| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - షష్ఠాశ్వాసము |
| వ. | జనకజనేశ్వరు బోధించుటకై వసిష్ఠ మునీశ్వరుం డి ట్లనియె. | 4 |
| క. |
‘నయనముఖ పాణిపాదము | లయమహితా! యెందుఁ గలిగి యాద్యంతపరి క్షయవృద్ధి రహితమై ని | ర్ద్వయ మగు తత్త్వంబు నక్షరంబండ్రు బుధుల్. |
5 |
| క. |
క్షరమండ్రు దానివలనను | క్షరియించిన తత్త్వములను జనవత్సల! య య్యిరువది నాల్గింటిని దర | తరమ విభాగించి చెప్పెదం దెలియంగన్. |
6 |
| తే. |
అక్షరము విక్రియాశబలాత్మకత్వ | మొందు నవ్విక్రియకును బేళ్ళొలసెఁ బ్రకృతి యనఁ బ్రధానంబునాఁగ నవ్యక్త మనఁగ | దానఁబుట్టు మహన్నామతత్త్వ మనఘ! |
7 |
| తే. |
విను మహంకార మా తత్త్వమున జనించు | దాన భూతపంచకమును దద్గుణంబు లైన శబ్దాది విషయంబులైదు నింద్రి | యములుఁ బదియును మనసును నావహిల్లు. |
8 |
| క. |
క్షరమయ్యిరువది నాలుగు | నరనాథా! యక్షరంబునకు నెయ్యెడలన్ క్షరభావము లే దయ్య | క్ష రము విలాసములు సూవె క్షరతత్త్వమ్ముల్. |
9 |
| వ. | ఈ చతుర్వింశతి తత్త్వంబులును విజ్ఞానగోచరంబులు, పంచవింశతితమంబై యక్షరంబనం బరఁగు నిప్పరమతత్త్వంబు విను మవిజ్ఞేయం బవ్యయం బకలంకం బనామయం బమృతంబు. | 10 |
| క. |
జననాథ! యక్షరం బెం | దును గ్రీడఁ జరించుఁ ద్రిగుణ దోహలపరమై తనకుఁ బ్రబోధము లేకు | న్నను నానాయోనిగత జననముల వెంటన్. |
11 |
| క. |
విను సత్త్వరజస్తమముల | యనుసరణమువలన వివిధమగు యోనిగణం బున వెలసిన యా తత్త్వము | దనుఁ జూడఁగలేక యవియ తానని యుండున్. |
12 |
| ఉ. |
సత్త్వరజస్తమోగుణవశస్థితి నక్షర మర్హధర్మ సం గిత్త్వము మధ్యకర్మతయుఁ గిల్బిషకృత్యమునొంది యొంది ది వ్యత్వనరత్వగోమృగఖగాదిక తిర్యగనేక హీనజం తుత్త్వములన్ సుఖంబులును దుఃఖములున్ నరకంబులుం గనున్. |
13 |
| క. |
జనవర! శుక్లము లోహిత | మును గృష్ణమునైన వర్ణముల నక్షర మొం దును సత్త్వరజస్తమముల | యనుసారంబున నవర్ణమయ్యు వికృతమై. |
14 |
| క. |
అగుణంబయ్యును నిమ్మెయిఁ | బ్రగుణతఁ బ్రాపించు నక్షర మహంకార స్థగుణంబూఁదిన, విడిచినఁ | దెగు నన్నియు నిర్వికారదీప్తంబునగున్.’ |
15 |
| వ. | అని చెప్పి వెండియు. | 16 |
| చ. |
‘క్రతువులఁ దీర్థయాత్రలను రాత్ర్యశనంబుల భూమిశయ్యలన్ వ్రతపరినిష్ఠలన్ జడలు వల్కలముల్ వివిధంపు దండముల్ సతతముఁ దాల్చుటన్ వపువు సంకటపాటునఁ బెట్టు నాద్యమ చ్యుత మమలంబు దాను దనుఁ జూడక యక్షరమప్రబుద్ధమై. |
17 |
| క. |
అమృతము నభవము నజరము | నమలమునగు తన్ను మృతము నాహితభవమున్ సమథికజరమును మలసహి | తముగా నక్షరము మమతఁ దలఁచు నరేంద్రా! |
18 |
| ఆ. |
తనకుఁదాన బంధమొనరించుకొనియెడు | పొత్తినూలికాయ పురువు భంగి నగుణమయ్యు సగుణతావాప్తిఁ బొందు న | క్షరము ప్రకృతి గుణము సంక్రమించి. |
19 |
| ఆ. |
అమలవాయుసేవనము నిర్మలత్వంబు | గలుగఁగాఁ బదాఱు కళలఁ బూర్ణుఁ డగు సుధాంశు మాడ్కి నక్షర మమలినా | ఖండశాంతిబోధఘనత వెలుఁగు.’ |
20 |
| వ. | అనిన విని జనకుం డమ్మునీశ్వరున కిట్లనియె. | 21 |
| క. |
‘వనితకుఁ బురుషునకుం దన | తనయంతన రూపొకం డొదవఁ జేయఁగ వి న్ననువు గలుగ దొండొరువుల | నెనయుటఁగాని శ్రుతిమతము నిట్ల మహాత్మా! |
22 |
| క. |
వనితగుణంబులు చర్మం | బును మాంసము శోణితంబుఁ బురుషగుణతతిన్ విను మజ్జాస్థిస్నాయువు | లనఘతపోవిభవ! యిట్లయని శ్రుతి సెప్పున్. |
23 |
| వ. | అది తిర్యఙ్మనుష్యాదులైన సకల యోనులయందును జన్యంబులు ఆవహిల్లెడి తెఱంగు. | 24 |
| క. |
నరనారీసంబంధము | వరుసగదా పురుషునకును బ్రకృతికి నన్యో న్యరమణ మది సర్వజనన | కర మిట్టులు శ్రుతులు సెప్పుఁ గారుణ్యనిధీ! |
25 |
| క. |
వినుము ప్రకృతి పురుషుల భం | గి నిరూపింపంగ ముక్తికిని మార్గంబుం గను వెరవు లేకయున్నది | మునినాయక! యెఱుఁగఁ జెప్పు మోక్షపదంబున్. |
26 |
| క. |
అనుపమ మజర మతీంద్రియ | మనామయ మనంత మమల మన వెలుఁగు నొకం డని వేదశాస్త్రములచే | వినియుండుదు దానిఁ దెలుపవే కృప నాకున్.’ |
27 |
| వ. | అని వేఁడిన నమ్మునివరుండు సాదరంబుగా నతని కిట్లనియె. | 28 |