| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - పంచమాశ్వాసము |
| సీ. |
అనిన ధర్మసుతుండు హర్షమ్ము దనదు చి | త్తమున నిండార శాంతనవుతోడ ‘దమమును సత్యంబు క్షమయును నెల్లెడ | వినుతింపఁబడు నార్యజనులచేత; నవి యంత లెస్సలే?’ యనవుడు నతనికి | నతఁడిట్టులను ‘విను హంసగీత; యది యుత్తరంబగు నధిప! నీ ప్రశ్నంబు | నకు; దానిఁ జెప్పెద నలినభవుఁడు |
|
| తే. |
పసిఁడి రాయంచయై కేలిపరత నొంది | తిరుగ నొక్కెడ సాధ్యు లద్దేవుఁ గాంచి పక్షివర! నీవు విద్యలఁ బ్రౌఢుఁడగుట | సెప్పఁగా విందు మాశ్రయించెదము నిన్ను. |
540 |
| వ. | ‘ఏము సాధ్యుల’ మని పలికి సవినయంబుగా నిట్లనిరి. | 541 |
| తే. |
‘ఉత్తమం బెద్ది? నీ చిత్త మొలయు నెందుఁ? | బురుషుఁ డెయ్యది గల్గినఁ బొందు నఖిల కర్మబంధ మోక్షము? నట్టి ధర్మ మెఱుఁగఁ | జెప్పవే కరుణాలత చిగురులొత్త.’ |
542 |
| వ. | అని యడిగిన నాదరించి యయ్యంచ వారల కిట్లనియె. | 543 |
| క. |
‘క్షమయును దమమును సత్యము | నమేయ మహిమాస్పదంబు లన విందుము ధ ర్మములం దెల్లను నభివ | ర్ణ్యము; లవి హృద్గ్రంథిభేదన ప్రౌఢంబుల్.’ |
544 |
| వ. | అని చెప్పి వెండియు. | 545 |
| క. |
‘పరమర్మ భేదులును నయ | విరహితములు ధర్మకార్య విముఖంబులు ని ష్ఠురములు నగు మాటలు స | త్పురుషుం డాడఁ డవి సత్యములు గా కునికిన్. |
546 |
| క. |
జనములు దను నవమానిం | చిన నిందించినను మాఱుసేయక సైరిం చిన శాంతాత్ముఁడు వారల | మును చేసిన యట్టి సుకృతముల నాఁచికొనున్. |
547 |
| క. |
కీడాడిన మేలాడుచుఁ | దాడన మొనరించి రేని దరహాసముతో నీడం బోదును గ్రోధో | త్పీడ వొరయ దెప్పుడును మదీయహృదయమున్. |
548 |
| తే. |
వేదసారంబు సత్యంబు; వినుఁడు! సత్య | సారమూర్తి దమము; దమసార మనఘు లార! మోక్ష; మీ పరిపాటి గారవమున | నాదరించు జనంబుల కందు ముక్తి. |
549 |
| క. |
దమమునఁ గర్మేంద్రియముల | శమియింపఁగఁ జేఁత యది నిసర్గగుణంబై రమియించు నెప్పురుషు చి | త్తము దాన నతండు సర్వధర్మకరుఁ డగున్. |
550 |
| క. |
ఆ తెఱఁ గఘములఁ బాచును | బాతకములు వాయ మొగులు వాసిన సంప్ర ద్యోతితుఁ డగు నమృతాంశుని | భాతి వెలుఁగు నాత్మమోక్షపద మది సుండీ! |
551 |
| క. |
మనసును వాక్కును రక్షం | బనుపడు నెవ్వనికి శ్రుతి తపస్త్యాగము లా తని చేతిలోని వగునని | మునిజనములచేత విందుము నిరంతరమున్. |
552 |
| క. |
పలుకు వడినతనిఁ బాపం | బులు విడుచుం బలికినతనిఁ బొందును బాపం బులు నొరుపాపము దనపై | నొలయింపఁగనేల నింద యుడిగినఁ గాదే. |
553 |
| క. |
కుపితుఁ డగువాని వ్రతమును | జపమును దేవార్చనంబు శ్రాద్ధక్రియయుం దపమును దానము యజనము | నపగతములు గాఁగఁజేయు నంతకుఁ డలుకన్. |
554 |
| చ. |
పలుకక యుండుకంటెఁ దగఁ బల్కుట మేలు; వినుండు! సత్యముం బలుకుట ధర్మమార్గమునఁ బల్కుట సర్వజన ప్రియంబుగాఁ బలుకుట యోలి నెక్కుడగు భంగులు; వీని నెఱింగి యొండుమైఁ బలుకక నాల్గుచందములఁ బల్కఁగ మెత్తురు వాని దేవతల్. |
555 |
| క. |
సత్యక్షమాదమంబులు | నిత్యపదంబునకు నెక్కు నిచ్చెన; యవి సం గత్యనుగతములు సత్సాం | గత్యం బటు గాన ముఖ్యకార్యము సుండీ!’ |
556 |
| వ. | అని సత్య క్షమా దమ ప్రకారవిషయంబు లైన వాక్యంబులు సెప్పిన విని కృతార్థులై సాధ్యులు సంతోషించి వెండియు హంసంబున కిట్లనిరి. | 557 |
| క. |
‘ఏమిట లోకం బావృత? | మేమిటఁ దా వెలుఁగకుండు? నేమిట మిత్ర స్తోమంబు విడుచుఁ దనుఁ గా | దేమిట మోక్షంబు? మాకు నెఱిఁగింపు దయన్.’ |
558 |
| వ. | అనుటయు. | 559 |
| ఉ. |
ఆనతవైరి! యిట్టులను హంసము వారలతోడ ‘లోక మ జ్ఞానముచేత నావృతము సంభృతమత్సరుఁడైన వే ఱగుం దాను బ్రకాశసంపదకుఁ దన్ విడుచుం దెగి మిత్రకోటిలో భానుగతిన్ విమోక్షపద మందదు సంగముకల్మి నెమ్మెయిన్.’ |
560 |
| వ. | అనిన వారు మరాళంబున కిట్లనిరి. | 561 |
| క. |
‘ఎవ్వఁడు రమించు నొక్కఁడ, | యెవ్వఁడు పెక్కండ్రఁ బ్రీతి నెసఁగఁగఁజేయున్, నివ్వటిలు నెవ్వనికి బల | మెవ్వఁడు కలహంబు వెంట కెంతయుఁ దొలఁగున్.’ |
562 |
| వ. | అని యడిగిన హంస యిట్లనియె. | 563 |
| క. |
‘ప్రాజ్ఞుఁడు రమించు నొక్కఁడ; | ప్రాజ్ఞుఁడు పెక్కండ్రఁ బ్రీతిఁ బరఁగఁగఁ జేయున్; బ్రాజ్ఞుఁడు బలవంతుం డగుఁ; | బ్రాజ్ఞుఁడు కలహమునఁ దొట్టుపడక తొలంగున్. |
564 |
| వ. | అని చెప్పిన రాయంచతో సాధ్యు లిట్లనిరి. | 565 |
| తే. |
‘విప్రుఁడేమిట దేవత్వవిభవ మొందు? | నేమి కతమున సాధుత్వ మెసకమెసఁగు? నతని కెద్ది యసాధుత్వ మావహించు? | మానుషుం డగు నెద్దాన? మహితమూర్తి! |
566 |
| చ. |
అనుటయు హంస మిట్టులను ‘నధ్యయనంబున దేవభావముం గను; వ్రతవృత్తి సాధువనఁగాఁ జరియించు; జనం బసాధు నాఁ జనుఁ బరివాదశీలమున; శౌచవిహీనత మృత్యుభీతి వొం దిన మదిలోన నెక్కొనిన దీనత విప్రుఁడు మానుషుం డగున్.’ |
567 |
| క. |
అని పలికి సాధ్యులకుఁ దన | తను విభవము సూపి సమ్మదంబున వారల్ దనుఁగొలువ నిజనివాసం | బున కేఁగె నజుండు నగవు మొగమున నెఱయన్. |
568 |
| వ. | అని చెప్పి భీష్ముండు. | 569 |
| ఉ. |
‘సాదరవృత్తి సాధ్యులఁ బ్రహర్ష సమేతులఁ జేయఁ బూని సం వాదము సేసె దేవముని వంద్యుఁ డజుం; డిది సేయు నాయురు త్పాదన మిచ్చు సంతతశుభంబులు గీర్తి యొనర్చుఁ బుత్రపౌ త్రోదయ మావహించు భరతోత్తమ! తన్ వినినన్ బఠించినన్.’ |
570 |
| వ. | అనిన విని ధర్మనందనుండు శంతనునందనుతో ‘సాంఖ్యయోగంబుల తారతమ్యంబులుం దత్స్వరూపం బులు నెఱింగింపవే’ యనుటయు, నమ్మహీపతికి నమ్మహాత్ముం డిట్లనియె. | 571 |