భూపతి కిట్లనియె. | 436 |