పురాణేతిహాసములు శ్రీమహాభారతము శాంతిపర్వము - పంచమాశ్వాసము
వృత్రగీత (సం. 12-270-13)
తే. కలిమియును లేమియును విను కాలవశగ | తములు; బోధవిహీనుల దర్ప దైన్య
కలితసుఖదుఃఖములఁ బెట్టుఁగాక యర్థ | ముల యనిత్యత యెఱిఁగినఁ గలదె వికృతి?
398
వ. అర్థంబుల యస్థిరత్వంబ కా దాకర్ణింపుము. 399
క. దైవతమానుష తిర్య | గ్భావంబులఁ బొందుచును వికారిణియై భూ
తావలి దిరిగిన వెంటన | వే విధములఁ దిరుగుఁ గర్మవివశత్వమునన్‌.
400
క. ఏ నిది యంతయు నెఱుఁగుదుఁ | గాన వగపు నుబ్బు నాకుఁ గలుగ’ వనుడు ని
మ్మాన విహీనపు మాటలు | దానవకులనాథ! నీకుఁ దగునే యాడన్‌.’
401
వ. అని యతని మనశ్శుద్ధి యెఱుంగుటకునై భార్గవుండు. 402
క. అనయము నీసువొనర్చిన | విని యతనికి నిట్టు లనియె వృత్రుఁడు ‘విజయం
బునకు నయి తపము సేయనె | మును? తత్సుకృతమునఁ గొననె మూఁడు జగములున్‌?
403
క. ఆ యైశ్వర్యము గ్రమ్మఱ | మాయుటకుం గారణంబు మాన్యచరిత! లే
దే యొక దుష్కృత; మది యిటు | సేయుం గాకేమి? యేల చింతింపంగన్‌?
404
క. విను మనఘ! యింక సుకృతం | బునకుం జొర దుష్కృతంబు పొంతకుఁ బోనే
ననుపము నచ్యుతు నవ్యయు | ననంతుఁ జెందెద ననామయత నవ్విష్ణున్‌.
405
చ. అనిమిషనాథుతోడి యనియప్పుడు గంటి ననంతు నాద్యు వి
ష్ణుని నలవోకఁ దన్మహిమ సువ్రత! నా కెఱిఁగింపు; కర్మసం
జనితవిశేషతం గలుగు చాయలలోపల నెద్ది యవ్విభుం
గనుటకు నర్హ మయ్యెఱుక గల్గఁగఁ జేయుము నాదు బుద్ధికిన్‌.’
406
ఆ. అనిన ‘నట్లకాక వినుము చెప్పెద’నని | యసురగురుఁడు పలుకు నవసరమున
నచటి కరుగుదెంచె నఖిల మునీంద్ర స | మ్మాన్యుఁ డగు సనత్కుమారుఁ డధిప!
407
వ. వచ్చి యభిపూజితుండై సమున్నతాసనంబున నున్న యమ్మహాత్మునితో శుక్రుండు ‘విష్ణుని మాహాత్మ్య ంబును వర్ణవిశేషంబులు నిద్దానవేంద్రునకు నెఱింగింపవే!’ యనిన నతండు ప్రసన్నవదనుం డగుచు నిట్లనియె. 408
ఆ. ‘వినుము దనుజనాథ! విష్ణునియం దఖి | లంబుఁ గలుగు నిలుచు లయముఁ బొందు;
నతనిభక్తి నింద్రియ జయంబునను బోలె | దానధర్మవిధులఁ గానరాదు.
409
వ. అవి ప్రయోజన పడుటయుం గలిగి యుండు; నదియునుం జెప్పెద; మున్ను విష్ణుని మహిమ యాకర్ణింపుము. 410
తే. ధరణి పాదంబు లతనికి శిరము దివము | దిశలు బాహు లతఁడు సర్వదేవమయుఁడు
భూతవిక్షేప సంహారములు దదీయ | మానసస్వైరలీలలు దానవేంద్ర!
411
వ. వినుము జీవావస్థలు ఛాయలై యుండుఁ గృష్ణంబును, ధూమ్రంబును, హరితంబును, హారిద్రంబును, రక్తంబును, శుక్లంబును నైనవి యాఱుగల వద్దశా విశేషంబులు. 412
తే. అనఘ! విష్ణువిహారంబు లైన విషమ | వివిధ విక్షేప సంహారవృత్తులందు
భ్రమణ మొందెడి జీవుని బహుళకర్మ | ముల వశంబున నాతనిఁ బొందుచుండు.
413
తే. తన్ను నుత్తమ మధ్యమాధమము లైన | ఛాయ లొందంగఁ బ్రచుర పర్యాయవృత్తి
జీవుఁ డమరత్వ ముఖ్యనానావిధముల | నొంది యెక్కుచు డిగ్గుచు నుండుఁ జూవె.
414
క. మే లొనరింపఁగ దొరకొను | మేలిమి గలచాయ కీడు మెయికొని చేయన్‌
లోలత్వరహిత! చాయకుఁ | జాలం గీడ్పాటు వొలయు చందము వచ్చున్‌.
415
వ. కావునన్‌. 416
క. రసకర్మజ్ఞుఁడు దారము | పసిండి సేఁతకుఁ బ్రయత్నపరుఁడై శుద్ధ
త్వసమగ్రము సేయుక్రియ | న్విసువక పరిశుద్ధి జీవునికిఁ జేయు టురున్‌.
417
క. విను కుసుమంబుల వాసిం | చిన నొప్పని కంపు విడిచి చెందును సౌర
భ్య నిరూఢిం దిలలట్టుల | యనఘా! సుకృతముల జీవుఁ డకలంకుఁ డగున్‌.
418
క. అంతంతకు సత్కర్మము | లెంతయుఁ బెనుపొంద జీవుఁ డెక్కుడు చాయన్‌
జింతా కలుషము వాయఁగ | సంతోషామృతము నాని సంశుద్ధుఁ డగున్‌.
419
వ. ఎక్కుడు చాయ శుక్లత్వంబు. 420
క. జీవుఁడు శుక్లచ్ఛాయా | భావితుఁడైనపుడు విష్ణు భావించుటకున్‌
దా వెరవరి యగుఁ దద్గత | భావ మొసఁగు గుఱుము లేని పండగునెలవున్‌.’
421
వ. అనిన విని వృత్రుం ‘డదీనంబులు, నమృతస్వరూపంబులు నగు భవదీయ వచనంబులు వినికింజేసి విశుద్ధుండనైతి’ నని పలికి ప్రాణంబులు విడిచి విష్ణునిం బొందె’ నని చెప్పుటయు, నప్పాండవేయాగ్రజుండు ‘వృత్రుని విజ్ఞానంబును, విష్ణుభక్తియు నింత యొప్పునే?’ యని యగ్గించి, ‘యతండును, నాఖండలుండును భండనంబు సేసిన తెఱం గెఱింగింపవే’ యనుటయు ననిమిషనదీనందనుం డతని కిట్లనియె. 422
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )